logo
Published : 06 Aug 2022 00:40 IST

మత్తుపదార్థాల నిర్మూలనకు సహకరించండి

ఎమ్మెల్యేలకు స్టాలిన్‌ లేఖ

మత్స్యశాఖ అభివృద్ధి పనులను వీసీలో ప్రారంభిస్తున్న స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: మత్తుపదార్థాల నిర్మూలన చర్యలకు సహకరించాలంటూ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం వారికి లేఖలు రాశారు. అందులో... సమాజంలో మత్తుపదార్థాల ఉపయోగాన్ని పూర్తిగా నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వం దృఢమైన చర్యలు చేపట్టిందన్నారు. మత్తుపదార్థాలు ప్రజలను బానిసల్ని చేస్తోందని, అభివృద్ధిని అడ్డుకుంటోందని, భవిష్యత్తును నాశనం చేస్తోందని, కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోందని తెలిపారు. సమాజంలో విషంగా మారిన మత్తుపదార్థాలను పూర్తిగా నిర్మూలించాల్సి ఉందన్నారు. దానికి అవసరమైన చట్టపరమైన మార్గాలన్నిటినీ ప్రభుత్వం క్రమంగా పాటిస్తుందని తెలిపారు. మత్తుపదార్థాల ఉపయోగంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడం కూడా ప్రభుత్వ కీలక బాధ్యతగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. దీనికోసం ఆగస్టు 11వ తేదీని మత్తుపదార్థాల వ్యతిరేక అవగాహన దినోత్సవంగా ఎంపిక చేసినట్టు తెలిపారు. ఆ రోజు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అనర్థాల గురించి వీడియో ప్రదర్శించనున్నారని తెలిపారు. దీని గురించి జిల్లా యంత్రాంగం ద్వారా తగిన సమాచారం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఇది రాజకీయ సమస్య కాదని, రాష్ట్ర భవిష్యత్తుకు ఇబ్బంది అని తెలిపారు. వరుస ప్రచారాలతో మత్తుపదార్థాల అనర్థాలను చెప్పగలమని, దీనికి ఎమ్మెల్యేలు సహకారం కీలకమని పేర్కొన్నారు.
మత్స్యశాఖ అభివృద్ధి పనులు ప్రారంభం
చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్ర మత్స్యశాఖ తరఫున రూ.43.50 కోట్ల వ్యయంతో పూర్తిచేసిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించారు. మత్స్యశాఖ తరఫున చెంగల్పట్టు జిల్లా పుదుపట్టినం, ఉయ్యాలికుప్పంలో చేపలు దించుకునే కేంద్రం, సముద్రకోత నివారణ పనులు, తెన్కాశి జిల్లా కడనాలో చేపల పెంపకం తొట్టెలు, తేని జిల్లా మంజళారులోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో కొలను, తేని జిల్లా వైగై డ్యామ్‌లో  పెంపకం తొట్టెలు, మయిలాడుతురై జిల్లా పళైయార్‌ ఫిషింగ్‌ హార్బరులో బోట్లు మరమ్మతు, చేపలు ఎండబెట్టే కేంద్రం, మదురై జిల్లా పడితురైలో చేపల పెంపకం, మత్స్యశాఖ కార్యాలయ భవనం, రామనాథపురం జిల్లా మండపంలో మత్స్యశాఖ సహాయక సంచాలకుని కార్యాలయం నిర్మించారు. అలాగే తిరునెల్వేలి జిల్లా మణిముత్తారు, విరుదునగర్‌ జిల్లా పిళవకల్‌, కాంచీపురం జిల్లా మణిమంగలం చేపవిత్తనాల క్షేత్రాలలో రంగు చేపల పెంపక షెడ్‌, శిక్షణ కేంద్రం, తూత్తుకుడి జిల్లా ఫిషింగ్‌ హార్బరు, తరువైకుళంలో చేపలు దించుకునే కేంద్రం, కన్యాకుమారి జిల్లా తేంగాపట్టణం, కుళచ్చల్‌ ఫిషింగ్‌ హార్బరు తదితర చోట్ల మంచుదిమ్మెల తయారీ కేంద్రాలు నిర్మించారు. వాటిని సచివాలయం నుంచి ముఖ్యమంత్రి స్టాలిన్‌ శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి రాధాకృష్ణన్‌, రాష్ట్ర చేపల పెంపకం సంస్థ ఛైర్మన్‌ గౌతమన్‌, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇరైయన్బు, పశుసంవర్థక, పాడిపరిశ్రమలు, మత్స్యసంక్షేమశాఖ అదనపు ప్రధానకార్యదర్శి జవహర్‌, మత్స్యశాఖ కమిషనరు పళనిస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌ఎల్‌సీ నియామకాలపై ప్రధానికి వినతి
చెన్నై, న్యూస్‌టుడే: ఎన్‌ఎల్‌సీ నియామకాల వ్యవహారమై ప్రధానికి స్టాలిన్‌ లేఖ రాశారు. అందులో... తమిళనాడులోని కేంద్రప్రభుత్వ రంగ సంస్థయైన ఎన్‌ఎల్‌సీ ప్రాజెక్టులు, గనులకు నియామకాల్లో ఆ ప్రాజెక్టులకు భూములు అందించిన కుటుంబాలకు చెందిన స్థానిక దరఖాస్తుదారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గేట్‌ మార్కుల ఆధారంగా పట్టభద్ర ట్రైనీ ఇంజినీర్ల నియామకాలు చేపట్టకూడదని ఆదేశించాలంటూ మే 5న రాసిన లేఖలో కోరినట్టు గుర్తు చేశారు. రాష్ట్రానికి చెందిన పట్టభద్ర ట్రైనీ ఇంజినీర్లకు నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్‌లో న్యాయం ఉండటంతో ప్రధాని జోక్యం చేసుకుని సుముఖ పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.
నీటి విడుదలపై కేరళ సీఎం విజ్ఞప్తి
చెన్నై, న్యూస్‌టుడే: ముల్లైపెరియారు ఆనకట్ట నీటిని దశలవారీగా విడుదల చేయాలంటూ స్టాలిన్‌ను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. అందులో... కేరళలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముల్లై పెరియారు ఆనకట్టలోని నీటిమట్టం 136 అడుగులకు చేరిందన్నారు. ఇడుక్కి తదితర పలు ప్రాంతాలకు వాతావరణ పరిశోధన కేంద్రం ఇప్పటికే రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిందని తెలిపారు. ఆ మేరకు వర్షాలూ కురుస్తున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే నీటిమట్టం భారీగా పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండటంతో ఆనకట్టలోని నీటి మట్టాన్ని క్రమేణా తగ్గించాల్సి ఉందన్నారు. ఈ వ్యవహారంలో వెంటనే జోక్యం చేసుకుని ఆనకట్ట నుంచి విడుదల చేసే నీరు అదనపు జలాలకన్నా ఎక్కువగా ఉండటాన్ని నిర్ధారించాలని, దశలవారీగా నీటిని విడుదల చేయాలని అధికారులకు సూచించాలని కోరారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల భద్రత కోసం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉండటంతో ఆనకట్ట షట్టర్లు తెరవడానికి 24 గంటలకు ముందు కేరళ ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts