logo
Published : 04 Dec 2022 02:02 IST

అటవీశాఖ స్థల ఆక్రమణపై జవాబివ్వాలి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ప్యారిస్‌, న్యూస్‌టుడే: అటవీశాఖకు చెందిన స్థలాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారుల బినామీలు అక్రమించారని దాఖలైన పిటిషన్‌పై జవాబు ఇవ్వాలని సర్కారును మద్రాసు హైకోర్టు ఆదేశించింది. దిండుక్కల్‌ జిల్లా కొడైక్కానల్‌ పూలత్తూర్‌ గ్రామానికి చెందిన గోకులకృష్ణన్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో.. 2010-13 వరకు పూలత్తూర్‌ గ్రామంలో ఉన్న అటవీశాఖకు సొంతమైన 1.85 ఎకరాల స్థలాన్ని తమిళనాడు చీఫ్‌ ఆడిట్‌ అధికారిగా ఉన్న అంబలవాణన్‌ అనే వ్యక్తికి బినామీల ద్వారా ఇచ్చినట్లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు కావడంతో 35 మంది అధికారులు తనపై 11 అబద్ధపు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. తన కుటుంబసభ్యులను వేధించినట్లు చెప్పారు. అవకతవకలను బయటపెట్టిన సీబీసీఐడీ దర్యాప్తును తర్వాత నిలిపేశారన్నారు. ఈ అక్రమాల గురించి అదనపు కార్యదర్శి హోదా అధికారిని నియమించి విచారించాలని, సంబంధిత అధికారిపై శాఖాపరంగా చర్యలు చేపట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. జస్టిస్‌ అబ్దుల్‌ ఖుత్తూస్‌ దీన్ని విచారించారు. విజిలెన్స్‌ కమిషనరు, హోంశాఖ కార్యదర్శి తదితరులు దీనిపై జవాబు ఇవ్వాలని ఆదేశించారు. విచారణను 23వ తేదీకి వాయిదా వేశారు.

బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

ప్యారిస్‌, న్యూస్‌టుడే: రూ. 4 వేల కోట్ల బ్యాంకు రుణం మోసం కేసులో నకిలీ సంస్థ వాటాదారుడి బెయిల్‌ పిటిషన్‌ని మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. చెన్నైకి చెందిన సురానా ఇండస్ట్రియల్‌ లిమిటెడ్‌, సురానా పవర్‌ లిమిటెడ్‌లు ఐడీబీఐ, ఎస్‌బీఐల నుంచి, సురానా కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎస్‌బీఐ నుంచి తీసుకున్న రూ.4 వేల కోట్లను తిరిగి చెల్లించలేదు. అనంతరం సురానా సంస్థ డైరెక్టర్లపై సీబీఐ, ఈడీ కేసు నమోదు చేసి, అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో వీరిలోని ఆనంద్‌ బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది శనివారం విచారణకు వచ్చింది. ఈ కేసులో తప్పుగా అరెస్టు చేశారని, పెద్దగా చదువుకోకపోవడంతో సంస్థ రాబడి, ఖర్చుల గురించి ఆయనకు తెలియలేదని నిందితుడి తరఫు న్యాయవాది వాదించారు. ఈడీ న్యాయవాది వాదనలు వినిపిస్తూ... సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని, బెయిల్‌ ఇవ్వకూడదని తెలిపారు. అనంతరం బెయిల్‌ పిటిషన్‌ని కొట్టివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు.

జీవో రద్దు చేయాలనే వ్యాజ్యం కూడా...

ప్యారిస్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర హోంగార్డుల పని దినాలను తగ్గిస్తూ జారీ అయిన జీవోకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ని హైకోర్టు కొట్టివేసింది. పని దినాలను నెలలో ఐదురోజులుగా తగ్గించి 2017లో ప్రభుత్వం జారీచేసిన జీవోని వ్యతిరేకించి పలువురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది శనివారం విచారణకు వచ్చింది. పని దినాలను 5 నుంచి 10 రోజులుగా పెంచి, వేతనాన్ని 8 గంటలకు రూ. 560గా నిర్ణయించి 2019లో కొత్త జీవో జారీచేసినట్లు తెలిపారు. దీని రద్దు కోరిన వ్యాజ్యాన్ని కోర్టు కొట్టి వేసింది.

‘కురవర్‌’ పదాన్ని తొలగించాలని వినతి

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ఎంబీసీ జాబితాలో ఉన్న నరిక్కురవర్‌ సామాజిక వర్గంలో ఉన్న ‘కురవర్‌ ’ అనే పదాన్ని తొలగించాలని దాఖలైన పిటిషన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జవాబు ఇవ్వాలని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. మదురైకి చెందిన వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌లో .... తమిళ మూలాలతో కొండ ప్రాంతాల్లో ఉండే వారు కురవర్‌ సామాజిక వర్గం వారని, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ జాబితాలో ఉన్నారన్నారు. వారికి మలైకురవన్‌, కురవన్‌ మొదలైన పేర్లు ఉన్నాయన్నారు. ఎంబీసీ జాబితాలో 1951లో నరిక్కురవర్లను చేర్చారన్నారు. కురవర్ల మాతృభాష తమిళం అన్నారు. కానీ నరిక్కురవర్లు ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ నుంచి వచ్చినవారని తెలిపారు. వారి అలవాట్లు, వివాహ పద్ధతులు వేరేగా ఉంటాయన్నారు. నరిక్కురవర్లకి రిజర్వేషన్‌ కల్పించడంలో తమకి ఆక్షేపణ లేదని, కానీ వారిని నరిక్కురవర్‌ అని పిలవకూడదని, అందుకు బదులుగా వారిని నరిక్కారర్‌, కురువిక్కారర్‌ తదితర పేర్లతో పిలవాలన్నారు. ఇది శనివారం విచారణకు వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జవాబు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం, విచారణను వాయిదా వేశారు.

పీసీబీపై ధిక్కరణ చర్యలకు హెచ్చరిక

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ఏనుగుల మార్గాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుకల బట్టీల గురించి పూర్తి నివేదిక దాఖలు చేయని తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలిపై ధిక్కరణ చర్యలు చేపట్టాల్సి వస్తుందని మద్రాసు హైకోర్టు హెచ్చరించింది. కోయంబత్తూరు జిల్లాలో ఏనుగుల మార్గమైన తడాగం పళ్లత్తాక్కు ప్రాంతంలో ఉన్న 134 ఇటుకల బట్టీలను కోర్టు ఉత్తర్వుల మేరకు మూసేశారు. ఆనైకట్టి, పెరియనాయక్కన్‌ పాళెయం మొదలైన ఏనుగుల మార్గాలకు మార్చారని, ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వాటిని మూసేయాలని ఆదేశించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. విచారించిన హైకోర్టు .... బట్టీలకు అనుమతి వివరాలు పరిశీలించి నివేదిక దాఖలు చేయాలని కాలుష్య నియంత్రణ మండలికి ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ శనివారం మళ్లీ విచారణకు వచ్చింది. బోర్డు నివేదిక దాఖలు చేసింది. అందులో 23 ఇటుకల బట్టీలను పరిశీలించినట్లు నివేదిక దాఖలు చేసిన కాలుష్య నియంత్రణ బోర్డు, మిగిలిన వాటి గురించి తెలపలేదు. వాటిని మూసేందుకు చర్యలు చేపట్టలేదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదిక దాఖలు చేసినవారికి వ్యతిరేకంగా కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించారు. తర్వాతి వాయిదాలో దాఖలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో 22వ తేదీకి విచారణ వాయిదా వేశారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని