logo

నిధులు నిలిపివేసి.. కేంద్రానివీ మింగేసి.. పురాల గొంతు నులిమిన పాలకుడు

రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో  నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్‌ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది.

Published : 27 Apr 2024 05:35 IST

 వసతుల్లేక అంతా అస్తవ్యస్తం
నరక కూపాల్లా ఒంగోలు, మార్కాపురం

రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో  నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్‌ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది. పేరులో తప్ప ప్రగతిలో ‘ప్రకాశం’ లేకుండాపోయిందని జిల్లావాసులు ఆవేదన చెందుతున్నారు.

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం, మార్కాపురం అర్బన్‌:

మున్సిపల్‌ పట్టణాలు అభివృద్ధికి నోచుకోక కునారిల్లుతున్నాయి. వైకాపా  ప్రభుత్వం వచ్చాక నగరపాలక, పురపాలక, నగర పంచాయతీలకు నిధుల కేటాయింపు నిలిచిపోయింది. గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీలు అధికంగా నివాసముంటున్న కాలనీల్లో రోడ్లు, కాలువలు, కల్వర్టులు, వీధి దీపాలు, తాగునీరు లాంటి మౌలిక వసతుల కల్పనకు పెద్దఎత్తున నిధులు కేటాయించారు. అయితే వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పథకం పూర్తిగా నిలిచిపోయింది. ఈ పథకం కింద ఒంగోలుకు 2014 నుంచి 2019 మధ్య రూ.47 కోట్లు మంజూరయ్యాయి. వాటితో బాలాజీనగర్‌, ఇందిరాకాలనీ, ప్రగతి కాలనీ , అరవకాలనీ లాంటి చోట రోడ్లు నిర్మించారు.

ప్రత్యామ్నాయ నిధులూ ఇవ్వని ప్రభుత్వం

తెదేపా హయాంలో మార్కాపురం పురపాలక సంఘం, గిద్దలూరు, కనిగిరి, చీమకుర్తి నగర పంచాయతీలకు అక్కడి జనాభా సంఖ్యను బట్టి నిధులు మంజూరయ్యాయి. ఇప్పుడు ఆ పథకం లేకపోగా, ప్రత్యామ్నాయంగా ఇతర మార్గాల్లోనూ నిధులు రాలేదు.

రూ.కోటి ఖర్చు పెట్టి.. దోమల ఆవాసంగా మార్చి

మార్కాపురంలో ఫాగింగ్‌, బ్లీచింగ్‌ వంటి వాటి ఊసే లేదు. చెత్త కుప్పలు, వ్యర్థ నిల్వ కేంద్రాలు, అపరిశుభ్ర ప్రాంతాలు, కాలువల్లో కనీసం వారంలో రెండుసార్లు కూడా ఫాగింగ్‌ చేయడం లేదు. 21 సచివాలయాల పరిధిలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. 9వ బ్లాకులో కాలువల నిర్మాణం లేక సర్‌ప్లస్‌ వియర్‌ మూసీ నదిని తలపిస్తోంది. రూ.కోటి ఖర్చు పెట్టినా సప్లయ్‌ ఛానల్‌ దశ మారలేదు. ఇది దోమలకు ఆవాసంగా మారింది.

అవినీతిమయంగా సచివాలయ వ్యవస్థ

సచివాలయ వ్యవస్థతో పారదర్శక సేవలందిస్తున్నామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. దీనికి భిన్నంగా మార్కాపురంలో ప్రతి పనికీ పైసలు చెల్లించాల్సి వస్తోందని పురవాసులు వాపోతున్నారు. నూతన పన్నులు, ప్లానింగ్‌, సర్వే, ఇతర ధ్రువపత్రాల కోసం రూ.వేలల్లో ముట్టజెప్పాల్సిన దుస్థితి నెలకొంది.

బాబు హయాంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగు

డివిజన్‌ కేంద్రమైన మార్కాపురంలో 35 వార్డుల్లో లక్ష వరకు జనాభా ఉంది. ఇందులో ఒక్క వార్డు కూడా అభివృద్ధి చెందలేదు. గత తెదేపా ప్రభుత్వ పాలనలో చూడచక్కని సీసీ రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి పైపుల అమరిక వంటి సౌకర్యాలు కల్పించారు. జగన్‌ ముఖ్యమంత్రిగా కొలువుదీరాక చిల్లిగవ్వ కూడా మంజూరు చేయకపోవడంతో డ్రైనేజీలన్నీ శిథిలమై మురుగు నీరంతా రహదారులపైకి చేరుతోంది. ఇక కొత్త మురుగు కాలువల నిర్మాణం చేయకపోవడంతో మురుగు కంపు, దోమల బెడదతో పలు కాలనీల వాసులు బెంబేలెత్తుతున్నారు. వీధి దీపాల ఏర్పాటు, కనీస మరమ్మతులను విస్మరించారు.

అమ్మో ఆ కాలనీల్లో అడుగు పెడితే..

మార్కాపురంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా శివార్లలోని రాజ్యలక్ష్మి వీధి, నానాజాతుల కాలనీ, పూలసుబ్బయ్య, కొండారెడ్డి, భగత్‌సింగ్‌, విద్యానగర్‌, డ్రైవర్స్‌ కాలనీలతో పాటు ఎస్టేట్‌ ప్రాంతాలు చెత్తకుప్పలకు నిలయాలుగా మారాయి. అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రధాన రహదారిపై కాలువ నిర్మాణం లేకపోవడంతో మురుగు నీరంతా రోడ్డుపైనే ప్రవహిస్తోంది. ప్రధాన రహదారుల వెంట నిర్మించిన పెద్ద కాలువల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయి నీరు పారడంలేదు. వాటి నిర్వహణ పూర్తిగా గాలికొదిలేయడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి.

వీధుల్ని ఇష్టారాజ్యంగా తవ్వేసి..

సాగర్‌ జలాల కోసం చాలా వీధుల్లో గోతులు తవ్వి వదిలేయడంతో అంతర్గత రహదారులు ఛిద్రమయ్యాయి. ప్రధాన రహదారుల్లోని గుంతలపై తట్ట మట్టి కూడా పోయకపోవడంతో చోదకులు యాతన అనుభవిస్తున్నారు. నిత్యం వందల మంది రాకపోకలు సాగించే రైల్వేస్టేషన్‌ రహదారి అధ్వానంగా తయారైంది. ఆక్రమణలతో ప్రధాన వీధుల్లో ఉన్న రహదారులన్నీ మరింత ఇరుకుగా మారాయి.

ఆర్థిక సంఘం నిధులు మళ్లించేసి

కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏటా వచ్చే ఆర్థిక సంఘం నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించేయడంతో నగర, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. దీనితో సమస్యలు పేరుకుపోతున్నాయి. ఉదాహరణకు నగరపాలక సంస్థకు గతేడాది 15వ ఆర్థిక సంఘం కింద రూ.30 కోట్లు కేటాయించగా, దానిలో సగం నిధులు అమృత్‌ పథకం-2కు జతచేశారు.

బేరం కుదిరితేనే ఆ అధికారులు పనిచేసేది

మార్కాపురం పురపాలక సంఘం అవినీతికి చిరునామాగా మారింది. ఇంజినీరింగ్‌ విభాగంలో దీర్ఘకాలికంగా పాతుకుపోయిన ఓ అధికారి అవినీతికి ప్రతిరూపంలా మారారు. ప్రతి పనిలో గుత్తేదారుల వద్ద నుంచి కమీషన్లు  దండుకుంటున్నారు. కార్యాలయంలో ఏ చిన్న పని మీద వెళ్లినా బేరం  కుదరనిదే పలకరింపు కూడా ఉండడం లేదు. ప్లానింగ్‌ అధికారి దందాకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. రూ.వేలల్లో స్వీకరించి అక్రమ నిర్మాణాల వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా పట్టణంలో అడుగుకో అక్రమ నిర్మాణం దర్శనమిస్తోంది. అయిదేళ్ల వైకాపా పాలనలో అవినీతి పెచ్చుమీరిపోయిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.అయిదేళ్లుగా పాలకవర్గం పట్టించుకోకపోవడంతో మార్కాపురం పట్టణం కుదేలైంది. మౌలిక వసతుల కల్పనలో అడుగడుగునా విఫలమైంది. శివారు కాలనీల సంగతి దేవుడెరుగు కనీసం పట్టణం నడిబొడ్డున కూడా అవే అవస్థలు. జగన్‌ పాలనలో ఒక్క నయాపైసా గ్రాంట్‌ మంజూరు కాకపోవడంపై పుర వాసులు సమస్యలతో సతమతమవుతున్నారు.

రూ.23 కోట్ల బకాయిలు చెల్లించక

పట్టణాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు కొత్తపనులు చేయడానికి ముందుకు రావడం లేదు. ఒక్క ఒంగోలులోనే గుత్తేదార్లకు రూ.23 కోట్లు బకాయిలున్నాయి. స్థానిక సంస్థల్లో పన్నుల రూపంలో వసూలయ్యే డబ్బులు కూడా సీఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానం చేశారు. అక్కడ నుంచి విడుదలైతేనే అవసరాలు తీరుతాయి. కనిగిరి, గిద్దలూరులాంటి నగర పంచాయతీలకు ఆదాయం తక్కువ. ఖర్చు ఎక్కువ. తాగునీటి సౌకర్యం లేక ట్యాంకర్ల మీద ఆధారపడుతున్నారు. అక్కడ వచ్చే ఆదాయం సరిపోదు. ప్రభుత్వం నిధులు ఇస్తేనే ప్రజల అవసరాలు తీరతాయి. ప్రకృతి వైపరీత్యాల నిధి, స్పెషల్‌ డెవలప్‌ ఫండ్‌ లాంటివి ఈ ప్రభుత్వంలో రాలేదని, దానివల్లే మౌలిక వసతుల కల్పనకు డబ్బులు ఉండటంలేదని సీనియర్‌ ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని