logo

ఏడాదికి సరిపడా తాగునీరు

చెన్నైవాసులు మరో ఏడాదిపాటు తాగునీటికి ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. సరిపడా అందుబాటులో ఉన్నట్లు చెన్నై మహానగర తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ మండలి (సీఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ - జలమండలి) ప్రకటించింది.

Published : 29 Sep 2022 02:29 IST
నిండిన చెన్నై పరిసర జలాశయాలు
-ఈనాడు, చెన్నై
రెడ్‌హిల్స్‌ రిజర్వాయరు

చెన్నైవాసులు మరో ఏడాదిపాటు తాగునీటికి ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. సరిపడా అందుబాటులో ఉన్నట్లు చెన్నై మహానగర తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ మండలి (సీఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ - జలమండలి) ప్రకటించింది. కొన్నేళ్ల క్రితం తాగడానికి నీరు కరవై అలమటించిన నగరవాసులకు ఇది ఎంతో ఊరటనిచ్చే విషయమే.

జలమండలి అధికారులు ఈ మధ్యే సమీక్ష నిర్వహించారు. గతేడాది, అంతకుముందు జలాశయాలలో నీటి నిల్వ, తాజా పరిస్థితిని అంచనా వేశారు. ఈ ఏడాది వేసవి గట్టెక్కినట్లేనని తేల్చారు. ఏడాదిపాటు ఇబ్బంది లేనంతగా నిల్వలు ఉన్నట్లుగా అంచనాకు వచ్చారు. పరీవాహక ప్రాంతాల్లో మరింత మంచి వర్షాలు కురిస్తే అందుబాటులో ఉండే నీటిని వేసవి మరింత చక్కగా వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.


8 టీఎంసీలకు మించి..

చేతిపంపుల ద్వారా మెట్రో నీటి సరఫరా

నగరానికి 6 ప్రధాన రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరా చేస్తున్నారు. పూండి, చోళవరం, రెడ్‌హిల్స్‌, కన్నణ్‌కొట్టై తెర్వోయకండిగై, చెంబరంబాక్కం రిజర్వాయర్లలో మొత్తం ఈ నెల 28 నాటికి 6.89 టీఎంసీల నీరు నిల్వఉంది. వీటి పూర్తి సామర్థ్యం 11.75 టీఎంసీలు. కడలూరు జిల్లాలోని వీరాణం చెరువులోని నిల్వలతో కలిపి మొత్తం 8-9 టీఎంసీలు ఉంటుందని అధికారుల అంచనా. ప్రస్తుతం నగరానికి వీటితోపాటు మరో రెండు నిర్లవణీకరణ కేంద్రాల ద్వారా రోజుకు 1,030 మిలియన్‌ లీటర్ల (ఎంఎల్‌డీ) నీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు.  


ముమ్మరంగా ‘పూండి’ పనులు

నగరానికి తాగునీటిని అందించడంలో అత్యంత కీలకంగా ఉన్న పూండి రిజర్వాయరులో ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయి. దీంతో అక్కడి నీటిని సరఫరా చేయడం బాగా తగ్గింది. సుమారు రూ.10కోట్లతో ఈ పనులు చేపట్టారు. ప్రస్తుతం సగానికిపైగా పూర్తయినట్లు అధికారులు చెప్పారు. ఇవి పూర్తయితే నగరానికి నీరు యథావిధిగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.


భూగర్భజలాలు జాగ్రత్త సుమా..


అన్నా విశ్వవిద్యాలయంలో జియాలజీ విభాగ భవనం

అన్నా యూనివర్సిటీలోని జియాలజీ విభాగం జరిపిన పరిశోధనల్లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నై పరిధిలోని 38 శాతం నదీ పరివాహక ప్రాంతాలలో భూగర్భజలాలు అడుగంటుతున్నట్లుగా నివేదికలు ఇచ్చారు. ప్రస్తుతం నగర పరిధిలో తక్కువగా ఉన్నాయని.. నీరు భూమిలోకి సరైన రీతిలో ఇంకకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఒకరకంగా ఈ దుస్థితికి నగరీకరణం, అస్తవ్యస్తంగా భూవినియోగం కూడా కారణమని పేర్కొన్నారు. నగరంలోని తీరాన ఉన్న పల్లవాక్కం, తిరువాన్మియుర్‌, బెసెంట్‌ నగర్‌లో ఇసుక ప్రాంతాలున్నా.. అక్కడ నీరు ఇంకడం లేదని చెప్పారు. మంచి వర్షాలు పడుతున్నా ఈ పరిస్థితి ఉండటం ఆలోచించాల్సిన విషయమని తెలిపారు. నీటిని కృత్రిమంగా భూమిలోకి పంపే ప్రయత్నాలు చేయాల్సి ఉందని సూచించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో మంచి వర్షాలు నమోదయ్యాయని, దీనివల్ల ప్రస్తుతం ఇబ్బంది లేదని వివరించారు. ఈశాన్య రుతుపవనాలు కూడా బాగుంటే భూగర్భజలాలు కనీసం 5-10 శాతం పెరిగే అవకాశం  ఉందని తెలిపారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి నీటి వృథాను అరికట్టాలని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని