logo

మా ‘గడప’కొస్తే.. తరిమికొడతాం!!

 నమ్మి ఓట్లేశాం.. అభివృద్ధి చేస్తారని భావించాం.. మా పిల్లలకు భవిష్యత్తునిస్తారని కలలుగన్నాం.. కానీ ఈ ఐదేళ్లలో ఆక్రమణలపై పెట్టిన దృష్టి మా కష్టాలపై పెట్టలేదు..మా అవస్థలను చూడలేదు.. ఉద్యోగాల కోసం మా యువకులు పడుతున్న శ్రమను గుర్తించలేదు.

Published : 07 May 2024 04:54 IST

ఏంచేశారని ఓట్లడుగుతున్నారు

ఎమ్మెల్యేలకు జిల్లా వాసుల సూటిప్రశ్న

 నమ్మి ఓట్లేశాం.. అభివృద్ధి చేస్తారని భావించాం.. మా పిల్లలకు భవిష్యత్తునిస్తారని కలలుగన్నాం.. కానీ ఈ ఐదేళ్లలో ఆక్రమణలపై పెట్టిన దృష్టి మా కష్టాలపై పెట్టలేదు..మా అవస్థలను చూడలేదు.. ఉద్యోగాల కోసం మా యువకులు పడుతున్న శ్రమను గుర్తించలేదు.. ఇవన్నీ వదిలేసి గడప గడపంటూ మా ఇళ్లకొచ్చారు.. నిధులిచ్చి ప్రగతి చూపిస్తామన్నారు.. రెండు మూడేళ్లుగా అవే మాయమాటలు చెప్పారు.. మళ్లీ ఇప్పుడు ఓట్లడగడానికి వస్తున్నారు.. మిమ్మల్ని మళ్లీ నమ్మాలా.. లేక తరిమికొట్టాలా??

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: వైకాపా ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించి సమస్యలను గుర్తించి, పనులకు ప్రతిపాదించారు. ఒక్కో సచివాలయానికీ రూ.20 లక్షలు కేటాయించారు. 2023 డిసెంబరు నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉన్నా నేటికీ పూర్తిస్థాయిలో జరగలేదు. ఉమ్మడి జిల్లాలో 6,114కు 5,152 పనులు ప్రారంభించారు. ఇందులో 1466 మాత్రమే పూర్తి చేశారు. విజయనగరం జిల్లాలోని 21 మండలాల్లో ఈ నెల ఏడో తేదీ నాటికి రూ.కోటి లోపే నిధులు ఖర్చుచేశారు. విజయనగరం, భోగాపురం, గుర్ల మండలాల్లో ప్రగతి తక్కువగా ఉంది.

అధ్వానంగా దత్తిరాజేరు నుంచి దత్తి గ్రామానికి వెళ్లే దారి


బిల్లుల చెల్లింపుల్లో జాప్యం

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో రూ.11.14 కోట్లతో 180 పనులు ప్రతిపాదించారు. ఇంత వరకు రూ.6.81 కోట్ల విలువ చేసే 113 పనులు పూర్తి చేశారు. మరో 15 (రూ.1.35 కోట్లు) ప్రగతిలో ఉన్నాయి. 32 (రూ.2.19 కోట్లు) ప్రారంభం కాలేదు. 16 (రూ.69 లక్షలు) టెండర్ల దశలో ఉన్నాయి. నాలుగు (రూ.10.50 లక్షలు) రద్దయ్యాయి. గుత్తేదారులకు సకాలంలో బిల్లు రాకపోవడంతో కోడ్‌ రాక ముందే పనులు ఆపేశారు.
- న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం


నిలదీసినా అంతే..

గతేడాది అక్టోబరులో బొబ్బిలి గ్రామీణ మండలంలోని కోమటిపల్లిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు ఇంటింటికీ వెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు నిలదీశారు. తమ గ్రామంలో ఇంటింటికీ కుళాయిలు వేసి, నీరు అందిస్తామని హామీ ఇచ్చారని అయినా నెరవేర్చలేదన్నారు. దీంతో ఎమ్మెల్యే కంగుతిన్నారు. అయితే ఇటీవల ఆ గ్రామంలో జలజీవన్‌ మిషన్‌లో భాగంగా కుళాయిలు వేశారు. కానీ నీరు మాత్రం రావడం లేదని అక్కడి వారు చెబుతున్నారు. వీధి కుళాయిల ద్వారా రెండు, మూడు రోజులకోసారి సరఫరా సాగుతోందన్నారు.
- న్యూస్‌టుడే, బొబ్బిలి గ్రామీణం


అయినా స్పందించలేదు

వీరంతా మక్కువ మండలం కొత్తకాముడువలస గ్రామస్థులు. 2020 ఫిబ్రవరిలో ప్రస్తుత గిరిజనశాఖ మంత్రి పీడిక రాజన్నదొర ఈ ప్రాంతానికి వెళ్లినప్పుడు రోడ్డు, వంతెన ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ పనులు చేపట్టలేదు. దీంతో జనవరి, 2022లో స్థానిక గిరిజనులంతా రూ.60 వేల విరాళాలు పోగుచేసుకుని రహదారిని కొంతవరకు బాగుచేసుకున్నారు. ఇటీవల గడప గడపలో భాగంగా రాజన్నదొర మళ్లీ వెళ్లగా వినతిపత్రం ఇచ్చారు. అయినా స్పందించలేదని, తమను బాధలను సోమవారం ‘న్యూస్‌టుడే’ వద్ద వెల్లబోసుకున్నారు.
- న్యూస్‌టుడే, మక్కువ


ప్రతిపాదన 170.. పూర్తి 27

సాలూరు పట్టణంలోని 29 వార్డుల పరిధిలో 170 పనులకు రూ.5.60 కోట్లు కేటాయించారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు గుత్తేదారుల అవతారమెత్తి రూ.80.60 లక్షల విలువ చేసే 27 పనులు పూర్తి చేశారు. 17 ప్రారంభించలేదు. మరో 126కు టెండర్లు రావాల్సి ఉంది. దీంతో చాలాచోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
- న్యూస్‌టుడే, సాలూరు


మంజూరన్నారు.. మరిచిపోయారు

ఈ చిత్రంలో కనిపిస్తోంది గజపతినగరం మండలం పురిటిపెంట న్యూకాలనీ రహదారి. రెండు దశాబ్దాల కిందట వేశారు. పూర్తిగా గోతులమయంగా మారింది. పంచాయతీ కార్యాలయం, సచివాలయం, అంగన్వాడీ, వెలుగు, పంచాయతీ రాజ్‌, గృహ నిర్మాణ సంస్థ, ఆరోగ్యకేంద్రం, ఆండ్ర ఇరిగేషన్‌ కార్యాలయాలకు ఇదే దిక్కు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలలు ఈ మార్గంలోనే ఉన్నాయి. గడప గడపలో నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య హామీ ఇచ్చారు. స్థానికంగా ఉన్న మామిడిబంద కాలనీకి సైతం రోడ్డేస్తామన్నారు. ఈ మేరకు రూ.30 లక్షలు కేటాయించారు. ఏడాది గడుస్తున్నా పనులు జరగలేదు. మండలంలో మిగిలిన 21 సచివాలయాల పరిధిలోనూ ఇదే పరిస్థితి.
- న్యూస్‌టుడే, గజపతినగరం


హామీ ఇచ్చినా అమలు కాలేదు

గుర్ల మండలంలోని గుజ్జంగివలసలో ప్రధాన రహదారి అధ్వానంగా ఉంది. ఇక్కడ సీసీ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు మాత్రం జరగలేదు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా రూ.4.90 లక్షలొచ్చినా నిరుపయోగంగా మారాయి. ఈ మండలంలో 24కు 11 సచివాలయాల్లో పథకం కార్యక్రమం అమలుకు చర్యలు చేపట్టారు. ఎనిమిదింటి పరిధిలో పూర్తి చేశారు. కొండగండ్రేడు, గుజ్జంగివలస, ఎస్‌ఎస్‌ఆర్‌పేట సచివాలయాల పరిధిలో పనులు చేపట్టలేదు.        

- న్యూస్‌టుడే, గుర్ల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని