logo

అధికార పార్టీకి ఎన్నికల అధికారి కొమ్ముకాస్తున్నారు: కోడూరు

కలెక్టర్‌, ఎన్నికల అధికారి స్మృతి రంజన్‌ ప్రధాన్‌ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి కోడూరు నారాయణరావు ఆరోపించారు.

Published : 09 May 2024 04:18 IST

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నారాయణరావు, పక్కన చిత్రీ సింహాద్రి

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: కలెక్టర్‌, ఎన్నికల అధికారి స్మృతి రంజన్‌ ప్రధాన్‌ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి కోడూరు నారాయణరావు ఆరోపించారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, బిజద తరఫున ప్రచారం చేస్తున్న అధికారులపై ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకుండా వారికి మద్దతిస్తున్నారని మండిపడ్డారు. కాశీనగర్‌ సమితి పరతాడా పంచాయతీ కార్యనిర్వహణ అధికారి జాకబ్‌ గమాంగ్‌ ఎమ్మెల్యే అభ్యర్థితో ప్రచారం చేస్తున్న ఫోటోలు ఉన్నప్పటికీ, ఆయనపై చర్యలు తీసుకోకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. 3, 8 వార్డుల  రేషన్‌ డీలర్లు బసంతి పరిచా, జమీధర్‌ పట్నాయక్‌, గుసాని సమితి పాటికోట సొసైటీ కోపరేటివ్‌ సెక్రటరీ అడప వెంకట్‌రావు, మరికొందరిపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు.మంగళవారం మధ్యాహ్నం మంత్రి అతాను సవ్యసాచి నాయక్‌ పట్టణానికి చేరుకొని, కొద్ది సమయంలోనే వెళ్లిపోయారని, డబ్బులు చేతులు మారి ఉంటాయని, దర్యాప్తు చేపట్టాలని, దీనిపై జిల్లా ఎన్నికల అధికారి పూర్తి వివరాలు తెలియజేయాలని అన్నారు. వీటిపై జిల్లా, కేంద్ర ఎన్నికల పరిశీలకులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. బూత్‌ల వద్ద ఎన్నికల అధికారి వల్ల ప్రభుత్వ ఉద్యోగుల సహకారం తమకు తక్కువగా ఉందని, అందువల్ల తమ క్యాడర్‌ను అక్కడ ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని