logo

కక్ష కట్టి కడుపు కొడతారు

2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు.

Published : 27 Apr 2024 05:29 IST

 అడుగడుగునా దోపిడీ.. అదే వైకాపా బ్రాండ్‌ - అయిదేళ్లలో అభివృద్ధి ఊసే లేదు
 గ్రానైట్‌ గనులపై వాలిన గద్దలు - తాగు, సాగుకూ నీరివ్వలేని దుస్థితి
 గుండ్లకమ్మ నిర్వాసితుల గోడు పట్టించుకోని సర్కారు - చీరాల, పర్చూరు, అద్దంకి ఓటర్ల మనోగతం

గుండ్లకమ్మ ప్రాజెక్టు

ఈనాడు, అమరావతి : 2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. తర్వాత కొద్ది రోజులకే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. అద్దంకి, పర్చూరు ఎమ్మెల్యేలపైనా వైకాపా తీవ్ర ఒత్తిడి తెచ్చింది. అయినా తలొగ్గకపోవడంతో కక్షసాధింపు రాజకీయాలు ప్రారంభించింది. ఆ నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి పనులకు మంగళం పాడింది. గ్రానైట్‌ గనులపై దాడులు చేయించి మూసేయించే వరకు నిద్రపోలేదు. కరోనా సమయంలోనూ నెలనెలా కప్పం కట్టకపోతే వెంటాడి వేధించారు. పెద్దలే వెనకుండి వసూళ్లు చేయించారు. ఇవన్నీ ఇప్పుడు ఎన్నికల్లో ప్రధానాంశాలయ్యాయి. తాగునీటితో పాటు రైతులకు సాగునీరిచ్చే గుండ్లకమ్మ ప్రాజెక్టుపైనా వైకాపా నేతలు నీతిమాలిన రాజకీయం చేశారనే ఆగ్రహం రైతుల్లో వ్యక్తమవుతోంది. రెండు గేట్లు కొట్టుకుపోయినా మరమ్మతు చేయించలేదంటే ఈ ప్రాంతంపై అధికార వైకాపా ఎంత కక్షగట్టిందో అర్థం కావట్లేదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి మూడు రోజులపాటు పర్యటించారు. ఎక్కడ విన్నా అయిదేళ్లలో అభివృద్ధి లేదనే ఆవేదనే వినిపించింది. ప్రతి పది మందిలో ఎనిమిది మంది రాష్ట్రానికి రాజధాని లేకపోవటం బాధిస్తోందని చెప్పారు. తమ సంక్షేమ పథకాలనూ ఎత్తేశారని చేనేత కార్మికులు, మత్స్యకారులు పేర్కొన్నారు. రహదారులన్నీ గుంతలమయమయ్యాయని అన్ని వర్గాలూ వాపోయాయి. ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు లేవని, సాగునీరూ అందడం లేదనే ఆవేదన రైతుల్లో వ్యక్తమైంది. పది వేల ఎకరాలకు సాగునీరిచ్చే భవనాశి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పనులు నిలిపేశారు. నిర్మించిన టిడ్కో భవనాలను లబ్ధిదారులకు ఇవ్వలేదు. అట్టహాసంగా ప్రారంభించిన జగనన్న కాలనీల్లో 80 శాతం నిర్మాణ దశలోనే ఉన్నాయి.

అద్దంకి సమీపంలోని బొమ్మరంపాడు వద్ద నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీలు

చీరాలలో ముక్కోణ పోటీలో తెదేపాకే మొగ్గు

తెదేపా, వైకాపా, కాంగ్రెస్‌ ముక్కోణ పోటీ మధ్య చీరాల నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. చేనేత, యాదవ, ఎస్సీ ఓటు బ్యాంకు ప్రభావం ఇక్కడ ఎక్కువ. నియోజకవర్గ ప్రజలకు చిరపరిచితుడైన ఎంఎం కొండయ్య యాదవ్‌ను తెలుగుదేశం తమ అభ్యర్థిగా బరిలో నిలిపింది. గత ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికైన కరణం బలరాం.. తర్వాత వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన కుమారుడు వెంకటేశ్‌ను వైకాపా తన అభ్యర్థిగా నిలిపింది. గత ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్‌ ఈసారి కాంగ్రెస్‌నుంచి పోటీ పడుతున్నారు. దీంతో వైకాపా ఓటుబ్యాంకు చీలి తెదేపాకు లాభిస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్వప్రయోజనాల కోసం పార్టీ మారిన బలరాం.. నియోజకవర్గానికి చేసిందేమీ లేదనే అభిప్రాయం అటు తెదేపా, ఇటు వైకాపా వర్గాల్లోనూ ఉంది. అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత, వివిధ వర్గాల మద్దతు, పార్టీ ఓటు బ్యాంకుతో విజయం సాధిస్తామని తెదేపా ధీమాగా ఉంది. గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదని వాడరేవు ప్రాంతానికి చెందిన నలుగురు గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అయిదేళ్లలో మాట్లాడే స్వేచ్ఛ కోల్పోయామని, పల్లెల్లో ప్రశాంత వాతావరణం దెబ్బతిన్నదని జాండ్రపేటకు చెందిన చేనేత కార్మికులు వివరించారు. రౌడీయిజం, కమీషన్లు, వాటాలు అడగకుండా ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ/అభ్యర్థినే కోరుకుంటున్నామని చీరాలకు చెందిన వ్యాపార సంఘం నేత వివరించారు.

అద్దంకిలో రవికుమార్‌ గెలుపు నల్లేరుపై నడకే

అద్దంకి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్‌ మరోసారి తెదేపా నుంచి బరిలో నిలిచారు. ఆయన్ను ఎదుర్కొనేందుకు అయిదేళ్లుగా వైకాపా సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇద్దరు సమన్వయకర్తలను మార్చింది. అయినా ఈ ఎన్నికల్లో ఆయన గెలుపు నల్లేరుపై నడకేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందు వరకు వైకాపా సమన్వయకర్తగా సేవలందించిన బాచిన కృష్ణచైతన్యను తప్పించి పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన చినహనిమిరెడ్డిని నియమించి ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో కృష్ణచైతన్య, ఆయన తండ్రి గరటయ్య సైకిలెక్కారు. వైకాపా ద్వితీయశ్రేణి నాయకులూ తెదేపాలోకి వచ్చారు. హనిమిరెడ్డికి సొంత పార్టీ నుంచే సహకారం కొరవడింది. ఓటమి భయంతో ఆయన ఎన్నికల ప్రచారానికి గైర్హాజరవుతున్నారని, ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి అకస్మాత్తుగా మాయమవుతున్నారని ఆ పార్టీ అధిష్ఠానానికీ ఫిర్యాదులు వెళ్లాయి. అయిదేళ్లలో వైకాపా చేసిన అభివృద్ధి శూన్యమని ఓటర్లలోనూ అసంతృప్తి నెలకొంది. అద్దంకిలోని 1120 మంది లబ్ధిదారులకు 3, 4 కిలోమీటర్ల దూరంలోని బొమ్మనంపాడు వద్ద జగనన్న కాలనీ నిర్మించారు. నిర్మానుష్య ప్రాంతమవడంతో కొద్దిమందే అక్కడికి వెళ్లారు. గుండ్లకమ్మ ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారాన్ని వైకాపా పక్కన పెట్టింది. ఉన్నతాధికారులను కలిసి విన్నవించినా పట్టించుకోలేదని కొరిశపాడుకు చెందిన నలుగురు రైతులు వాపోయారు. ఈ సమస్యను పరిష్కరిస్తేనే 15వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

పర్చూరులో తెదేపా గెలుపు ఏకపక్షమే

పర్చూరు నుంచి తెదేపా తరఫున సిటింగ్‌ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హ్యాట్రిక్‌ సాధించేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడినుంచి వైకాపా తరఫున యడం బాలాజీ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తెదేపా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు వైకాపా.. అయిదేళ్లుగా వ్యూహాలు రచించింది. గ్రానైట్‌ పరిశ్రమపై మూకుమ్మడి తనిఖీలు చేయించి కేసులు పెట్టించింది. ఎక్కడ ఎవరిని కదిలించినా వైకాపా వసూళ్లు, అరాచకాలనే గుర్తుచేసుకుంటున్నారు. నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొన్ని నెలలు వ్యవహరించారు. తర్వాత రావి రామనాథంబాబును నియమించారు. మూడున్నరేళ్ల తర్వాత ఆయన్నూ మార్చి ఆమంచి కృష్ణమోహన్‌ను నియమించారు. ఎన్నికలకు నెల ముందు ఆయన్నూ పక్కనపెట్టి యడం బాలాజీని అభ్యర్థిగా ప్రకటించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నందున ప్రభుత్వం ఈ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిందని యద్దనపూడికి చెందిన మైనారిటీ యువకుడు తెలిపారు. అయిదేళ్లుగా అధికార పార్టీ అండదండలతో వైకాపా నేతలు రెచ్చిపోయి గ్రానైట్‌, ఎరువుల వ్యాపారులు, రైస్‌మిల్లర్ల నుంచి వసూళ్లు చేశారు. అక్రమ కేసులు బనాయిస్తూ అందినంత దోచుకుంటున్నారంటూ బాధితులు సీఎంవోకు ఫిర్యాదులు చేసినా చర్యలు లేవు. పార్టీ శ్రేణులనుంచి ఆయనకు సహకారం కొరవడింది. తెదేపా చేపట్టిన పనులను కొనసాగించకూడదనే అక్కసుతో నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై అధికార పార్టీ దృష్టి సారించలేదని మార్టూరు మండలం రాజుపాలెంలో చిరువ్యాపారి అన్నారు. గుంతలుపడ్డ మార్టూరు-యద్దనపూడి రహదారిని కనీసం మరమ్మతు చేయలేదని యనమదల గ్రామ రైతు వివరించారు. నియోజకవర్గ పరిధిలో 20 వేల ఎకరాలకు నీరందించే చిన్నతరహా ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పర్చూరుకు చెందిన ముగ్గురు రైతులు తెలిపారు.బంగారం పండే భూములు బీడు పడ్డాయన్నారు.


పార్టీకి నిధులివ్వాలి. ఎన్నికల ప్రచారానికి చందాల బెడద తప్పదు. ఈ రౌడీయిజం భరించటం కష్టం. స్థలాలేవైనా వివాదంలో ఉన్నాయని తెలిస్తే చాలు వాలిపోయి పరిష్కారం పేరుతో వాటాలడుగుతారు. నెలవారీ కమీషన్లు, రౌడీయిజంతో వేధిస్తూ ఏ రోజు ఏం జరుగుతుందోననే భయం సృష్టిస్తున్నారు. స్నేహితులతోనూ మనసులో మాట పంచుకునేందుకు భయపడే పరిస్థితులున్నాయి. సంపాదనలో సగం ఇంటి పన్ను, చెత్త పన్ను, విద్యుత్‌ ఛార్జీల రూపేణా భరిస్తున్నాం.

చీరాలలో పరిస్థితులపై నలుగురు వస్త్ర వ్యాపారుల అభిప్రాయమిది.


గుండ్లకమ్మ రిజర్వాయర్‌ నుంచి యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతలకు నీరు మళ్లించే పనుల్ని గత ప్రభుత్వమే 70 శాతం పూర్తి చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పనులనే ఒకేఒక్క కారణంతో భూసేకరణ, పరిహారం చెల్లింపులో సమస్యలను పట్టించుకోకుండా మూలన పెట్టేశారు. మూడు చెరువులకు నీరందించే అవకాశమున్నా చూసీచూడనట్టు వదిలేశారు. ఆరు వేల ఎకరాల్లో సాగునీటి అవకాశాలను దెబ్బతీశారు.

-అద్దంకి నియోజకవర్గం కొరిశపాడు ప్రాంతానికి చెందిన ఇద్దరు రైతుల ఆవేదన.


వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించే గ్రానైట్‌ పరిశ్రమపై రాబందుల్లా పడ్డారు. అధికార యంత్రాంగంతో దాడులు చేయించి ఒత్తిడి తెస్తున్నారు. నెలవారీ మామూళ్లివ్వాలంటూ బెదిరిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. అయిదేళ్లూ గ్రానైట్‌ వ్యాపారులు, రైస్‌మిల్లర్లు, ఎరువుల దుకాణదారులు నలిగిపోయారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గెలిపించారనే అక్కసుతో పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో వ్యాపారులను వెంటాడి వేధిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా వ్యాపారంలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. అరాచకాలకు ముగింపు పలకాలంటే మార్పు రావాల్సిందే

పర్చూరు నియోజకవర్గానికి చెందిన మైనింగ్‌ నిర్వాహకుడి అంతరంగమిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని