logo

చేజారిన సెంటిమెంట్‌ స్థానం

దిండుక్కల్‌ నియోజకవర్గంలో అన్నాడీఎంకే మాజీ మంత్రులు ఇద్దరు ఉన్నా.. వారిని పక్కన పెట్టేసి ఎస్‌డీపీఐకు టికెట్‌ కేటాయించడంతో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Published : 28 Mar 2024 00:20 IST

దిండుక్కల్‌ సీటు ఎస్‌డీపీఐకి కేటాయింపుపై అన్నాడీఎంకే శ్రేణుల్లో అసంతృప్తి
ఇద్దరు మాజీ మంత్రులున్నా పట్టించుకోని అధిష్ఠానం

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: దిండుక్కల్‌ నియోజకవర్గంలో అన్నాడీఎంకే మాజీ మంత్రులు ఇద్దరు ఉన్నా.. వారిని పక్కన పెట్టేసి ఎస్‌డీపీఐకు టికెట్‌ కేటాయించడంతో కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ పార్టీ ప్రారంభించిన మొదట్లో దిండుక్కల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. ఆ ఎన్నికలోనే స్వతంత్ర గుర్తుగా రెండాకుల చిహ్నం దక్కింది. ఆపై పార్టీ శాశ్వత గుర్తుగా మారిపోయింది. అలా ప్రతి లోక్‌సభ ఎన్నికల్లో దిండుక్కల్‌ నియోజకవర్గాన్ని సెంటిమెంట్‌గా భావించి పోటీ పార్టీ చేస్తోంది. మాజీమంత్రి దిండుక్కల్‌ శ్రీనివాసన్‌ దిండుక్కల్‌ ఇక్కడి నుంచి నాలుగుసార్లు పోటీ చేసి గెలిచారు. అనంతరం సెంటిమెంట్‌ను పక్కన పెట్టేశారు. ఎడప్పాడి పళనిసామి నేతృత్వంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకేకు ఈ స్థానం కేటాయించింది. మాజీమంత్రులు దిండుక్కల్‌ శ్రీనివాసన్‌, నత్తం విశ్వనాథన్‌ మధ్య ఏర్పడిన గొడవలే కారణమని తెలిసింది. సెంటిమెంట్‌ నియోజకవర్గం చేజారడంతో కార్యకర్తలు నిరాశచెందారు. ఆ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థ్థి 5 లక్షలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించారు.

కార్యకర్తల్లో అసంతృప్తి.. ఈసారి నియోజకవర్గాన్ని కూటమి పార్టీలకు ఇవ్వకుండా అన్నాడీఎంకే నేరుగా బరిలోకి దిగుతుందని నిర్వాహకులు, కార్యకర్తలు భావించారు. అనూహ్యంగా కూటమిలోని ఎస్‌డీపీఐ పార్టీకి ఇవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారసులను బరిలో దింపాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి అడిగినా మాజీ మంత్రులు వెనుకాడడంతో కూటమి పార్టీలకు కేటాయించినట్లు సమాచారం. ఈ స్థానంలో అన్నాడీఎంకేకు పూర్వ వైభవం రావాలంటే అధికంగా శ్రమించాల్సిందేనని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఎస్‌డీపీఐ పార్టీ తరఫున  నెల్లై ముహ్మద్‌ ముబారక్‌ పోటీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని