logo

జీతం నెల్లూరు నగరపాలక సంస్థ నుంచి.. సేవలు నరసరావుపేటలో వైకాపాకు!

నెల్లూరు నగరపాలకసంస్థలో పనిచేస్తున్న పొరుగుసేవల ఉద్యోగులు వారికి కేటాయించిన విధులను విస్మరించి వైకాపా అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు.

Published : 09 May 2024 03:04 IST

నెల్లూరు (నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరు నగరపాలకసంస్థలో పనిచేస్తున్న పొరుగుసేవల ఉద్యోగులు వారికి కేటాయించిన విధులను విస్మరించి వైకాపా అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. కొందరు సిబ్బంది ఏకంగా నరసరావుపేటకు వెళ్లి అక్కడ వైకాపా ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ (ప్రస్తుతం నెల్లూరు నగర ఎమ్మెల్యే) తరఫున ప్రచారం చేస్తుండటం గమనార్హం. పొరుగుసేవల సిబ్బంది ద్వారక, మంజుల, సబిహలు అనిల్‌కుమార్‌, మంత్రి అంబటి రాంబాబుతో దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. వీరితో పాటు మరో పది మంది వరకు ఉద్యోగులు నరసరావుపేటలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్‌కు నెల రోజుల ముందు అధికార పార్టీ నేతల సిఫార్సులతో 113 మంది నగరపాలకసంస్థలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిగా చేరారు. వీరికి నెలకు రూ.21వేల వరకు జీతం చెల్లిస్తున్నారు. వీరంతా ఎక్కడ పనిచేస్తున్నారో అధికారులకు తెలియకపోవడం గమనార్హం. వీరితో పాటు అయిదేళ్ల నుంచి పని చేస్తున్న సిబ్బందిలో కొందరు విధులు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. వచ్చి హాజరు వేసుకోవడం.. తిరిగి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. ఐఏఎస్‌ అధికారి కమిషనర్‌గా ఉన్నా.. పాలన గాడిలో పడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని