logo

మాటల్లో తీపి.. చేతల్లో ఏది జగన్..?

మాటలతో మాయ చేయడంలో సిద్ధహస్తుడైన వైకాపా అధినేత జగన్‌ ఆమదాలవలసకు తీరని అన్యాయం చేశారు. అలవాటు ప్రకారం.. చక్కెర కర్మాగారం అందుబాటులోకి తీసుకొస్తానని ఇచ్చిన హామీని గాలికొదిలేశారు.

Updated : 09 May 2024 06:13 IST

చక్కెర కర్మాగారం తెరిపిస్తానన్న హామీని విస్మరించిన సీఎం

రోడ్డున పడిన వందలాది కార్మిక కుటుంబాలు

మాటలతో మాయ చేయడంలో సిద్ధహస్తుడైన వైకాపా అధినేత జగన్‌ ఆమదాలవలసకు తీరని అన్యాయం చేశారు. అలవాటు ప్రకారం.. చక్కెర కర్మాగారం అందుబాటులోకి తీసుకొస్తానని ఇచ్చిన హామీని గాలికొదిలేశారు. అధికారంలోకి రాగానే అధికారుల చేత హడావుడిగా పరిశీలనలు చేయించారు. అనంతరం చేతులు దులిపేసుకున్నారు. ఇంకేముంది అన్నదాతల ఆశలు అడియాసలయ్యాయి. ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం కీలక పదవిలో ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గానికి న్యాయం చేయలేకపోయారు. అయిదేళ్లలో కర్మాగారాన్ని తెరిపించాలని ఒక్కసారైనా జగన్‌కు గుర్తు చేసిన పాపాన పోలేదు.
ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, న్యూస్‌టుడే ఆమదాలవలస గ్రామీణం  
‘నేను ఉన్నాను... నేను విన్నాను. ప్రతి రైతుకు హామీ ఇస్తున్నాను. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమదాలవలస చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తాను. కార్మికులందరికీ న్యాయం చేస్తాను.’

ఎన్నికల ముందు 2018 డిసెంబరు 11న ఆమదాలవలస పట్టణంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీ.


నాడు ఆశాజ్యోతి.. నేడు దీనస్థితి..

1961లో నాటి కాంగ్రెస్‌ ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావు కృషితో ప్రారంభించిన చక్కెర కర్మాగారం ద్వారా అప్పట్లో వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించారు. అత్యున్నత ప్రమాణాలతో పరిసరాల్లోని ఎనిమిది మండలాల రైతులకు ఆశాజ్యోతిగా వెలుగొందింది. కాలక్రమేణా దీన్ని సహకార చక్కెర కర్మాగారంగా మార్చేశారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లింది. దేశవ్యాప్తంగా శ్రీకాకుళంలో పండే చెరకుకు ఎంతో ప్రాధాన్యం ఉండటంతో నాలుగు దశాబ్దాలపాటు సహకార సంఘం ఆధ్వర్యంలో కర్మాగారం లాభాల బాటలో నడిచింది. నిత్యం వెయ్యి టన్నుల వరకు క్రషింగ్‌ జరిగేది. దీన్ని మరింత పెంచాలని అధికారులు ప్రణాళికలు రచించినప్పటికీ నష్టాలు చుట్టుముట్టడంతో 2004లో మూసేశారు.

తలుపులు తెరవలేకపోయారు..

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి నిపుణులతో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ 2020 ఫిబ్రవరి 2న కర్మాగారాన్ని పరిశీలించింది. అనంతరం ఏడాది తర్వాత 2021 ఆగస్టులో ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్మాగారంపై కలెక్టర్‌ నివేదిక అందించారు. అదే ఏడాది డిసెంబరు 18న ఏపీఐఐసీకి చెందిన ఓఎస్‌డీ అజయ్‌కుమార్‌, చంద్రశేఖర్‌, ఆజాద్‌లతో కూడిన బృందం వచ్చి భూములు, కర్మాగారాన్ని పరిశీలించి నివేదించారు. ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి.. తప్ప కర్మాగారం తలుపులు తెరుచుకోలేదు.

అన్నదాతల జీవితాలు తలకిందులు..

కర్మాగారం పనిచేసినప్పుడు నాగావళి, వంశధార నదులను సద్వినియోగం చేసుకొని జిల్లాలోని చాలా మండలాల్లో చెరకును పండించేవారు. గిట్టుబాటు ధర లభిస్తుండటంతో రైతులు కూడా ఆసక్తి చూపేవారు. కర్మాగారాన్ని ఒక్కసారిగా మూసివేయడంతో చెరకు ఉత్పత్తి తగ్గిపోయింది. అన్నదాతలు ఇతర పంటలవైపు మొగ్గు చూపడంతో అకాల వర్షాలు, తుపాన్లకు నష్టాలను చవిచూస్తున్నారు. ఈ కారణంతో ఇప్పటికే జిల్లాలో వందలాది మంది రైతులు వలస బాట పట్టగా.. మరికొందరు వ్యవసాయాన్నే మానేసి ఇతర పనులకు వెళ్లిపోయారు.

ఒక్కసారి కూడా గుర్తు రాలేదా?

‘నియోజకవర్గంలో చక్కెర కర్మాగారం ఒకటుంది. దాన్ని తెరిపించుకోవాలి.. రైతులకు న్యాయం జరిగేలా చూడాలి..’ అనే ఆలోచన తమ్మినేని సీతారాంకు అయిదేళ్లలో ఒక్కసారి కూడా గుర్తు రాలేదా అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండి స్వలాభం చూసుకోవడమే తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోలేదని బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

నేను చెరకు ఎక్కువగా పండిస్తాను. కర్మాగారం ఉన్నప్పుడు ఇక్కడే ఇచ్చేవాణ్ని. లాభాలు మాటలతో సరిపెడుతున్నారు..సైతం బాగా ఉం
డేవి. అది మూతపడిన తర్వాత జిల్లాలో చెరకు సాగు తగ్గిపోయింది. గతంలో వర్షాలు, వరదలు వచ్చినా చెరకు పంటకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. రాజకీయ నాయకులు అదిగో ఇదిగో అంటూ మాటలతో సరిపెడుతున్నారే తప్ప ఫ్యాక్టరీని తెరిపించే ఆలోచన చేయలేదు.
- ముద్దాడ కృష్ణారావు, రైతు, నిమ్మతొర్లాడ, ఆమదాలవలస  


అమ్మేసినా.. అడ్డుకున్నారు.. అప్పటి కర్మాగార ఛైర్మన్‌గా తమ్మినేని సీతారాం అన్న తమ్మినేని శ్యామలరావు ఉండేవారు. కర్మాగారం అమ్మడానికి వీల్లేదని 2003-04 సీజన్లో నడపాలని డిమాండ్‌ చేస్తూ అప్పటి రైతులు మహాజన సభలో తీర్మానం చేశారు. దానికి విరుద్ధంగా 2004లో బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థకు రూ.6.20 కోట్లకు విక్రయించారు. ఈ నిర్ణయాన్ని తప్పు పడుతూ కొంతమంది షేర్‌ హోల్డర్స్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. కర్మాగారాన్ని సహకార సంఘం ఆధ్వర్యంలో నడిపించాలని కోర్టు తీర్పునిచ్చింది. దీనికి వ్యతిరేకంగా సంస్థ భూములను ఏపీఐఐసీకీ అప్పగించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ భూములు అమ్మి సదరు ప్రైవేటు కంపెనీకి వడ్డీతో సహా డబ్బులు చెల్లించాలన్నది ఆ ప్రయత్నం వెనుకున్న కారణం.

మంచి లాభాలు వచ్చేవి..

చక్కెర కర్మాగారానికి మంచి లాభాలు వచ్చేవి. కోల్‌కతా, కటక్‌ మార్కెట్‌ వరకు వెళ్లేవి. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవవ్వడం, పంటకు గిట్టుబాటు ధర కల్పించలేకపోవడం, మెరుగైన వంగడాలను అభివృద్ధి చేయలేకపోవడం వంటి కారణాలతో నష్టాల బాట పట్టించారు. చివరకు కర్మాగారం మూతపడేలా చేశారు.
- కొండయ్య, మాజీ ఉద్యోగి చక్కెర కర్మాగారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని