logo

అబద్ధాల అబ్బాయి.. మళ్లీ మోసపోలేమోయి..

అబద్ధాలను అతి సునాయాసంగా పదే పదే చెబుతూ.. అందుకు తగ్గట్టుగా నటిస్తూ ఇతరులను నమ్మించడంలో ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డిది అందె వేసిన చెయ్యి.

Updated : 08 Apr 2024 10:06 IST

వైకాపా పాలనలో సాగు నీటి విధ్వంసం
అయిదేళ్లలో చిల్లిగవ్వా ఇచ్చింది లేదు
రైతు సంక్షేమం అంటే ఇదేనా జగనూ!
న్యూస్‌టుడే, త్రిపురాంతకం గ్రామీణం, తాళ్లూరు

అబద్ధాలను అతి సునాయాసంగా పదే పదే చెబుతూ.. అందుకు తగ్గట్టుగా నటిస్తూ ఇతరులను నమ్మించడంలో ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డిది అందె వేసిన చెయ్యి. మాట తప్పను.. మడమ తిప్పనంటూ పాదయాత్రలో అడుగడుగునా అబద్ధాల డప్పు కొట్టారు. అధికారంలోకి రావడమే తరువాయి సమస్యలు పరిష్కరిస్తానంటూ మాయమాటలు చెప్పారు. గద్దెనెక్కాక అవేమీ చేయకుండా మిన్నకుండిపోయారు. సార్వత్రిక ఎన్నికలు తరుముకొచ్చిన వేళ ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర మొదలు పెట్టారు. తాను ఇంటింటికీ సంక్షేమం అందించానని.. అన్ని రంగాలను అభివృద్ధి చేశానంటూ మళ్లీ అవే అబద్ధాలను అతి సునాయాసంగా చెబుతూ మరోమారు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు ఉమ్మడి జిల్లాలో విధ్వంసానికి గురైన సాగునీటి రంగమే నిలువెత్తు నిదర్శనం. ఇక్కడి రైతులకు శ్రమించేతత్వం ఎక్కువ. నీరుంటే తమకున్న భూముల్లో బంగారు పంటలు పండిస్తారు. ఇంతటి కీలకమైన రంగాన్ని జగన్‌ తన పాలనలో విస్మరించారు. జిల్లాకు వరప్రదాయిని వంటి నాగార్జున సాగర్‌ కాలువలను చూసి ఓర్వలేకపోయారు. అభివృద్ధికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా వాటిని అధ్వాన స్థితికి చేర్చారు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ పరిధిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 1,170 మైళ్ల పొడవైన కాలువలున్నాయి. వీటి ద్వారా 4.43 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. అటువంటి కాలువలు ఇప్పుడు చిట్టడవుల్లా కనిపిస్తున్నాయి.

అధ్వానంగా కనిపిస్తున్న త్రిపురాంతకం మండలం మిరియంపల్లి మేజర్‌ కాలువ

అప్పట్లో రూ. కోట్లు వెచ్చించి పనులు...: 2008లో అప్పటి ప్రభుత్వం ప్రధాన కాలువలను రూ. 180 కోట్లతో, మేజర్‌ కాలువలను రూ. 300 కోట్లతో ఆధునికీకరించి అభివృద్ధి చేసింది. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో సుమారు రూ. 200 కోట్లతో మరమ్మతులు చేయించింది. దీంతో జలాశయం నుంచి విడుదలైన నీరు ఆయకట్టు చివరి భూములకు కూడా అందేది. రైతులకు అంతగా ఇబ్బందులుండేవి కావు.

ప్రతిపాదనలే తప్ప పైసా మంజూరు లేదు...: 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగు నీటి రంగాన్ని పూర్తిగా విస్మరించింది. ప్రధాన కాలువతో పాటు బ్రాంచి, మేజర్‌, మైనర్‌ కాలువలు., కొన్ని చోట్ల లైనింగ్‌, కాంక్రీట్‌ పనులు కూడా దెబ్బతిన్నాయి. కాలువలు ఛిద్రం అయ్యాయి. లాకులు, గేట్లు తుప్పు పట్టి కనిపిస్తున్నాయి. దీంతో దిగువ పొలాలకు నీరందని దుస్థితి. వీటి మరమ్మతులకు నిధులు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయినా ప్రయోజనం లేకపోతోంది. నాలుగేళ్లుగా నిధులు మంజూరు కానేలేదు. కాలువల నిర్వహణకు అయిదేళ్లలో రూపాయి కూడా కేటాయించలేదు. కనీసం తాత్కాలిక మరమ్మతులు చేపట్టే దిశగా కూడా వైకాపా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది లేదు.

మారిన రూపురేఖలు...: వైకాపా ప్రభుత్వం తన పాలనలో సాగర్‌ కాలువలను పట్టించుకోలేదు. దీంతో మేజర్లు, మైనర్‌లలో అధికభాగం అధ్వానంగా మారాయి. వాటిల్లో పెద్ద ఎత్తున చిల్లకంప పెరిగింది. గడ్డి దట్టంగా మొలిచి రూపురేఖలు కోల్పోయాయి. కాలువల పక్కన గట్లను ఏర్పాటు చేసి రహదారులను నిర్మించారు. వాటికి వైకాపా ప్రభుత్వంలో కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. దీంతో అవి కూడా పూర్తిగా శిథిల స్థితికి చేరాయి. కాలువల గట్లపై వాహనాలు వెళ్లేందుకు వీల్లేకపోవడంతో ఉన్న అరకొర సిబ్బందికి పర్యవేక్షణ కష్టంగా మారింది.

బీళ్లుగా మారిన పొలాలు...: సాగర్‌ నుంచి నీరు విడుదల చేస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతులు బంగారు పంటలు పండిస్తారు. ప్రధానంగా వరి పంటను సాగు చేసి మంచి దిగుబడులు సాధించేవారు. దీంతో కుటుంబ పోషణకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. గతేడాది కనీసం నీరు కూడా ఇవ్వలేదు. విధి లేని పరిస్థితిలో చాలామంది రైతులు ఎలాంటి పంటలు సాగు చేయకుండా భూములను ఖాళీగా ఉంచారు. దీంతో సారవంతమైన మాగాణి భూములు నిస్సారమయ్యాయి. మరికొందరు రైతులు నీటి ఎద్దడి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో మెట్ట పంటలు సాగు చేసినా దిగుబడులు రాక అప్పులపాలయ్యారు. ఈ నేపథ్యంలో సంక్షేమం అంటే ఇదేనా జగనూ అని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని రైతులు, ఆయా కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని