logo

సుద్దపూస బప్పులు.. సుద్దముక్కకూ లేవు డబ్బులు

తమ ప్రభుత్వం విద్యాలయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిందంటూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పదే పదే ప్రకటిస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, ప్రచార సభల్లోనూ ఊదరగొడుతున్నారు.

Updated : 16 Apr 2024 06:16 IST

విద్యాలయాల్లో విప్లవమంటూ కబుర్లు
పాఠశాల నిర్వహణకు నిధులిచ్చింది లేదు
సొంత ఖర్చుతో హెచ్‌ఎంలకు అప్పులు

తమ ప్రభుత్వం విద్యాలయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిందంటూ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పదే పదే ప్రకటిస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, ప్రచార సభల్లోనూ ఊదరగొడుతున్నారు. ఆంగ్ల విద్యకు పెట్టపీట వేసి అంతర్జాతీయ స్థాయి విద్యార్థులను తయారు చేశామంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నాడు- నేడుతో బడుల రూపురేఖలనే మార్చేశామంటూ డప్పులు పగిలేలా గొప్పల మోత మోగిస్తున్నారు. ఆచరణలో వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రం అందుకు విరుద్ధంగా పరిస్థితులున్నాయి. జగన్‌వన్నీ సుద్దపూస మాటలే తప్ప సుద్దముక్క కొనేందుకు నిధులు ఇవ్వని తీరు తేటతెల్లమవుతుంది.

విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడేలా వైకాపా అయిదేళ్ల పాలన కొనసాగింది. విధులపరంగా వెతలకు గురిచేసింది. రేపటి పౌరులకు పాఠాలు చెప్పేందుకు అవసరమైన సౌకర్యాలనూ కల్పించకుండా వారి జీవితాలతో చెలగాటమాడింది. కక్షగట్టి విద్యా వ్యవస్థను ఆగమాగం చేసింది.


ప్రతి కార్యక్రమం చేయాల్సిందేనంటూ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఆదేశాలిస్తారు. చేసిన తర్వాత ఫొటోలు కచ్చితంగా అప్‌లోడ్‌ చేయాల్సిందేనని హుకూం జారీ చేస్తారు. డబ్బులు మాత్రం ఒక్క పైసా ఇవ్వరు. బిల్లులు పెట్టినా మంజూరు చేయరు.

మద్దిపాడు మండలంలోని ఒక ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ఆవేదన


ప్రభుత్వం చెప్పే కార్యక్రమాలను అమలు చేయాల్సిందేనని.. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తారు. నిధులు మాత్రం ఇవ్వరు. అధికారులు చెప్పే కార్యక్రమాలు చేసేందుకే ఏడాదికి సుమారు రూ.70 వేల వరకు సొంత డబ్బులు ఖర్చుపెట్టాల్సి వస్తోంది.

చీమకుర్తి మండలంలోని ఒక సీనియర్‌ ప్రధానోపాధ్యాయుడి నిర్వేదం


సమ్మేటివ్‌, ఫార్మేటివ్‌ పరీక్షల ప్రశ్నపత్రాలు ఆన్‌లైన్‌లో పెడతారు. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని విద్యార్థులకు పరీక్షలు పెట్టాలని ఆదేశాలు జారీ చేస్తారు. పిల్లలందరికీ అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు జిరాక్స్‌ తీయడానికి జేబుల్లో నుంచి ఖర్చు పెట్టక తప్పడం లేదు. పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు చేర్చాల్సిన బాధ్యత విద్యాశాఖది. ఆ భారం కూడా మాపై మోపుతున్నారు. అవికూడా ఒకేసారి కాకుండా నాలుగుసార్లు మండల కేంద్రాలకు తిప్పుకొంటున్నారు. రవాణా ఛార్జీలు ఒక్క పైసా ఇవ్వడం లేదు. అదేమని ప్రశ్నిస్తే లక్షల్లో వేతనాలు తీసుకోవడం లేదా అని ప్రజాప్రతినిధులే హేళనగా మాట్లాడుతున్నారు. - పశ్చిమ ప్రకాశంలోని ఓ మారుమూల పాఠశాలకు చెందిన హెచ్‌ఎం ఆవేదన


తెదేపా ప్రభుత్వంలో  నాడు

పాఠశాల నిర్వహణకు సంబంధించి వివిధ రూపాల్లో నిధులు కేటాయించారు. ప్రతి క్లస్టర్‌ రిసోర్స్‌ సెంటర్‌కు నాలుగు రకాల నిధులు విడుదలయ్యేవి. కంటిజెన్సీ, మిటింగ్‌ టీఏ, టీఎల్‌ఎం, మెయింటినెన్స్‌ గ్రాంట్‌ కింద జిల్లాకు రూ.68.40 లక్షలు అందజేశారు. ఇవికాకుండా పాఠశాల గ్రాంట్‌ కింద విద్యార్థుల సంఖ్యను బట్టి ఏడాదికి రూ.25 వేల నుంచి రూ.3 లక్షల వరకు నిధులు అందించేవారు. వీటితో తరగతి గదులు, మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు, పైపులు, విద్యుత్తు పరికరాలకు మరమ్మతులు వంటివి చేయించేవారు. కంటింజెన్సీ నిధులతో అవసరమైన రిజిస్టర్లు, తెల్లకాగితాలు, చార్టులు, జిరాక్స్‌లు, చాక్‌పీసులు, డస్టర్లు కొనుగోలు చేసేవారు. ఏదైనా ప్రత్యేక దినోత్సవాల్లో విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు, బహుమతులు అందించేందుకు వెచ్చించేవారు. ఉపాధ్యాయులతో ఎంఈవోల సమావేశాలు, శిక్షణ తరగతులు నిర్వహించినప్పుడు రవాణాభత్యం కింద ఒక్కో క్లస్టర్‌కు రూ.6.84 లక్షలు ఇచ్చిన దాఖాలాలున్నాయి. నిర్వహణ కింద రూ.17.10 లక్షలు విడుదల చేశారు.


విఫల సారథి హయాంలో  నేడు

వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అవన్నీ మూలకు చేరాయి. పాత పద్ధతిలోనే జిల్లా సమగ్రశిక్షా కార్యాలయం నుంచి బడ్జెట్‌ అంచనాల ప్రతిపాదనలు పంపారు. అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ అయిదేళ్లలో నాడు- నేడు పనులకు సంబంధించి మినహా ఇతరత్రా అవసరాలకు పైసా ఇచ్చింది లేదు. రెండు మాసాల క్రితం నిర్వహణ గ్రాంట్‌ పేరుతో ఒక్కో ఉన్నత పాఠశాలకు రూ.3 లక్షల వరకు ఖాతాల్లో జమ చేశారు. ఆ తర్వాత వాటిని తాము సూచించిన ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు బదిలీ చేయాలంటూ మళ్లీ ఆదేశాలిచ్చారు. బదిలీ చేయగా చివరికి ఖాతాలో రూ.20 వేలు మాత్రమే మిగిలినట్లు దర్శి మండలంలోని ఒక హెచ్‌ఎం తెలిపారు. టీఎల్‌ఎం గ్రాంట్‌గా ప్రతి టీచర్‌కు రూ.500 గతంలో ఇచ్చేవారు. వీటితో కృత్యాధార బోధనకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఆ ఊసేలేదు.


హెచ్‌ఎంలు, ఎంఈవోల విలవిల...: మండల సముదాయ కేంద్రాలకు నిధుల రాకపోవడంతో ఎంఈవోలు సొంత నిధులు ఖర్చు పెట్టి ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్నారు. బిల్లులు పెట్టినా సీఎఫ్‌ఎంఎస్‌ గడప దాటక.. ఎప్పుడొస్తాయో తెలియక ఆవేతన చెందుతున్నారు. కార్యక్రమాల నిర్వహణ కోసం సొంత డబ్బులు వెచ్చిస్తూ ప్రధానోపాధ్యాయులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇదిలా ఉంటే సొంత పెట్టుబడి పెట్టలేని ప్రధానోపాధ్యాయులు ఉన్నచోట పాఠశాల నిర్వహణ కష్టతరంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని