logo

దేవుడికే ‘జగన్‌’ శఠగోపం

శతాబ్దాల చరిత్ర సొంతం.. ఉట్టిపడే శిల్పకళా సౌందర్యం.. భక్తకోటికి దైవసాన్నిహిత్యం.. ఇలా ఎన్నో విశిష్టతల సమాహారం.. అందుకే ఉభయ జిల్లాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలది ప్రత్యేక స్థానం..

Updated : 07 May 2024 05:24 IST

ఆలయాల అభివృద్ధికి మేము వ్యతిరేకం

శతాబ్దాల చరిత్ర సొంతం.. ఉట్టిపడే శిల్పకళా సౌందర్యం.. భక్తకోటికి దైవసాన్నిహిత్యం.. ఇలా ఎన్నో విశిష్టతల సమాహారం.. అందుకే ఉభయ జిల్లాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలది ప్రత్యేక స్థానం.. నాడు ఉత్తరాంధ్రలో ఆధ్యాత్మిక నిలయాలుగా భాసిల్లినా.. నేడు పూర్వ వైభవం కోల్పోతున్నాయి.. వందలాది ఎకరాల మాన్యాలు ఉన్నా.. పురోభివృద్ధికి అవకాశాలున్నా.. ఆ దిశగా ప్రభుత్వ చర్యలు కొరవడుతున్నాయి. గత అయిదేళ్ల వైకాపా పాలనలో.. ఇటు విస్తరణకు, అటు సరైన నిర్వహణకు నోచక పలు దేవాలయాలు దీనావస్థలో ఉన్నాయి. వీటి అభివృద్ధికి పాలకుల హామీలు ఒట్టిమాటలే అయ్యాయి.


చదురుగుడి విస్తరణ ఎప్పటికో..!

పైడితల్లి దేవస్థానం పక్కన దుకాణాలు తొలగించిన స్థలం

 ఉత్తరాంధ్రలో విజయనగరం పైడితల్లి దేవస్థానానికి ప్రత్యేక స్థానం ఉంది. నగరంలో మూడు లాంతర్లు వద్ద ఇరుకు స్థలంలో ఉన్న చదురుగుడిలో అమ్మవారి దర్శనానికి భక్తులకు ఇరకాటం తప్పడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని 2016లో తెదేపా ప్రభుత్వ హయాంలో ఆలయాన్ని విస్తరించాలన్న ఆలోచన చేశారు. అప్పట్లో ఎదురుగా ఉన్న ఎడ్వర్డ్‌ ఆసుపత్రి స్థలం 58 సెంట్లను రూ.1.19 కోట్లకు కొనుగోలు చేసి.. ఆ స్థలాన్ని ఆలయానికి ఇరుపక్కలా ఉన్న వ్యాపారులకు ఇచ్చి, వారి దుకాణాలను తొలగించి దేవస్థానాన్ని విస్తరించాలని నిర్ణయించారు. 2019లో వైకాపా ప్రభుత్వం రావడంతో విస్తరణ దిశగా చర్యలు మందగించాయి. తూర్పువైపు రెండు, పడమర వైపు మూడు దుకాణాలు తొలగించి చదును చేశారు. దుకాణాలను తీసుకున్న నాటికే మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేయాల్సి ఉన్నా.. ఇంతవరకు ఆలయ విస్తరణపై స్పష్టత కొరవడింది. త్వరలో మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తామని, రూ.15 కోట్ల్ల ఖర్చుతో ఆలయ కాంప్లెక్సు అభివృద్ధి చేస్తామని దేవస్థానం సహాయ కమిషనర్‌ డి.వి.వి.ప్రసాదరావు తెలిపారు.

    - న్యూస్‌టుడే, విజయనగరం కంటోన్మెంట్‌


 శంబర పోలమాంబ
ఇరకాటం.. ఇబ్బందికరం

ఇళ్ల మధ్యలో పోలమాంబ అమ్మవారి ఆలయం

ఉత్తరాంధ్రుల ఇలవేల్పుగా, గిరిజనుల ఆరాధ్య దైవంగా శంబర పోలమాంబ పూజలందుకుంటోంది. గ్రామ మధ్యలో ఇరుకు స్థలంలో ఉన్న ఆలయం అభివృద్ధి విస్తరణకు నోచుకోవడం లేదు. ఏటా జనవరిలో జరిగే సిరిమానోత్సవం, అనంతరం పదివారాల పాటు సాగే జాతరకు వేలాదిగా భక్తులు తరలివస్తారు.  వనంగుడి, చదురుగుడిలో అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఏడాది పొడవునా ఆలయానికి వస్తుంటారు. ఈ ఏడాది నుంచి రాష్ట్ర గిరిజన దేవత పండగగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి పీడిక రాజన్నదొర, అధికారులు ప్రకటించినా పనులు మాత్రం జరగలేదు. ఆలయ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరైనట్లు ఈవో వీవీ సూర్యనారాయణ ప్రకటించారు. ఆలయ విస్తరణ, భక్తుల విశ్రాంతికి షెడ్డు, ఆలయాల చుట్టూ రక్షణ గోడ, శాశ్వత క్యూలైన్లకు షెడ్లు, ఐటీడీఏ ద్వారా పార్క్‌, ఇతర పనులు చేపడతామన్నా..ఆ దిశగా అడుగులు పడలేదు.
- న్యూస్‌టుడే, మక్కువ


రామతీర్థం దేవస్థానం
నత్తనడకన సుందరీకరణ పనులు

రెండో భద్రాద్రిగా గుర్తింపు పొందిన రామతీర్థం దేవస్థానంలో ఆధునికీకరణ నోచుకోవడం లేదు. దేవదాయశాఖ సీజేఎఫ్‌ నుంచి రూ.కోటి కేటాయించినా.. అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. ప్రధాన దేవాలయంలో గ్రానైట్‌ పలకల పేర్పు, యాగశాల, ఇతర అభివృద్ధి పనులు పూర్తి కాలేదు. అసంపూర్తి పనులతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉత్తర రాజగోపురం సుందరీకరణ పనులు కార్యరూపం దాల్చలేదు. దీనిపై దేవస్థానం ఈవో వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ గుత్తేదారులతో మాట్లాడి పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
- న్యూస్‌టుడే, నెల్లిమర్ల


తోటపల్లి దేవస్థానం
నిధులున్నా నిర్లక్ష్యమే..

తోటపల్లిలో వేంకటేశ్వర కోదండ రామాలయం దేవస్థానం గురించి ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో భక్తులే అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకొని..  రూ.45 లక్షలు పోగుచేసి పనులు చేపడుతున్నారు. ప్రధాన వేంకటేశ్వరస్వామి, పుట్టుదేవుడు, గణపతి, ఆంజనేయస్వామి ఆలయాలను పునర్నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన ఆలయం గచ్చుల పనులకు పలకలు రప్పించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. నాలుగేళ్ల క్రితం దేవస్థానం అభివృద్ధికి దేవదాయశాఖ సీజీఎఫ్‌ నిధులు రూ.86 లక్షలు మంజూరు కాగా ఇటీవల మరో రూ.కోటి వచ్చినా కోడ్‌ కారణంగా ఖర్చు చేయలేని పరిస్థితి. దేవస్థానం ఈవో వి.వి.సూర్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు మంజూరైన రూ.కోటితో త్వరలో టెండర్లు పిలిచి అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.
- న్యూస్‌టుడే, గరుగుబిల్లి


పుణ్యగిరి శైవక్షేత్రం
సీఎం హామీ శివునికి ఎరుకే..

శృంగవరపుకోట పట్టణ శివారునున్న ఉమాకోటిలింగేశ్వరస్వామి ఆలయం గత అయిదేళ్ల కాలంలో ఎలాంటి విస్తరణకు నోచుకోలేదు. తూర్పుకనుమల్లో పుణ్యగిరిపై విరాజిల్లుతున్న శైవక్షేత్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి నుంచి స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వరకు హామీలిచ్చినా నెరవేర్చలేదు. నడవడానికి వీల్లేని 360 మెట్లకు  ప్రత్యామ్నాయంగా కిలోమీటరు మేర ఘాట్‌రోడ్డు నిర్మించాలన్న ప్రతిపాదనలు ఉన్నా ఆ దిశగా అడుగులు పడటం లేదు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి పర్యాటక శాఖ మంత్రి గీతారెడ్డి రూ.15 లక్షలు మంజూరు చేయగా.. జడ్పీ నిధులు కూడా కేటాయించారు. పనులు మాత్రం జరగలేదు. ప్రస్తుత ఎంపీ కోటా నిధులు రూ.14.85 లక్షలు మంజూరైనా ఖర్చు కాలేదు. ప్రభుత్వ చొరవ చూపక కొండపైకి రహదారి భక్తుల కలగానే మిగిలిపోతోంది.
- న్యూస్‌టుడే, శృంగవరపుకోట


బొబ్బిలి వేణుగోపాలుడు
రూ.కోట్లున్నా.. స్వామికి పస్తులే!

బొబ్బిలిలో వెలసి ఉన్న వేణుగోపాలస్వామికి రూ.కోట్లు ఆస్తులున్నా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. వేల ఎకరాల భూములు, కిలోల కొద్దీ బంగారం, వెండి, ఇతర ఆభరణాలు ఉన్నా ఆలయంలో ధూప దీప నైవేద్యాలకు కష్టమవుతోంది. ఆలయ అనువంశిక ధర్మకర్త సుజయకృష్ణ రంగారావు భోగం, ఇతర నిర్వహణ ఖర్చులు భరిస్తున్నారు. మూడేళ్ల కిందట వైకాపా ప్రభుత్వం ఆలయ ఆస్తులను లెక్కించి హడావుడి చేసినా అభివృద్ధిని గాలికి వదిలేసింది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఆలయానికి మరమ్మతులు చేపట్టినా.. ఈ ప్రభుత్వం నిర్వహణ పనులపై దృష్టి పెట్టలేదు. ఇక్కడ కల్యాణ మండపాలు, ఇతర సౌకర్యాలేవీ లేవు. భక్తులు నిరీక్షణకు సరైన వసతులు లేవు. ఈవో కార్యాలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. భూముల నుంచి ఆదాయం పూర్తి స్థాయిలో రావడం లేదని, భక్తుల కానుకల రూపంలో వచ్చే మొత్తాల నుంచి సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నామని దేవస్థానం ఈవో ప్రసాద్‌ తెలిపారు.
- న్యూస్‌టుడే, బొబ్బిలి


పాలకొండ కోటదుర్గమ్మ
పాలకవర్గం లేదు..  అభివృద్ధి కానరాదు

ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవంగా పాలకొండ కోటదుర్గమ్మ భాసిల్లుతోంది. ముఖ్య పనులే కాదు..  నామినేషన్‌ వేయాలన్నా.. అమ్మవారిని దర్శించుకోనిదే అడుగెయ్యరు. ఈ ఆలయాన్ని గత అయిదేళ్లూ పాలకులు పట్టించుకోలేదు. ఏటా రూ.50 లక్షల మేరకు హుండీల ద్వారా ఆదాయం సమకూరుతున్నా అభివృద్ధి అంతంతమాత్రమే. అదీ భక్తుల విరాళాలతోనే జరుగుతోంది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న దేవస్థానానికి ప్రాకారమే లేదు. కేశఖండనశాల లేదు.  వైకాపా హయాంలో పాలకవర్గం లేక ఎటువంటి నిర్ణయాలు తీసుకొనేందుకు వీలు కాలేదు. తాత్కాలిక ఉత్సవ కమిటీల పేరిట కాలం వెళ్లబుచ్చుతున్న పరిస్థితి. ఆలయం పక్కన పశుసంవర్ధక శాఖ ప్రాంతీయాసుపత్రి స్థలాన్ని సేకరించేందుకు గత పాలకవర్గం తీసుకున్న నిర్ణయం అమలు కాలేదు.
- న్యూస్‌టుడే, పాలకొండ/ గ్రామీణం

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని