logo

మింగేస్తున్నారండి.. ‘భూములు, స్థలాలు’

పార్వతీపురం జిల్లా కేంద్రంగా అవతరించిన తర్వాత సమీపంలోని భూమి విలువ భారీగా పెరిగింది. దీంతో ఏ తోడు లేని వారి స్థలాలపై ఆక్రమణదారులు కన్నేస్తున్నారు.

Updated : 31 Jan 2023 04:46 IST

పార్వతీపురం, న్యూస్‌టుడే: పార్వతీపురం జిల్లా కేంద్రంగా అవతరించిన తర్వాత సమీపంలోని భూమి విలువ భారీగా పెరిగింది. దీంతో ఏ తోడు లేని వారి స్థలాలపై ఆక్రమణదారులు కన్నేస్తున్నారు. చివరికి ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన జగనన్న కాలనీల్లోని స్థలాలను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. దీనిపై అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం చేయడం లేదని బాధితులు వాపోతున్నారు. గతంలో ఇదే సమస్యపై అర్జీలు ఎక్కువగా రావడంతో కలెక్టర్‌ చొరవ చూపి ఆక్రమణలకు అడ్డుకట్ట వేశారు. కొన్నాళ్లు మౌనంగా ఉన్న కబ్జాదారులంతా మళ్లీ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తోచక బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జేసీ ఒ.ఆనంద్‌, ఐటీడీఏ పీవో విష్ణుచరణ్‌ ఆధ్వర్యంలో జరిగిన స్పందనకు వచ్చిన 96 అర్జీల్లో ఇలాంటివే ఎక్కువ ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


మాజీ సైనికుల భూమినీ ఆక్రమించేశారు

పార్వతీపురానికి చెందిన బెహరా అమ్మాజీ భర్త సైన్యంలో పనిచేశారు. మాజీ సైనికుల కోటాలో పార్వతీపురం మండలం మరికిలో ఆమె భర్త పేరుమీద ఐదెకరాలు భూమి ప్రభుత్వం ఇచ్చింది. ప్రస్తుతం ఆ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని,   న్యాయం చేయాలని కోరారు.  


ఫిర్యాదు చేసినా ఇల్లు కట్టేస్తున్నారు

ఈమె పేరు తులసి. పార్వతీపురంలో ఈమెకు జగనన్న కాలనీలో స్థలం కేటాయించారు. ప్రస్తుతం అక్కడ వేరే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టడంతో తనకిచ్చిన పట్టాతో కలెక్టరేట్‌కు వచ్చారు. ఇల్లు కట్టిన వారికి ఇప్పటి వరకు అయిన మొత్తం చెల్లిస్తామని చెప్పినా ఖాళీ చేయడం లేదని వాపోయారు. ఇదే సమస్యపై ఇప్పటికే పలుమార్లు అర్జీలు ఇచ్చినా స్పందన లేదని కన్నీరుమున్నీరయ్యారు.


దివ్యాంగులం కనికరించండి

పార్వతీపురానికి చెందిన ఈ దంపతులు దివ్యాంగులు. ఇద్దరికీ కాళ్లు పని చేయవు. వీరికి స్థానిక ఆశాజ్యోతి ఆశ్రమం సమీపంలో జగనన్న కాలనీలో స్థలం కేటాయించగా గృహనిర్మాణ సంస్థకు చెందిన ఓ వ్యక్తి అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నాడని గత వారం ఫిర్యాదు చేశారు. అయినా పనులు ఆపకపోవడంతో కలెక్టరేట్‌కు రాగా గృహ నిర్మాణ సంస్థ ఏఈ వద్దకు వెళ్లాలని  అధికారులు చెప్పారని బాధితుడు చినతల్లి వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని