logo

తాడేపల్లి జలగ.. రక్త మాంసాలు పీల్చ

అధికారంలోకి వస్తానే జగన్‌ విడతల వారీగా మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఊరూరా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.

Updated : 27 Apr 2024 06:14 IST

మద్య నిషేధమంటూ మాయమాటలు
పీఠమెక్కగానే బార్లా తెరిచారు తలుపులు
 తాగించిన పిచ్చి మందు రూ. 8 వేల కోట్లు

మద్యం అమ్మకాలంటే రక్తమాంసాలతో వ్యాపారం. మేం అధికారంలోకి వచ్చాక దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం. ఆ తర్వాతే 2024 ఎన్నికల్లో ఓటు అడుగుతాం...’

 గత ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పిన మాయ మాటలు.

ఈనాడు, ఒంగోలు; న్యూస్‌టుడే, టంగుటూరు, కురిచేడు: అధికారంలోకి వస్తానే జగన్‌ విడతల వారీగా మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఊరూరా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. షాక్‌ కొట్టేలా ధరలుంటే మద్యం తాగరంటూ తనకు తానే సమర్థించుకుంటూ నాసిరకం బ్రాండ్లను తెచ్చారు. అస్తవ్యస్త విధానాలకు తోడు ఎక్సైజ్‌ శాఖను నిర్వీర్యం చేశారు. ఏటికేడు మద్యం మత్తుకు బానిసైనవారి సంఖ్య పెరుగుతుండటం.. వారి ఆదాయంతో పాటు ఆరోగ్యాలు క్షీణిస్తుండటంతో బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నారు.

  •  ఏటికేడు పెరుగుతున్న రోగులు...: ఒంగోలు జీజీహెచ్‌లో 2020 జూన్‌లో వ్యసన విముక్తి కేంద్రం(డి-అడిక్షన్‌ సెంటర్‌) ఏర్పాటైంది. అప్పటి నుంచి వచ్చిన అవుట్‌ పేషెంట్లు, ఇన్‌ పేషెంట్ల సంఖ్య ఏటికేడు పెరుగుతూ వస్తోంది.
  •  కొండపి నియోజకవర్గానికి చెందిన ఓ వివాహిత ఇటీవల ఒంగోలు జీజీహెచ్‌కు తన భర్తను తీసుకొచ్చారు. ఆయనకు ఇరవై ఏళ్లుగా మద్యం తాగే అలవాటుంది. అయితే రెండు మూడేళ్లుగా మద్యం తాగినప్పుడల్లా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఏడాదిగా గుండెల్లో దడ, మంట, ఇతర సమస్యలు తలెత్తడంతో ఆమె చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకొచ్చి పన్నెండు రోజులుగా ఇక్కడే ఉంటున్నారు.
  •  ఒక్కగానొక్క కుమారుడు తాగుడుకు బానిసయ్యాడు. కుటుంబ బాధ్యతలు తెలిస్తే అయినా తాగుడు మానతాడని అతని తల్లి భావించి యువకుడికి పెళ్లి చేశారు. పనికెళ్తే వచ్చే రూ. 500 తాగడానికే ఖర్చుచేస్తుండటంతో కుటుంబ పోషణ భారంగా మారింది. తాగుడు మానడం లేదని భార్య పుట్టింటికి వెళ్లి రానంటోంది. అయినా అతని తీరు మారలేదు. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఇటీవల తన తల్లిని కొట్టడంతో ఆమె గాయాలపాలైంది.
  •  పదిహేనేళ్లుగా మద్యం తాగే అలవాటున్న అతను ఏనాడూ గతంలో అనారోగ్యం పాలవ్వలేదు. మందు తాగి రాత్రివేళ నిద్రపోయి మరుసటి రోజు మళ్లీ లేచి బేల్దారీ పనులకు వెళ్లేవారు. వైకాపా ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యం తాగినప్పటి అజీర్ణం, గుండెల్లో మంట, నొప్పి, కండరాలు పట్టేయడం, తల తిప్పడం, నాలుక పిడచకట్టుకు పోవడం వంటి రోగాలు చుట్టుముట్టాయి. రోజూ బేల్దారీ పనికి వెళ్తే వచ్చే ఆదాయం కూడా కూడా మద్యానికే పోతోంది.

శానిటైజర్‌ తాగి  బలి...

ప్రభుత్వ విధానాలతో మద్యం ధరలు పెరిగిపోవడం, కొవిడ్‌ కారణంలో పనులు లేకపోవడంతో పేద ప్రజలు, మద్యానికి బానిసలైనవారు ఇతర మార్గాలు ఎంచుకుంటున్నారు. స్పిరిట్‌, శానిటైజర్‌, నాటుసారా వైపు మళ్లుతున్నారు. ఈ క్రమంలోనే 2020లో శానిటైజర్‌ తాగి కురిచేడుతో పాటు, ఇతర చోట్ల మొత్తం పదమూడు మంది మృతి చెందిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తాజాగా విశాఖ పోర్టులో పట్టుబడిన రూ.50 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ దిగుమతి చేసుకున్న సంస్థ అధినేతలది నాగులుప్పలపాడు మండలంలోని ఈదుమూడి గ్రామం కావడం కూడా గమనార్హం.

ఈ ఏడాది మార్చి వరకు అవుట్‌ పేషెంట్లు 595 ఆసుపత్రికి వచ్చారు. వీరిలో 36 మంది వ్యసన విముక్తి కేంద్రంలో చికిత్స పొందారు. వీరిలో నలుగురు లివర్‌ సిరోసిస్‌, పాంక్రియాస్‌ బాధితులున్నారు. ఇలా అయిదేళ్ల వైకాపా పాలనలో ఏటికేడు మద్యం, ఇతర మాదకద్రవ్యాల వ్యసనాలకు బానిసలవుతున్న వారి సంఖ్య పెరుగుతూ.. వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని