TDP Mahanadu: ఒంగోలులో తెదేపా తోరణాలను తొలగించిన కార్పొరేషన్‌ అధికారులు

వైకాపా ప్రభుత్వం మహానాడుకు అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టిస్తోందని తెదేపా నేతలు మండిపడ్డారు. మహానాడు వేదికతో పాటు ప్రయాణ ఏర్పాట్లకు సర్కారు ఆటంకాలు కలిగిస్తోందన్నారు.

Updated : 25 May 2022 13:32 IST

భవిష్యత్తులో అన్నింటికీ తగిన సమాధానం చెబుతామన్న ఆ పార్టీ నేతలు

ఒంగోలు: వైకాపా ప్రభుత్వం మహానాడుకు అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టిస్తోందని తెదేపా నేతలు మండిపడ్డారు. మహానాడు వేదికతో పాటు ప్రయాణ ఏర్పాట్లకు సర్కారు ఆటంకాలు కలిగిస్తోందన్నారు. ఒంగోలులో తెదేపా తోరణాలను కార్పొరేషన్‌ అధికారులు తొలగించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యను ఖండించిన నేతలు.. భవిష్యత్తులో అన్నింటికీ తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. తెదేపా నేత దామచర్ల జనార్ధన్‌, ఇతర నేతలతో కలిసి ఆ పార్టీ సీనియర్‌ నేత సోమిరెడ్డి ఒంగోలులో మీడియాతో మాట్లాడారు.

‘‘మేము తోరణాలు కడితే మీరు విప్పుకుంటూ పోతారా? వేదిక కోసం డబ్బు కట్టిన తర్వాత స్టేడియానికి అనుమతి ఇవ్వరా? కలెక్టర్లు, ఎస్పీలు దేనికి? దేశ పౌరుడికి ఉండే హక్కులు ఏపీలో లేవా? రాష్ట్రంలో ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందా? పరిపాలన మీకు చేతకావడం లేదు. లా అండ్‌ ఆర్డర్‌ లేదు. తెలుగోడు అంటే తల ఎత్తుకునే పరిస్థితి ఎన్టీఆర్‌ తీసుకొస్తే.. ఏపీ అంటే తల దించుకోవాల్సిన పరిస్థితిని వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చింది. మహానాడుకు ప్రైవేట్‌ వాహనాలు ఇస్తే బెదిరిస్తారా? ఇందుకోసమేనా అధికారులు జీతాలు తీసుకుంటోంది? మా ప్రభుత్వంలో సీఎం జగన్‌ నడిరోడ్డు మీద మీటింగ్‌లు పెట్టినా మేము మీ జోలికి రాలేదు’’ అని సోమిరెడ్డి అన్నారు.

దామచర్ల జనార్ధన్‌ మాట్లాడుతూ.. ‘‘తెదేపా తోరణాలను రాత్రంతా కడితే.. ఉదయం కార్పొరేషన్‌ వాళ్లు వచ్చి వాటిని తొలగించారు. కమిషనర్‌ను దీనిపై అడిగితే కలెక్టర్‌ చెప్పారన్నారు. వారం కిందట మేము అనుమతి కోసం దరఖాస్తు చేశాం. అయినా ఇటువంటి చర్యలు తీసుకోవడం దారుణం. జగన్‌ పాదయాత్రలో మేము ఇబ్బందులు కలిగించామా?’’ అని ప్రశ్నించారు.

ఒంగోలు శివారు మండువవారిపాలెం వద్ద ఈనెల 27, 28 తేదీల్లో తెదేపా మహానాడును నిర్వహించనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని