logo

జనం చూస్తే నాకేంటి!

పరదాల మధ్య ఇంతకాలం తిరిగిన జగన్‌కు.. సామాన్యుల బాధలు, వారి ఆవేదన ఇంతకాలం ఏమాత్రం పట్టలేదు. వాస్తవ పరిస్థితులను గుర్తించలేదు.

Published : 04 May 2024 06:32 IST

నిధులివ్వక రూ. కోట్లలో బకాయిలు
పేదలకు అందని ఆరోగ్యశ్రీ సేవలు
రోగులను గెంటేస్తున్నఆసుపత్రులు

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం, పామూరు, కురిచేడు: పరదాల మధ్య ఇంతకాలం తిరిగిన జగన్‌కు.. సామాన్యుల బాధలు, వారి ఆవేదన ఇంతకాలం ఏమాత్రం పట్టలేదు. వాస్తవ పరిస్థితులను గుర్తించలేదు. 3,257 రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్సలు అందిస్తున్నట్లు ఎన్నికల వేళ సభల్లో డప్పులు కొడుతున్న ఆయన.. తానే నిధులాపేసి వారి ఆరోగ్యానికి ఉరేశారనే నిజాన్ని కప్పిపుచ్చుతున్నారు. తన పాలనలో విప్లవం తెచ్చామంటూ మాటల్లో ఊదరకొడుతూ.. చేతల్లో మాత్రం ఆసుపత్రులకు వెళ్లిన రోగులను గెంటేసే వికృత విధానాలను అమలు చేశారు. ఆసుపత్రులకు బకాయిల నిధులాపి పేదల బతుకులతో చెలగాటమాడారు. జనం అప్పులు చేసి వైద్యచికిత్సలు పొందుతుంటే తాను మాత్రం ‘మీ చావు మీరు చావండి’ అని వదిలేశారు. ఫలితంగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అంటేనే నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఆసక్తి చూపడం లేదు. యాజమాన్యాలు చికిత్స అందించకుండా రోగులను గెంటేస్తున్నాయి. బిల్లులు ఇవ్వకపోతే సేవలు నిలిపివేస్తామని యాజమాన్యాలు డిసెంబర్‌లో ఒకసారి, ఫిబ్రవరిలో మరోసారి కోరాయి. దీంతో రూ.కోటి రావాల్సిన ఆసుపత్రికి రూ.లక్ష అందించి చేతులు దులుపుకొన్నారు. ఒంగోలు నగరంలోని ఒక పెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రికి ప్రస్తుతం రూ.16 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. దీంతో నెట్‌వర్క్‌ ఆసుత్రులు సేవలందించేందుకు విముఖత చూపుతున్నాయి.

  • సి.ఎస్‌.పురం మండలం వెంగనగుంట గ్రామానికి చెందిన కుడారి కొండయ్య ఈ ఏడాది జనవరిలో పురుగులమందు తాగాడు. చికిత్స నిమిత్తం ఒంగోలులో ఆరోగ్యశ్రీ సేవలందించే ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి రూ.కోట్లలో బకాయిలు రావాల్సి ఉన్నందున తాము ఆరోగ్యశ్రీ కింద వైద్యచికిత్సలు అందించలేమని.. నగదు చెల్లిస్తే చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో రూ.3.60 లక్షలకు పైగా నగదు చెల్లించి కుమారుడికి వైద్యచికిత్సలు చేయించారు.
  • పీసీపల్లి మండలంలోని చిరుకూరివారిపల్లికి చెందిన చిరుకూరి నరసమ్మ అనే వృద్ధురాలికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రమాదవశాత్తు కింద పడటంతో కాలు విరిగింది. చికిత్స కోసం ఒంగోలులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. ప్రభుత్వం నుంచి రూ. 18 కోట్లకు పైగా బకాయిలున్నందున తాము ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా సేవలందించలేమని.. డబ్బు కట్టాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే వేరే ఆసుపత్రికి వెళ్లిపోవాలని తేల్చి చెప్పారు.
  • పామూరుకు చెందిన గుత్తి రమణయ్య పాడి గేదెలను మేపుకొంటూ జీవనం సాగిస్తుంటారు. గుండె సంబంధిత వ్యాధితో ఆరు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో చికిత్స కోసం నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించడం లేదని సిబ్బంది తెలిపారు. విధి లేని పరిస్థితుల్లో ఆర్థిక భారమైనప్పటికీ రూ.50 వేలు సొంత నగదును వెచ్చించి చికిత్సలు చేయించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని