logo

జగన్‌ పాపం.. రైతులకు శాపం

‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్‌ సర్కారు   కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు  పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం,

Published : 25 Apr 2024 04:45 IST

నదుల అనుసంధానం పనులపై ముఖ్యమంత్రి శీతకన్ను
న్యూస్‌టుడే, సంతకవిటి

అయిదేళ్లుగా నిలిచిన కల్వర్టు పనులు

‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్‌ సర్కారు   కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు  పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల రైతులకు తీరని అన్యాయం జరిగింది. అనుసంధానం పనులు పూర్తయితే ఆయకట్ట రైతులు రెండు పంటల సాగుకు అవకాశం వస్తుంది. ఇటువంటి మహత్తరమైన పనులపై ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి మోకాలడ్డడంతో అన్నదాతలకు తీరని నష్టం వాటిల్లింది.

అన్నదాత మేలుకు..

నాగావళి నదిపై తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టులు నిర్మించడంతో ఈ నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్టకు రావాల్సిన నీటి వాటా తగ్గిపోయింది. ఏటా ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. నాగావళి నదిలో తమనీటి వాటాను విడిచిపెట్టాలని ఈ ప్రాంత రైతులు జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎన్నో పోరాటాలు చేస్తూ వచ్చారు. 2017లో వారి ఇబ్బందులు తెలుసుకున్న ముఖË్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వంశధార - నాగావళి నదులను అనుసంధానించి సాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆలోచించారు. 2017 నవంబరులో నదుల అనుసంధానానికి రూ.69.78 కోట్లు మంజూరు చేశారు. హిరమండలం జలాశయం నుంచి నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట ఎగువ ప్రాంతంలో రెండు నదులను అనుసంధానించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం 33.583 కి.మీ. పొడవున ప్రధాన కాలువ తవ్వకం పనులను పరుగులు పెట్టించారు. మూడేళ్లలో 60 శాతం పనులు పూర్తి కాగా.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటిపై శీతకన్నేసింది. అయిదేళ్లలో కంటి తుడుపులా 20 శాతం పనులు మాత్రమే జరిగాయి.

నారాయణపురం ఆనకట్ట సమీపంలో నాగావళి నదిలో కలిసే ప్రాంతంలో రెండేళ్లుగా నిలిచిపోయిన పనులు

చేపట్టాల్సిన పనులు ఇవే

వంశధార నదిపై ఉన్న హిరమండలం జలాశయం నుంచి హైలెవెల్‌ కెనాల్‌ ద్వారా నాగావళి నదికి అనుసంధానించే బృహత్తర ప్రణాళిక ఇది. ఇందుకోసం నిర్మించాల్సిన 33.583 కి.మీ. అనుసంధాన ప్రధాన కాలువకు 64 వంతెనలు, 50కి పైగా చిన్న నిర్మాణాలు చేపట్టాలి. తెదేపా ప్రభుత్వ హయాంలోనే 44 వంతెనల పనులు పూర్తయ్యాయి. 30.5 కి.మీ. మేరకు ప్రధాన కాలువ తవ్వకం పూర్తయింది. లంకాలం, నారాయణఫురం తదితర గ్రామాల వద్ద భూసేకరణ సమస్యతో మూడు కి.మీ. మేర కాలువ పనులు నిలిచిపోయాయి. తరవాత అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కారు పట్టించుకోకపోవడంతో ఏడేళ్లు కావస్తున్నా పనులు పూర్తి కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంశధార - నాగావళి అనుసంధానం పనులు చివరిదశలో ఉన్నాయని,  ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని వంశధార ప్రాజెక్టు ఎస్‌ఈ డోల తిరుమలరావు తెలిపారు.


పెరిగిన అంచనా విలువ..

వంశధార-నాగావళి నదుల అనుసంధానానికి 2017 నవంబరులో అప్పటి తెదేపా ప్రభుత్వం రూ.69.78 కోట్లు మంజూరు చేసింది. పనుల్లో జాప్యం వల్ల 2021లో అంచనా విలువ రూ.145 కోట్లకు చేరింది. ఇంతవరకు అనుసంధాన పనులకు రూ.115 కోట్లు వెచ్చించారు. చేపట్టిన పనులకు, భూసేకరణ తదితరాలకు మరో రూ.20 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంది.


ఏటా పంటలు నష్టపోతున్నాం
 - ఎం.లచ్చోడు, రైతు, భగీరథపురం

వర్షాలు పడితే తప్ప నారాయణపురం కుడి ప్రధాన కాలువ ద్వారా శివారు ఆయకట్టుకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. ఏటా ఖరీఫ్‌లో పంటల సాగుకు రూ.వేలు పెట్టుబడులు పెట్టినా నీరందక ఎండిపోతున్నాయి. అప్పులు పాలవుతున్నాం. కాలువ ద్వారా సాగునీరు అందిస్తే కష్టాలు తీరే అవకాశం ఉంది.  


వేగంగా పూర్తిచేయాలి
- వి.కామయ్య, రైతు, ముద్దాడ

నాగావళి-వంశధార నదుల అనుసంధానం పనులు పూర్తయితే మా కష్టాలు తీరుతాయని ఎంతో ఆశపడ్డాం. ఏడేళ్లుగా ఈ పనులు జరగడం లేదు. త్వరితగతిన అనుసంధానం పనులు పూర్తి చేసి రైతులకు సాగునీటి కష్టాల నుంచి విముక్తి కలిగించాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని