logo

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ కష్టాలు

జిల్లాల ఏర్పాటు తర్వాత పార్వతీపురం ప్రజలకు సౌకర్యాల కంటే సమస్యలే అధికమవుతున్నాయి. ముఖ్యంగా పట్టణంలో రహదారులు, ఉద్యాన కేంద్రాలు, మూత్ర విసర్జన స్థలాలు, పార్కింగ్‌ స్థలాలు, తాగునీరు లాంటి వసతులు పూర్తిస్థాయిలో సమకూరడం లేదు.

Published : 30 Jan 2023 03:18 IST

పార్వతీపురం ప్రధాన రహదారిలో ఇదీ పరిస్థితి..

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాల ఏర్పాటు తర్వాత పార్వతీపురం ప్రజలకు సౌకర్యాల కంటే సమస్యలే అధికమవుతున్నాయి. ముఖ్యంగా పట్టణంలో రహదారులు, ఉద్యాన కేంద్రాలు, మూత్ర విసర్జన స్థలాలు, పార్కింగ్‌ స్థలాలు, తాగునీరు లాంటి వసతులు పూర్తిస్థాయిలో సమకూరడం లేదు. జిల్లా కేంద్రంగా మారిన తర్వాత పార్వతీపురానికి వచ్చే వారి సంఖ్య భారీగా పెరిగింది. స్పందన కార్యక్రమంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు రోజూ 15 మండలాల నుంచి ప్రజలు వస్తుండటంతో పట్టణ రహదారులు రద్దీగా మారుతున్నాయి. దీంతో పాటు వాటిని పార్కింగ్‌ చేసే స్థలాలు లేక రోడ్లపైనే నిలిపేస్తున్నారు. కనీసం పాదచారులు వెళ్లేందుకు కూడా దారి లేకుండా పోతుంది.

పెరిగిన రాకపోకలు..

పార్వతీపురంలోని 30 వార్డుల్లో 60 వేలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ సుమారు 12 వేల నుంచి 15 వేల వరకు వివిధ రకాల వాహనాలున్నాయి. వీటితో పాటు ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి రోజుకు సుమారు 10 నుంచి 15 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ రోడ్ల విస్తరణ జరగక పోవడంతో ఇరుకుగా మారుతున్నాయి. ఇక్కడ దుకాణాలు, బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, కల్యాణ మండపాలు మొదలైన ప్రాంతాల్లో పార్కింగ్‌ చేసే వీలు లేక చాలా మంది రోడ్లపైనే వదిలేస్తున్నారు.  


ఈ ప్రాంతాల్లో సమస్య..

పార్వతీపురం పట్టణం 11 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. బెలగాం శివారు నుంచి రాయగడ రోడ్డు వరకు సుమారు రెండు కిలో మీటర్ల పొడుగునా దుకాణాలు, బ్యాంకులు, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. వీటితో పాటు రోడ్డు పక్కన చిల్లర వ్యాపారాలు, తోపుడు బళ్లు దర్శనమిస్తాయి. ముఖ్యంగా బెలగాం చర్చికూడలి, ఆర్టీసీ కాంప్లెక్సు, స్టేట్‌ బ్యాంకు కూడలి, సౌందర్య రోడ్డు, మేధర వీధి, నెయ్యిల వీధి కూడలి, పురపాలిక మార్కెట్‌, నాలుగు రోడ్ల కూడలి, పాతబస్టాండ్‌, ఆర్టీసీ కూడలి సమీపంలో వైఎస్సార్‌ బొమ్మ నుంచి బైపాస్‌ రోడ్డు మలుపు వరకు, రాయగడ రోడ్డులో సమస్య ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి కొన్నేళ్ల క్రితం పోలీసు, పుర, రెవెన్యూ అధికారులు ఆలోచన చేశారు. పార్కింగ్‌ స్థలాల ఏర్పాటుకు అనువైన స్థలాల కోసం అన్వేషించారు. అనంతరం అధికారులు మారడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.


నిరంతర పర్యవేక్షణ..
- పాపారావు, ట్రాఫిక్‌ ఎస్‌ఐ, పార్వతీపురం

పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూసేందుకు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. రోడ్లపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రధాన కూడళ్ల వద్ద ఇబ్బందులు ఎదురవ్వకుండా చూస్తున్నాం. ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి శ్రద్ధ చూపుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని