logo

సగటు వేతనం రూ.. 197

ఉమ్మడి జిల్లాలో వలసల నివారణకు ఉపాధి పనులే ఆధారం. ఇందుకు అనుగుణంగా ఏటా అక్టోబరు నుంచి గుర్తించిన పనులకు గ్రామసభలు నిర్వహించి బడ్జెట్‌ ఆమోదం పొందుతున్నారు. 

Published : 27 Nov 2022 02:21 IST

ఇప్పటి వరకూ రూ.606.86 కోట్ల వ్యయం
వంద రోజుల పని కొందరికే
ఉపాధి హామీ పథకం తీరిది

రాజాం, న్యూస్‌టుడే

ఉమ్మడి జిల్లాలో వలసల నివారణకు ఉపాధి పనులే ఆధారం. ఇందుకు అనుగుణంగా ఏటా అక్టోబరు నుంచి గుర్తించిన పనులకు గ్రామసభలు నిర్వహించి బడ్జెట్‌ ఆమోదం పొందుతున్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఆ పనులు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది తొలి విడతలో కేటాయించిన పనిదినాలు పూర్తి కావడంతో అదనంగా మంజూరు చేశారు. అవి కూడా పూర్తి కావొస్తున్నాయి. కొత్త వాటితో కలిపి 2.30 కోట్ల పనిదినాల్లో 92.56 శాతం ఇప్పటికే పూర్తయ్యాయి.

అడిగిన వారందరికీ...

జాబ్‌కార్డు పొందిన ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించాలి. అడిగిన వారందరికీ ఉపాధి చూపకపోతే  వేతనం చెల్లించాలనేది నిబంధన. ఉమ్మడి జిల్లాల్లో 2020-21లో 1,47,704 కుటుంబాలకు వంద రోజులు కల్పించగా గతేడాది 39,660 కుటుంబాలకే పరిమితమైంది. ఈ ఏడాది విజయనగరం జిల్లాలో 1,357, పార్వతీపురం మన్యం జిల్లాలో 2,903 కుటుంబాలు ఇంత వరకు వంద రోజులు చేసినట్లు గుర్తించారు. నాలుగు నెలల్లో మిగిలిన వారందరికీ చూపించడం అసాధ్యంగానే కనిపిస్తోంది.

* పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల్లో ఉన్న 447 పంచాయతీల్లో 2.40 లక్షల కుటుంబాలు జాబ్‌కార్డులు పొందగా 4.98 లక్షల మంది కూలీలున్నారు. 1.95 లక్షల కుటుంబాల్లోని 3.65 లక్షల మంది పనులు చేసేందుకు ఆసక్తి చూపుతుండగా.. 1.64 లక్షల కుటుంబాల్లోని 2.83 లక్షల మందికి ఇప్పటి వరకూ ఉపాధి కల్పించారు.


కేంద్రం ఇచ్చేది

ఏటికేడు కుటుంబ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాన్ని సవరిస్తూ వస్తోంది. గతేడాది రూ.245గా నిర్ణయించగా ఈ ఏడాది మరో రూ.12 పెంచింది.

ఇక్కడ అందేది

ఒక్కో వేతనదారునికి ప్రభుత్వం నిర్దేశించింది రూ.257 కాగా విజయనగరం జిల్లాలో ఇది రూ.202 లోపే ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.197 దాటడం లేదు.

ఎంత తేడా

ఈ లెక్కన విజయనగరం జిల్లాలో రోజుకు రూ.55 తగ్గిపోయింది. ఇక్కడ ఇంత వరకూ 135.43 లక్షల పనిదినాలు పూర్తయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో రోజుకు రూ.60 తగ్గింది. ఇక్కడ 77.46 లక్షల పనిదినాలు పూర్తి చేశారు. ఈ లెక్కన చూస్తే.. రెండు జిల్లాల్లో కూలీలు రూ.కోట్లలో వేతనాలను కోల్పోయారు.


గతం కంటే పెరిగింది.. కనీస వేతనం అయిదు నెలల కిందటి వరకూ రూ.165 గిట్టుబాటు అయ్యేది.  ఇప్పుడు రూ.197కు పెరిగింది. వచ్చే మూడు నెలల్లో రూ.220కు పెరిగేలా ప్రణాళిక సిద్ధం చేశాం. రాష్ట్రంలో 100 రోజుల పని ఎక్కువ కల్పించిన నాలుగు జిల్లాల్లో పార్వతీపురం మన్యం ఒకటి.

- రామచంద్రరావు, పీడీ, డ్వామా


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని