logo

ఏం తినేది.. ఎలా బతికేది జగన్‌!

ఆర్థిక దన్ను లేకపోతే జీవితం సాఫీగా సాగదు. అందుకే సంపాదనలో కొంత మొత్తాన్ని మున్ముందు అవసరాలకు పొదుపు చేయడం అత్యవసరంగా భావిస్తారు. ఖర్చులు పోగా మిగిలితే పొదుపు చేయడానికి ఆస్కారం ఉంటుంది.

Published : 08 May 2024 04:46 IST

నిత్యావసరాలపై బాదుడే బాదుడు
భారీగా పెరిగిన ధరలతో జనం కుదేలు

న్యూస్‌టుడే-రాజాం: ఆర్థిక దన్ను లేకపోతే జీవితం సాఫీగా సాగదు. అందుకే సంపాదనలో కొంత మొత్తాన్ని మున్ముందు అవసరాలకు పొదుపు చేయడం అత్యవసరంగా భావిస్తారు. ఖర్చులు పోగా మిగిలితే పొదుపు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణంగా కుటుంబాల వారీగా ప్రాధాన్యాలు మారిపోవచ్చు. ఆదాయాలు వేర్వేరుగా ఉండొచ్చు. ఏ స్థాయి ఆదాయమున్నా.. అందులో 20 శాతం పొదుపు ఉంటేనే ఆ కుటుంబ నావ ఆర్థిక ఒడుదొడుకులకు లోను కాకుండా సాఫీగా సాగుతున్నట్లు లెక్క. ఒక ఆర్థిక నిపుణురాలి సమీకరణాల ప్రకారం.. బడ్జెట్‌ను రెండు రకాలుగా విభజించుకోవచ్చు. 80 శాతం ఖర్చు, 20 శాతం పొదుపు. రెండో లెక్క ప్రకారం 50 శాతం తప్పనిసరి అవసరాలకు, 30 శాతం అవసరాలు, కోరికలకు, 20 శాతం పొదుపునకు వెచ్చించగలిగితే ఆ కుటుంబం సాఫీగా సాగుతున్నట్లు ఒక లెక్క. ఆదాయాలు కోసుకుపోయి.. ఖర్చులు పెరిగిపోవడంతో ఈ ఆర్థిక లెక్కలన్నీ తలకిందులవుతున్నాయి.  ఉమ్మడి జిల్లాలో నెలకు సగటున కేవలం నిత్యావసరాల సరకులకే రూ.860 కోట్ల వరకూ ఖర్చవుతోంది. అయిదేళ్ల క్రితంతో పోల్చితే రెట్టింపు అదనపు భారం జనంపై పడినట్లు అంచనా వేస్తున్నారు. ఇతర ఖర్చులు కలిపితే అంచనాలు అందని రీతిలో ఉంది.

ఆర్టీసీ ఛార్జీల బాదుడే..

ఆర్టీసీ బస్సు ఛార్జీలు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగాయి. అయిదేళ్లలో ప్రయాణికులపై పెనుభారం పడింది. విజయనగరం రీజియన్‌ పరిధిలో బస్సులు రోజుకు 2.70 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నట్లు అంచనా. పల్లె వెలుగు బస్సులపై గతంలో ఒక్కో స్టేజికి రూ.2 వరకూ పెరగడం మోయలేని భారంగా పరిణమించింది. మొత్తంగా రూ.30 కోట్ల వరకూ అదనపు భారం పడినట్లు అంచనా వేస్తున్నారు.

ఉచిత బస్సు ప్రయాణం: జనం ఎదుర్కొంటున్న విషమ పరిస్థితిని గుర్తించి తెదేపా కూటమి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మేనిఫెస్టోలో చేర్చింది.

జీవితాలు తారుమారు

ఉపాధి లేక పేద, మధ్య తరగతి వర్గాల ఆదాయం పడిపోతుంటే.. నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయి. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఓ చేతితో రూ.10 ఇచ్చి మరో చేత్తో రూ.100 లాక్కుంటున్నారు. అయిదేళ్లలో పెరిగిన ధరలు ఆయా వర్గాల ఆర్థిక మూలాలను దెబ్బతీశాయి. ‘నలుగురు సభ్యులున్న కుటుంబానికి నెలవారీ కిరాణా సామగ్రికి హీనపక్షాన రూ.10 వేల వరకూ ఖర్చవుతోంది. గ్యాస్‌, ఇంటి బాడుగ, కరెంటు ఛార్జీలు, వాహనం ఉంటే ఇంధనం, పిల్లల ఫీజులు, టీవీ, చరవాణి బిల్లులు, వైద్యం ఖర్చులు.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా వరకూ నెలవారీ ఖర్చులున్నాయి. ఈ స్థాయిలో ఆదాయాలు పెరగకపోవడంతో మధ్యతరగతి, పేదలు తల్లడిల్లిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు ఉద్యోగి సగటు వేతనం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉంటుంది.

తెదేపా హామీ ఇదీ: ధరల పరిస్థితిని చక్కదిద్దేందుకు తెదేపా కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటామని, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని స్పష్టం చేసింది. కుటుంబంపై ఆర్థిక భారాన్ని తగ్గించే ఇంకొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించింది.

విద్యుదాఘాతమే..

విద్యుత్తు బిల్లులు పట్టుకుంటే జనాలకు షాక్‌ తగులుతోంది. గృహాలు, వాణిజ్యం, పరిశ్రమలు, ఇతర వర్గాలు ఇలా అన్నింటిపై భారం మోపారు. గడిచిన అయిదేళ్లలో వివిధ ఛార్జీల పేరుతో ఉమ్మడి జిల్లాలో రూ.500 కోట్లకు పైగా భారం మోపినట్లు ఒక అంచనా. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లను మినహాయిస్తే మిగిలిన 8.65 లక్షల కనెక్షన్లపై ఈ భారం పడింది. టారిఫ్‌లను మార్చడంతో బిల్లు గుభేలుమంటోంది. రెండు ఫ్యాన్లు, నాలుగు విద్యుత్తు దీపాలు, టీవీ, ఇతర వసతి ఉన్న ఒక పేద కుటుంబానికి రూ.800- రూ.1000 వరకూ బిల్లు వస్తోంది. ఇంట్లో ఏసీ ఉంటే నెలకు బిల్లు రూ.3 వేలపైనే దాటుతోంది. రోజుకు సగటున 11 మిలియన్‌ యూనిట్లు వినియోగం జరుగుతోంది.

విద్యుత్తు ఛార్జీల నియంత్రణ: తెదేపా మేనిఫెస్టోలో విద్యుత్తు ఛార్జీల నియంత్రణపై హామీ ఇచ్చింది. ఇంటి పైకప్పుపై కేంద్ర ప్రభుత్వ సోలార్‌ ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి పథకం ద్వారా  బిల్లుల భారాన్ని తగ్గిస్తామని, మిగులు విద్యుత్తును ప్రజల నుంచి కొనుగోలు చేస్తామని ప్రకటించింది.

వాహనం తీస్తే భారమే..

ఉమ్మడి జిల్లాలో లక్షల వాహనాలు ఉన్నాయి. రోజూ లక్షల లీటర్ల డీజిల్‌, పెట్రోలు వినియోగం అవుతోంది. ఒక ద్విచక్ర వాహనం వినియోగిస్తున్న ఒక ఉపాధ్యాయుడుకు రూ.4 వేలు వరకూ ఇంధనానికి ఖర్చవుతోంది. అయిదేళ్ల క్రితం రూ.2 వేలు ఖర్చయ్యేది. జగన్‌ అధికారంలోకి వచ్చాక సుంకాలను పెôచడంతో మిగిలిన రాష్ట్రాల కంటే ఇంధనం ధరలు పెరిగాయి. వీటిని తగ్గించేందుకు వైకాపా ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంతో రూ.వందల కోట్ల భారాన్ని అయిదేళ్లలో జనం భరించాల్సి వచ్చింది.

పెట్రో ధరలకు కళ్లెం: పెట్రోలు, డీజిల్‌ ధరలు నియంత్రిస్తామని తెదేపా మేనిఫెస్టోలో పేర్కొంది. వాహనాలపై గ్రీన్‌ ట్యాక్స్‌ తగ్గింపు, బ్యాడ్జ్‌ కలిగిన ప్రతి  ఆటో డ్రైవర్‌, ట్యాక్సీ డ్రైవర్‌, లారీ, టిప్పర్‌ డ్రైవర్లకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు