logo

రైతులూ.. తక్కువ ధరకు అమ్ముకోవద్దు

‘ధాన్యం పండించిన రైతులు తొందరపడి ప్రైవేట్‌ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దు. జిల్లాలో ఎంపిక చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం.

Published : 29 Jan 2023 02:02 IST

‘న్యూస్‌టుడే’తో పౌరసరఫరాల సంస్థ డీఎం

గ్లోరియా

‘ధాన్యం పండించిన రైతులు తొందరపడి ప్రైవేట్‌ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దు. జిల్లాలో ఎంపిక చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. నూర్పిళ్లు పూర్తి కాగానే ఆర్బీకేల్లో సమాచారమిస్తే వెంటనే రైతులకు కొనుగోలు సమయం తెలిపి సేకరిస్తాం. ఆ తర్వాత 21 రోజుల్లోపే అన్నదాతల బ్యాంక్‌ ఖాతాలకు నగదు జమ అవుతాయి..’ అని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ పి.గ్లోరియా తెలిపారు. జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియకు సంబంధించి ‘న్యూస్‌టుడే’తో ఆమె మాట్లాడారు. ఇవీ వివరాలు...

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

* 19 వేల టన్నుల సేకరణ లక్ష్యం...: యర్రగొండపాలెం, పెద్దారవీడు మినహా మిగతా 36 మండలాల్లో క్లస్టర్లుగా గుర్తించిన 51 రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రస్తుత సీజన్‌లో 19 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించాం. అందులో ఇప్పటివరకు త్రిపురాంతకం, దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాల పరిధిలోని 10 ఆర్బీకేల ద్వారా 73 మంది రైతుల నుంచి 513 టన్నులు సేకరించాం. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం గ్రేడ్‌ ఏ-రకం క్వింటా ధర రూ.2,060; సాధారణ రకం క్వింటా ధర రూ.2,040 చొప్పున కొనుగోలు చేస్తున్నాం.

పొలం నుంచి ట్రాక్టర్‌ ద్వారా ధాన్యం బస్తాలు తరలిస్తున్న రైతులు

* సంచుల కొరత లేదు...: సేకరణకు ముందే 3 లక్షల గన్నీ సంచులు సిద్ధం చేసి అందించాం. ధాన్యం రవాణాకు సంబంధించి వాహనాలను సమకూర్చేందుకు ఒంగోలు, కనిగిరి, మార్కాపురం డివిజన్లకు ముగ్గురు గుత్తేదారులను నియమించాం. నేరుగా పొలం నుంచే రవాణాకు వాహనం ఏర్పాటుచేస్తున్నాం. రైతులే సొంతంగా వాహనాలను సమకూర్చుకుంటే రవాణా ఛార్జీలను నిర్ణయించిన మేరకు బ్యాంక్‌ ఖాతాలకు జమ చేస్తాం.

తడిచిన ధాన్యం కొనుగోలుకూ చర్యలు...

నిబంధనల మేరకు తేమ 17 శాతం మించకూడదు. అంతకంటే ఎక్కువ ఉంటే ఆరబెట్టుకురమ్మని ముందుగానే రైతులకు సూచిస్తున్నాం. మాండౌస్‌ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో ఏడు మండలాల పరిధిలో ప్రాథమికంగా 662 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తడిచినట్టు గుర్తించాం. ఆ పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి నిమిత్తం సంయుక్త కలెక్టర్‌ ద్వారా లేఖ రాశాం. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. గత వారంలో నిర్వహించిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో తడిచిన ధాన్యాన్ని మిల్లర్ల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ఆదేశించారు. ఈ మేరకు త్వరలోనే మిల్లర్లతో సమావేశం నిర్వహించనున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని