logo

శ్మశానంలోనూ ఇసుకాసురులు

ఇసుక ఎక్కడ దొరికినా అక్రమార్కులు వదలటం లేదు. ఇటీవల గుండ్లకమ్మ నదీ గర్భంలో తవ్వకాలకు యంత్రాలను ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Published : 27 Mar 2023 04:09 IST

పోలవరం సమీపంలోని ఎస్సీ శ్మశానవాటిక వద్ద పొక్లెయిన్‌తో ఇసుక తవ్వుతున్న దృశ్యం

ముండ్లమూరు, న్యూస్‌టుడే: ఇసుక ఎక్కడ దొరికినా అక్రమార్కులు వదలటం లేదు. ఇటీవల గుండ్లకమ్మ నదీ గర్భంలో తవ్వకాలకు యంత్రాలను ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ముండ్లమూరు మండలం పోలవరంలోని ఎస్సీ శ్మశాన వాటిక స్థలంలో రెండు రోజులుగా జోరుగా తవ్వకాలు చేపడుతున్నారు. పోలవరం సమీపంలోని కొంత భూమిని ఎస్సీలు పూర్వం నుంచి శ్మశానవాటికగా ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ చిలకలేరు ఉండటంతో ఇసుక లభిస్తుంది. ఇదే అదునుగా పొక్లెయిన్‌తో కొందరు తవ్వకాలు సాగిస్తూ టిప్పర్లు, లారీలకు ఎత్తి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయినప్పటికీ ఏ అధికారీ పట్టించుకున్న దాఖలాలు లేవు. విషయం తెలుసుకున్న ఎస్సీ కాలనీ వాసులు ఆ ప్రాంతాన్ని ఆదివారం పరిశీలించారు. ఇసుక తవ్వకాలు చేపడుతున్న పొక్లెయిన్‌, తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. రాజకీయ నాయకులు, కొందరు అధికారుల కనుసన్నల్లోనే తవ్వకాలు సాగుతున్నాయని ఆరోపించారు. తవ్వకాలతో గోతులు ఏర్పడితే మృతదేహాలను ఖననం చేసేందుకూ స్థలం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తవ్వకాలు సాగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై తహసీల్దార్‌ ఉషారాణి మాట్లాడుతూ.. ఇసుక తవ్వకాల విషయం తమ దృష్టికి రాలేదని, తామెక్కడా అనుమలులు ఇవ్వలేదన్నారు. ఆ ప్రాంతాన్ని సోమవారం పరిశీలించి తగు చర్యలు చేపడతామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని