నడిపించే నాయకుడెవరు?
అన్నాడీఎంకేలో అంతర్గత సమస్యల కారణంగా పలువురు కీలక నేతలు ఇతర పార్టీలకు వెళ్తున్నారు.
ఆధిపత్య పోరుతో అన్నాడీఎంకే సతమతం
పార్టీని వీడుతున్న కీలక నేతలు
సైదాపేట, న్యూస్‌టుడే: అన్నాడీఎంకేలో అంతర్గత సమస్యల కారణంగా పలువురు కీలక నేతలు ఇతర పార్టీలకు వెళ్తున్నారు. దీంతో పార్టీ బలహీనపడుతుందనే చర్చలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత మృతి అనంతరం కూడా ఆ పార్టీ పాలన కొనసాగింది. కానీ తర్వాతి ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. అప్పుడు పార్టీ మున్ముందు ఎలా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రస్తుతం డీఎంకే సర్కారులో మంత్రులుగా ఉన్న రామచంద్రన్, ఏవీ వేలు, రఘుపతి, ముత్తుస్వామి, రాజ కన్నప్పన్, శేఖర్‌బాబు, అనితా రాధాకృష్ణన్ తదితరులు గతంలో అన్నాడీఎంకే నుంచి వచ్చినవారే. జయలలిత మృతి అనంతరం అన్నాడీఎంకేలో నెలకొన్న అనిశ్చితి కారణంగా బయటకు వచ్చేవారి సంఖ్య మరింత పెరుగుతోంది. ముఖ్యంగా 2017లో మాజీ మంత్రి నయినార్ నాగేంద్రన్ తదితరులు భాజపా గూటికి వెళ్లారు. ఎడప్పాడి పళనిస్వామిని ముఖ్యమంత్రి చేసిన శశికళ బెంగళూరు జైలుకు వెళ్లినప్పుడు పార్టీలో కీలక పరిణామాలు జరిగాయి. ఈపీఎస్, ఓపీఎస్ కలిసిన తర్వాత అప్పట్లో శశికళ- టీటీవీ దినకరన్‌కు మద్దతుగా నిలిచిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. వారిలో అనేక మంది ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. టీటీవీ దినకరన్ మద్దతుదారులుగా ఉన్న సెంథిల్‌బాలాజీ, తంగ తమిళ్‌సెల్వన్, వీపీ కలైరాజన్, పాపిరెడ్డిపట్టి పళనియప్పన్, మానామదురై మారియప్పన్ కెన్నడి తదితరులు డీఎంకేకు వరుస కట్టారు. నాంజిల్ సంపత్, బెంగళూరు పుగళేందిలు కూడా దూరమయ్యారు. అందులో ప్రస్తుతం పుగళేంది మాత్రం ఓపీఎస్‌కు మద్దతుదారుగా వ్యవహరిస్తున్నారు. సంపత్ ద్రావిడ ఇయక్క ప్రచారకర్తగా డీఎంకేకు మద్దతు ఇచ్చే వైఖరితో కొనసాగుతున్నారు. కారాగారం నుంచి విడుదలైన శశికళ ఆమె నేతృత్వంలో ఓ వర్గాన్ని ఏర్పాటు చేసింది. గత జూన్ నెలలో ఈపీఎస్, ఓపీఎస్ మధ్య ఏక నాయకత్వ సమస్య ఏర్పడింది. దీంతో పార్టీ నుంచి వైదొలిగే వారి సంఖ్య మరింత పెరిగిందనే చెప్పాలి. కోయంబత్తూరు జిల్లా కౌండపాళెయం ఎమ్మెల్యే ఆరుకుట్టి డీఎంకేలో చేరారు. మైలాడుదురై జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు విజయబాలన్, మూర్తి తదితరులూ అదే బాటలో పయనించారు. పురపాలక ఎన్నికల్లో విజయం సాధించిన అనేక మంది అన్నాడీఎంకే నేతలు కూడా అధికార పార్టీలోకి వెళ్లటం గమనార్హం.
ఓపీఎస్, ఈపీఎస్, శశికళ, టీటీవీ దినకరన్
ఇప్పుడు కోవై సెల్వరాజ్...
ఈ నేపథ్యంలో ఓపీఎస్ మద్దతుదారుడిగా ఉన్న కోవై సెల్వరాజ్ ప్రస్తుతం డీఎంకేలో చేరారు. తర్వాత జరిగిన విలేకర్ల సమావేశంలో నాలుగేళ్ల అన్నాడీఎంకే పాలనకు మద్దతుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పారు. ఆ పార్టీ ప్రస్తుతం కంపెనీలా మారిందని ఆరోపించారు. ప్రముఖ నేతల నుంచి కార్యకర్తల వరకు పార్టీ నుంచి వైదొలుగుతుండటం అన్నాడీఎంకే బలహీనపడుతుండటాన్ని తెలియజేస్తుందని రాజకీయ విమర్శకులు చెబుతున్నారు. మరోవైపు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలో మెగా కూటమి ఏర్పాటు చేస్తామని పళనిస్వామి ప్రకటించారు. అందరూ కలిసుండే అన్నాడీఎంకేను భాజపా కోరుకుంటున్నట్లు ఓ పక్క వార్తలు వస్తున్నాయి. జయలలిత వర్ధంతి రోజున ఈపీఎస్, ఓపీఎస్, శశికళ, టీటీవీ దినకరన్‌లు వారి మద్దతుదారులతో వేర్వేరుగా వెళ్లి నివాళులర్పించారు. తద్వారా వారి వైఖరిని తెలిపారు. దీంతో కార్యకర్తలు తీవ్ర గందగోళానికి గురవుతున్నారు. ఈ నేతల తీరుతో అన్నాడీఎంకే బలహీనపడుతుందని కొంత మంది సీనియర్లు హెచ్చరిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vani Jairam: బీటౌన్ రాజకీయాలు చూడలేక మద్రాస్‌కు తిరిగి వచ్చేసిన వాణీ జయరాం
-
Crime News
Crime News: శ్రీకాకుళం జిల్లాలో కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం
-
Politics News
Yuvagalam: వైకాపా సైకోలకు జగన్ లైసెన్స్ : లోకేశ్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Malofeev: ఓ రష్యన్ సంపద.. ఉక్రెయిన్ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!
-
Sports News
IND vs AUS: వారు లేకపోవడం భారత్‌కు లోటే.. ఆసీస్ దిగ్గజం కీలక వ్యాఖ్యలు