logo

ఐదేళ్లు కట్టలేక పోయారు

వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే వంశధార పరివాహక ప్రాంత రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని సీఎం జగన్‌మోహనరెడ్డి నెరవేర్చలేదు.

Published : 07 May 2024 04:59 IST

వంశధార పొడవునా ముంపు ముప్పు

రక్షణ కల్పించలేకపోయిన ప్రభుత్వం

ముంపునకు గురైన కీసర గ్రామం(పాతచిత్రం)

న్యూస్‌టుడే, భామిని: వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే వంశధార పరివాహక ప్రాంత రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని సీఎం జగన్‌మోహనరెడ్డి నెరవేర్చలేదు. దీంతో ఏటా నదీ తీరప్రాంత వాసులకు ముంపు ముప్పు తప్పని పరిస్థితి.

భారీ వర్షాలు కురిసినప్పుడు నదిలో ప్రవాహం పెరుగుతుంది. ఒడిశాలోని పద్మాపురం వద్ద కెందుగూడ డ్యామ్‌ నుంచి వరదనీరు విడుదల చేస్తే ఉద్ధృతి మరింత ఎక్కువవుతుంది. కరకట్టలు లేకపోవడంతో నది ఉప్పొంగి పలు తీర గ్రామాలతో పాటు పంట పొలాలను ముంచెత్తుతోంది. భామిని మండలంలోని కోసలి, కీసర గ్రామాల రైతులకు అపార నష్టం వాటిల్లుత్తోంది. 2018లో తిత్లీ తుపాను సమయంలో కీసర గ్రామం జలదిగ్భంధంలో చిక్కుకుపోయింది.  

వంశధార నది పొడవునా కుడి, ఎడమల వైపున 199 కిమీ మేర కరకట్టలు నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం 2007లో నాలుగు ప్యాకేజీలుగా విభజించి.. రూ.310 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు వెళ్లాయి.. అనుమతులు రాగా నదీతీరం వెంబడి నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించి 1200 ఎకరాలు అవసరం అవుతాయని గుర్తించారు. అప్పట్లో రైతుల నుంచి 600 ఎకరాల మేరకు సేకరించినా ఎలాంటి పరిహారం చెల్లించలేదు. ఆ తర్వాత 2017లో తెదేపా హయాంలో రూ.1057 కోట్లు మంజూరు చేయగా కట్టల ఏర్పాటు పనులు ప్రారంభించారు. ఇందులో రూ.15 కోట్లు ఖర్చుచేసి 8 శాతం మేర నిర్మించారు. ఆ తర్వాత పనులు నిలిచిపోవడంతో తీరప్రాంత వాసులకు ముంపు కష్టాలు తీరకుండా పోయాయి.

 


 పాలకుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం

ఏటా భారీ వర్షాలు, తుపాన్లకు కోసలి, కీసర గ్రామాల్లో పంట భూములు నీటమునుగుతున్నాయి. వైకాపా ప్రభుత్వం కరకట్టల నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నదికి వరదలు వచ్చినప్పుడల్లా దిక్కుతోచని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ అయిదేళ్లూ పాలకులు పట్టించుకోకపోవడంతో తీరప్రాంత వాసులకు కష్టాలు తప్పడం లేదు.   

 - పి.రాంబాబు, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు, కీసర, భామిని మండలం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని