logo

నడి కూడలి.. అస్తవ్యస్త లోగిలి

పొదిలిలో వాహనాల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులుకావడంతో ఆర్టీసీతో పాటు ప్రైవేటు వాహనాల సంఖ్య పెరిగింది. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సైతం పెరిగాయి.

Published : 23 May 2024 02:22 IST

విస్తరించని రహదారితో చోదకులకు తప్పని అవస్థలు

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలిలో వాహనాల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులుకావడంతో ఆర్టీసీతో పాటు ప్రైవేటు వాహనాల సంఖ్య పెరిగింది. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సైతం పెరిగాయి. పట్టణంలో ఆర్‌అండ్‌బీ రహదారికి ఇరువైపులా ఉన్న వ్యాపారులు మూడు నుంచి నాలుగు అడుగులు ముందుకు వస్తున్నారు. దీంతో రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. చిన్నవాహనాలు, ద్విచక్రవాహనాలు వన్‌వేలోకి వస్తుండటం, అతివేగం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గతంలో ఈ రహదారిలో అమ్మవారిశాలవీధి వద్ద అంగన్‌వాడీ కార్యకర్త లారీ ఢీ కొనడంతో మృతి చెందింది. చిన్నబస్టాండ్‌లో పారిశుద్ధ్య కార్మికురాలు ప్రమాదానికి గురై చనిపోయింది. ఈ వారంలో పొదిలి-కంభాలపాడు మధ్యలో ఆటో-మినీ లారీ ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పొదిలి-దర్శి, పొదిలి-ఒంగోలు మార్గం నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. 

రోజుకు 3,000 వాహనాల రాకపోకలు..

ఒంగోలు-కర్నూలు ప్రధాన రహదారి పొదిలి పట్టణం మీదుగా పోతుంది. ఈ రహదారి గత రెండు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేదు. ఈ రహదారిలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పశ్చిమ ప్రాంతంలోని సుమారు 15 మండలాలకు ఏ అధికారైనా, నాయకులైనా వెళ్లాలన్నా పొదిలి మీదుగానే వెళ్లాల్సి ఉంది. రోజుకు సుమారు మూడు వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పెద్దబస్టాండ్‌ బ్రిడ్జి నుంచి కొత్తూరులోని మార్కాపురం అడ్డరోడ్డు వరకు రోడ్డు మార్జిన్లు సక్రమంగా లేవు. పట్టణంలో ఆటో పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలం లేకపోవడంతో కొంత ఇబ్బందిగా మారింది. గతంలో పొదిలి పట్టణానికి బైపాస్‌ రోడ్డు మంజూరైందని చెప్పినా ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. ఇప్పటికీ పలుమార్లు సర్వేలు చేశారు తప్ప విస్తరణపనులకు నోచుకోలేదు. కొత్తూరులోని ఆర్టీసీ బస్టాండ్, విశ్వనాధపురం, కొత్తూరు కూడలిలోను రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రహదారిలో రోడ్డు అంచులు సైతం ప్రమాదకరంగా ఉన్నాయి. రోడ్డు అంచుల్లో చిరువ్యాపారులు ఆక్రమించేస్తున్నారు.  దీంతో సమస్య జఠిలమవుతుంది. 

నిధులు మంజూరైతేనే ..

పొదిలి పట్టణంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గాలంటే రోడ్లు వెడల్పు చేయాల్సి ఉంది. అందుకు సంబంధించి నిధులు వస్తే తప్ప మేమీ చేయలేం. ఆర్‌అండ్‌బీ రోడ్డు అంచులను ఆక్రమించొద్దని గతంలో పలుమార్లు వ్యాపారులకు చెప్పాం. దుకాణాల ముందు ఎత్తుగా ఉన్న మట్టికుప్పలను సైతం చదును చేయించారు. అవి తాత్కాలికమే అయినా శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలంటే నిధులు మంజూరు కావాల్సి ఉంది. వాటికోసం ప్రతిపాదనలు తయారుచేసి పంపాం. 

స్రవంతి, ఆర్‌అండ్‌బీ జేఈ  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని