logo

తప్పు ఎవరు చేసినా చర్యలు

కళాక్షేత్ర వ్యవహారంలో ఆరోపణలు రుజువైతే తప్పు ఏ స్థాయి వారు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శాసనసభలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ వెల్లడించారు.

Published : 01 Apr 2023 05:32 IST

‘కళాక్షేత్ర’ వ్యవహారంపై ముఖ్యమంత్రి

సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: కళాక్షేత్ర వ్యవహారంలో ఆరోపణలు రుజువైతే తప్పు ఏ స్థాయి వారు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శాసనసభలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ వెల్లడించారు. శుక్రవారం శాసనసభలో సభ్యులు ఎస్‌.ఎస్‌.బాలాజీ, వేల్‌మురుగన్‌, సెల్వపెరుంతగై, రామచంద్రన్‌ తదితరులు తిరువాన్మియూరులోని కళాక్షేత్ర ఫౌండేషన్‌ వ్యవహారంపై మాట్లాడారు. దానికి ముఖ్యమంత్రి స్పందిస్తూ... కేంద్ర సాంస్కృతికశాఖ కింద కొనసాగే కళాక్షేత్ర ఫౌండేషన్‌ వ్యవహారంలో జాతీయ మహిళా కమిషన్‌ మొదట సుమోటోగా ‘లైంగిక వేధింపులు’ అంటూ ట్వీట్‌ చేసిందన్నారు. చర్యలు చేపట్టాలని మార్చి 21న డీజీపీకి లేఖ రాసిందని తెలిపారు. తమ సంస్థలో లైంగిక ఫిర్యాదేదీ లేదంటూ డీజీపీకి కళాక్షేత్ర ఫౌండేషన్‌ సంచాలకులు వెల్లడించినట్టు తెలిపారు. ఓ ఆంగ్ల దినపత్రిక వార్త ఆధారంగా విచారించామని, తర్వాత దానిని పరిష్కరించామంటూ మార్చి 25న డీజీపీకి మహిళా కమిషన్‌ లేఖ రాసిందని పేర్కొన్నారు. 29న కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ కళాక్షేత్రలోని 210 మంది విద్యార్థినులను విచారించారని తెలిపారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు పోలీసుశాఖకు రాతపూర్వకమైన ఫిర్యాదేదీ అందలేదన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థినులు నిర్వహించిన ఆందోళన ఫలితంగా ఫౌండేషన్‌లోని కళాశాలకు సెలవు ప్రకటించి వసతి గృహాల్లోని విద్యార్థినులను వెళ్లిపోవాలని ఆదేశించారని తెలిపారు. ఈ వ్యవహారం తన దృష్టికి వచ్చిన వెంటనే జిల్లా కలెక్టరుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం ఆర్డీవో, తహసీల్దారు, పోలీస్‌ జాయింట్‌ కమిషనరు, డిప్యూటీ కమిషనరు, అధికారులను అక్కడకు పంపి దర్యాప్తు చేయించినట్టు తెలిపారు. విద్యార్థినులు, ఫౌండేషన్‌ యంత్రాంగంతో ఉన్నతాధికారులతో కూడిన బృందం చర్చిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థినుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టి ఓ మహిళా ఇన్‌స్పెక్టరు ఆధ్వర్యంలో సిబ్బందిని కేటాయించినట్లు వెల్లడించారు.

పాఠశాల విద్యాశాఖ ప్రకటనలు

* రాష్ట్రంలో 2,996 ప్రభుత్వ మాధ్యమిక, 540 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సుమారు రూ.175 కోట్ల వ్యయంతో హైటెక్‌ కంప్యూటరు ల్యాబ్‌ల ఏర్పాటు

* ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నైపుణ్య తరగతుల ఏర్పాటు పథకం రెండో విడత వచ్చే విద్యా సంవత్సరంలో రూ.150 కోట్ల వ్యయంతో 7,500 బడుల్లో అమలు
* మోడల్‌ స్కూల్స్‌ మరో 13 జిల్లాలకు విస్తరణ, అన్ని జిల్లాల్లోనూ ఒకటి ఉండేలా చర్యలు. ఈ పథకం కోసం రానున్న ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.250 కోట్ల కేటాయింపు.

* ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల పఠనాసక్తిని మరింత ప్రోత్సహించేలా సుమారు రూ.10 కోట్ల వ్యయంతో ‘మాపెరుం వాసిప్పు ఇయక్కం’ అమలు

* జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొనేందుకు అనువుగా శిక్షణ వసతుల కల్పన... ప్రతి జిల్లాకు 2 ‘స్పోర్ట్స్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌’ సుమారు రూ.9 కోట్ల వ్యయంతో ఏర్పాటు.

* ఇతర రాష్ట్రాల కార్మికుల పిల్లలు తమ మాతృభాష పాటు తమిళాన్ని నేర్చుకోవడానికి అనువుగా ‘తమిళ్‌ మొళి కర్పోం’ పథకం

* 6 - 8వ తరగతులలో 100 మందికిపైగా విద్యార్థులతో కొనసాగే మాధ్యమిక పాఠశాలల్లోని విద్యా ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకు ఒక్కో సబ్జెక్టుకు ఒకరు చొప్పున కనీసం ఐదుగురు పట్టభద్ర ఉపాధ్యాయుల నియామకం

* ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న ‘ఎణ్ణుం ఎళుత్తుం’ పథకాన్ని ఎయిడెడ్‌ బడుల్లో విస్తరించేందుకు రూ.8 కోట్ల వ్యయంతో బోధనా పరికరాల అందజేత

* ప్రభుత్వ మహోన్నత పాఠశాలల్లోని ఒకేషనల్‌ గ్రూపునకు రూ.10 కోట్ల వ్యయంతో ల్యాబ్‌లు

* చరిత్ర, కామర్స్‌ వంటి గ్రూపులులేని ప్రభుత్వ మహోన్నత పాఠశాలల్లో దశలవారీగా మూడో గ్రూపు ఏర్పాటు

* అన్ని బడుల్లో పీఈటీ ఉపాధ్యాయులు నియామకం

* 1 నుంచి 12వ తరగతి వరకు చదివే దృష్టిలోపం ఉన్న విద్యార్థులు ఉపయోగించేలా ‘యాక్సెసిబుల్‌ డిజిటల్‌ టెక్ట్‌బుక్స్‌’ రూపకల్పన

* పూర్తిగా చదవడం, రాయడం తెలియని జైళ్లలోని 1,249 మంది ఖైదీలకు ప్రాథమిక విద్య అందించేందుకు రూ.25 లక్షల వ్యయంతో ప్రత్యేక పథకం

* జాతీయం చేసిన, అరుదైన పుస్తకాలను భాషావేత్తల బృందం ద్వారా ఎంపిక చేసి ఆంగ్లంలోకి తర్జుమా

* స్వదేశీ, విదేశీ ప్రచురణ సంస్థలతో ఒప్పందంతో ప్రపంచ ప్రసిద్ధ సాహిత్యాలను తమిళంలోకి అనువాదం

* యువత సృజనాత్మకతను ప్రోత్సహించేలా ఐదు సాహిత్య వేడుకలతోపాటు రూ.30లక్షల వ్యయంతో యువజన సాహిత్య వేడుక

* కన్నిమారా పబ్లిక్‌ లైబ్రరీలో పోటీ పరీక్షల విద్యార్థులు, పిల్లలు లబ్ధిపొందేలా రూ.5 కోట్ల వ్యయంతో ప్రత్యేక విభాగాలు

* అన్ని జిల్లా కేంద్ర, ఫుల్‌టైం శాఖ గ్రంథాలయాలలో దశలవారీగా ఏడాదికి రూ.15 కోట్ల వ్యయంతో పునరుద్ధరణ... తొలి విడతగా 50 చోట్ల పనులు.

ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో...

* అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో రూ.150 కోట్ల వ్యయంతో ఎంటర్‌ప్రైజ్‌ రీసోర్స్‌ ప్లానింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఏర్పాటు

* 5 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పరిశ్రమల అవసరాలకు అనువుగా సాండ్‌విచ్‌ డిప్లొమో ప్రోగ్రామ్‌లు

* 7 ప్రభుత్వ ఇంజినీరింగ్‌, 31 పాలిటెక్నిక్‌ కళాశాలలకు జీబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ వసతి

* దివ్యాంగ విద్యార్థుల సంక్షేమం కోసం చెన్నైలోని సెంట్రల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో రూ.50లక్షల వ్యయంతో నైపుణ్య శిక్షణ కేంద్రం

* కోయంబత్తూరు ప్రభుత్వ, మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మొబిలిటి సెంటర్‌

* ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో కొత్తగా ప్రారంభించిన గ్రూపులకు అవసరమైన యంత్రాలు, పరికరాల కోసం రూ.10 కోట్లు.. విద్యార్థులు ఆదాయం సంపాదించేలా డిప్లొమో ప్రొగ్రాం.
* 5 చొప్పున ప్రభుత్వ ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు

* 7 మహిళా కళాశాలలకు రెండేసి చొప్పున, 72 కళాశాలలకు (కో-ఎడ్యుకేషన్‌) ఒకటి చొప్పున రూ.43లక్షల వ్యయంతో 86 నాప్కిన్‌ యంత్రాలు. మరో 168 ప్రభుత్వ ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాలలకు రూ.126 కోట్ల వ్యయంతో నాప్కిన్‌ దహన యంత్రాలు.

* బాడుగ భవనంలో కొనసాగుతున్న తిరువొత్తియూర్‌, సెంజి, వడలూరు, శ్రీపెరుంబుదూరు, నాట్రాంపళ్లి ప్రభుత్వ ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాలలకు రూ.13.71 కోట్ల చొప్పున వ్యయంతో కొత్త భవనాలు
* పెరుంతలైవర్‌ కామరాజర్‌ కళాశాల అభివృద్ధి పథకం కింద రూ.180 కోట్ల వ్యయంతో ప్రభుత్వ పాలిటెక్నిక్‌, ఆర్ట్స్‌ - సైన్స్‌ కళాశాలల్లో మౌలిక వసతులు

* అన్నా విశ్వవిద్యాలయం ఎంఐటీ ప్రాంగణంలోని డైనింగ్‌ హాల్‌ రూ.5.87 కోట్ల వ్యయంతో విస్తరణ... గిండి ఇంజినీరింగ్‌ ప్రాంగణంలోని వసతి గృహాల్లో రూ.1.08 కోట్లతో నెట్‌వర్కింగ్‌ వసతి... కోయంబత్తూరు ప్రాంతీయ కేంద్రంలో రూ.15.51 కోట్ల వ్యయంతో అకాడమిక్‌ బ్లాక్‌ నిర్మాణం

* మదురై కామరాజర్‌ విశ్వవిద్యాలయంలో కొత్తగా బీఎస్సీ కంప్యూటరు సైన్స్‌లో డేటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, బీకాంలో బ్లాక్‌ ఛైన్‌ టెక్నాలజీ, ఎమ్మెస్సీలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులు... రూ.3.50 కోట్ల వ్యయంతో మానవవనరుల అభివృద్ధి శిక్షణ ఆడిటోరియం

* మద్రాసు విశ్వవిద్యాలయంలో సెంటినరీ భవనం పునరుద్ధరణ. చేపాక్‌ ప్రాంగణంలో మహిళా వసతి గృహం ఏర్పాటు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని