logo

కన్నీరే మిగిల్చావ్‌.. జగన్‌

బొప్పాయి పంట పండించి  ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. 

Published : 27 Apr 2024 05:42 IST

ఎండుతున్న బొప్పాయిపంట
ఆదుకోని ప్రభుత్వంపై ఆగ్రహం

బొప్పాయి పంట పండించి  ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు.  జిల్లాలో 3,200 ఎకరాల్లో నేడు బొప్పాయి సాగవుతోంది. ఉద్యానశాఖ  చేయూత నందించడంతో ఈ పంటలవైపు మళ్లిన రైతులు నేడు కన్నీరుమున్నీరవుతున్నారు. సరైన వర్షాలు లేక  వేసిన పంటలకు నీరు లేక  కళ్లెదుటే పంటలు ఎండి పోతుంటే విలవిల లాడిపోతున్నారు. ఈ ప్రభుత్వం తమను మధ్యలోనే వదిలేసిందని వాపోతున్నారు. పంటను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు.

 యర్రగొండపాలెం పట్టణం, కొనకనమిట్ల  


మురుగునీటితో పంటకు తడులు

వై.పాలెం పంచాయతీలోని కొత్తపల్లె బొప్పాయి తోటలకు ప్రసిద్ధి. 300 ఎకరాల్లో  ఏటా సాగు చేస్తుంటారు. ఈ ఏడాది తీవ్రమైన నీటి ఎద్దడి రావడంతో  బోర్లు అడుగంటాయి. ఎకరాకు రూ.60 వేల ఖర్చు పెట్టిన పంట   ఎండిపోతుంటే రైతులు తట్టుకోలేకపోతున్నారు. పంటను కాపాడుకునేందుకు పక్కనే ఉన్న వై.పాలెం డ్రైనేజీ కాలువే దిక్కుగా మారింది. వై.పాలెం పట్టణంలోని నీరంతా డ్రైనేజీ కాలువ నుంచి వచ్చి వై.పాలెం మార్కాపురం రోడ్డులోని పెట్రోల్‌ బంకు చప్టా వద్దకు చేరుకుంటుంది.ఈ నీటిని కొత్తపల్లె రైతులు పైపుల ద్వారా పంటలకు మళ్లించి వాడుకుంటున్నారు. చప్టా కింద ఉన్న మురుగు నీటితో కొంత గుంతను ఏర్పాటు చేసుకున్నారు. ఆ గుంటలో మురుగునీటిని నిల్వ చేసుకున్నారు. చప్టా నుంచి పొలాలకు పైపులైన్లు  వేసుకున్నారు.  నిల్వ చేసుకున్న నీటికి మోటార్లు పెట్టి పొలాలకు సరఫరా చేసుకుంటూ పంటలను కాపాడుకుంటున్నారు.


గతంలో ప్రభుత్వం ట్యాంకర్లతో ఆదుకునేది  

గతంలో ప్రభుత్వం నీరు లేని ఎండిపోతున్న పంటలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసి రైతులను ఆదుకుంది. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు.  నేను 3 ఎకరాలు బొప్పాయి తోట వేశా. నేను వేసిన రెండు బోర్లలో నీరు ఎండిపోయింది. దీంతో చేసేది లేక ఈ డ్రైనేజీ మురుగు నీటికి మోటార్లు ఏర్పాటు చేసి పైపు ఉపయోగించి పంటకు వాడుకుంటున్నాం.  ఈ నీరు సైతం అందరికి సరిపోవడం లేదు. వంతుల వారీగా వాడుకుంటూ పంటలను బతికించుకుంటున్నాం. 

 ఆముదం వెంకట నారాయణరెడ్డి


ఉద్యాన పంటలను కాపాడాలి  

ఈ వేసవి కాలంలో ప్రభుత్వం ఉద్యాన పంటలు ఎండిపోకుండా ట్యాంకర్లు ద్వారా నీరు సరఫరా చేయాలి.  నేను రెండెకరాలు బొప్పాయి పంట వేశాను. వేరే గతి లేక నీరు లేక వై.పాలెం డ్రైనేజీ మురికి నీరు పంటలకు వాడుకుంటున్నా.  ఈ మురికి నీరు సైతం రైతులకు చాలడం లేదు. రాత్రి వేల పడిగాపులు కాచి పంటలకు పైపుల ద్వారా నీరు పెట్టుకుంటున్నాం. ప్రభుత్వం ఉద్యాన పంటల రైతులకు నీరు సరఫరా చేసి ఆదుకోవాలి.  

 డి.మీరావలి


రాయితీ లేదు  

నాకు ఉన్న ఒక ఎకరాతోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని బొప్పాయి సాగు చేశా. వర్షాలు లేక భూర్భజలాలు అడుగంటి పోవడంతో బోరు ఒట్టిపోయి పంట ఎండిపోతోంది. గత ప్రభుత్వం  పండ్ల తోట రైతులు మొక్కలు రాయితీ, డ్రీప్‌ పైపులు అందించేవారు. వైకాపా ప్రభుత్వం ఎటువంటి రాయితీలు లేకపోవడంతో నష్టపోయా. తోట ఎండిపోవడంతో సుమారు రూ.1 లక్షల నష్టంవాట్లింది.  ఈక్రాఫ్‌ సక్రమం ఆన్‌లైన్‌తో నమోదు చేయకపోవడంతో రాయితీ ఇవ్వలేం అని ప్రభుత్వం తప్పించుకుంది.

 రమణారెడ్డి, రైతు, కొనకనమిట్ల.


తీవ్రంగా నష్టపోతున్నాం..  

నాకు కున్న అయిదు ఎకరాలు బొప్పాయి పంట సాగు చేశా. వర్షాలు సక్రమంగా పడకపోడంతో తోటలు ఎండిపోయిన్నాయి. రూ.1.50లక్షలు నష్టం వాటిల్లింది.. గత ప్రభుత్వం మొక్కలకు రాయితీ అందించింది. వైకాపా ప్రభుత్వంలో ఎటువంటి రాయితీ ఇవ్వకపోవడంతో నష్టపోతున్నాం.  

బాదుల్లా, పుట్లువారిపల్లె,  కొనకనమిట్ల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని