logo

రాష్ట్రంలో అగ్రనేతల సుడిగాలి ప్రచారం

నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. ఎన్నికల కమిషన్‌ నుంచి అభ్యర్థుల అధికారిక ప్రకటనే మిగిలింది. వాటిని పట్టించుకోకుండా ముందే ప్రచారాన్ని మొదలుపెట్టాయి కూటమి పార్టీలు. తమ అభ్యర్థుల విజయం కోసం అగ్రనేతలు ప్రచారంలో దూసుకెళుతున్నారు.

Published : 28 Mar 2024 00:23 IST

ఈనాడు-చెన్నై

నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. ఎన్నికల కమిషన్‌ నుంచి అభ్యర్థుల అధికారిక ప్రకటనే మిగిలింది. వాటిని పట్టించుకోకుండా ముందే ప్రచారాన్ని మొదలుపెట్టాయి కూటమి పార్టీలు. తమ అభ్యర్థుల విజయం కోసం అగ్రనేతలు ప్రచారంలో దూసుకెళుతున్నారు. విపక్షాలపై పదునైన వ్యాఖ్యలతో దాడులు చేస్తూనే తమ కూటమికి ఓటేయడం ఎంత ముఖ్యమో ఓటర్లకు వివరిస్తున్నారు.

నామ్‌ తమిళర్‌ కట్చి(ఎన్టీకే) ఎప్పటిలా ఒంటరిగా బరిలో ఉండగా.. అన్నాడీఎంకే వేరైన తర్వాత ఎన్డీయే రెండు కూటములుగా చీలింది. ఇండియా కూటమితో కలిపి చతుర్ముఖ పోటీ రాష్ట్రంలో నడుస్తోంది. ఎన్టీకే ఎంతవరకు ఓటర్లను ప్రభావం చూపుతుందనేది అటుంచితే.. ప్రధాన కూటములు అన్నిచోట్లా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. విమర్శనాస్త్రాలు సంధించడంతో పాటు వాడివేడి ఆరోపణలు చేస్తున్నాయి.


స్టాలిన్‌.. వాడి వేడి

ప్రధానంగా భాజపాకు ఏ ఒక్కస్థానం రాకుండా చేయాలనే లక్ష్యంతో డీఎంకే ప్రచారం మొదలుపెట్టింది. విలువైన ఓటును మోదీని గద్దె దించేలా, ఆయనకు వ్యతిరేకంగా ‘మానవత్వమున్న పీఎం’ను ఎన్నుకునేందుకు వినియోగించాలని పార్టీ నేతలు పిలుపునిస్తున్నారు. తమిళనాడును ద్వేషించేవారిని కాక రాష్ట్రాన్ని ప్రేమించే వ్యక్తిని ప్రధానిని చేయాలని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ఓటర్లను కోరుతున్నారు. భాజపాను ప్రజల మధ్య చిచ్చుపెట్టే పార్టీగా ఆయన పేర్కొంటున్నారు. మళ్లీ ఆ పార్టీని అధికారంలోకి రాకుండా చేయాలని ఓటర్లను కోరుతున్నారు. మళ్లీ వస్తే జమ్ము కశ్మీరులాగా తమిళనాడును తయారు చేస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. కేంద్రం తమిళనాడుకు చేసిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ తాను పాల్గొంటున్న సభల్లో వివరిస్తున్నారు. వరదలొచ్చి తమిళనాడు విలవిల్లాడుతున్నప్పుడు కూడా నిధులిచ్చి జాలి చూపలేదని ఆరోపిస్తున్నారు. డీఎంకే, రాష్ట్రంపై భాజపా కక్ష కట్టినట్లు చెబుతున్నారు. గవర్నర్‌ రవి ద్వారా చాలా బిల్లులు ఆపించారని, వాటి కోసం కోర్టులకెళ్లాల్సి వస్తోందని ఉదహరిస్తున్నారు. భాజపాకు అన్నాడీఎంకే మద్దతు కొనసాగుతోందని, అందరూ గుర్తించాలని చెబుతున్నారు. డీఎంకే పథకాల్ని వివరిస్తూ రాబోయే ఐదేళ్ల ప్రణాళికల్ని వివరిస్తున్నారు. సుమారు 20రోజుల ప్రచారాన్ని పెట్టుకుని సభలతో పాటు నేరుగా ఓటర్లను కలిసి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.


ఎడప్పాడి.. తగ్గడంలేదు

భాజపా, డీఎంకే మధ్య అక్రమ పొత్తు ఉందంటూ అన్నాడీఎంకే ప్రచారం చేస్తోంది. పలుమార్లు మోదీని స్టాలిన్‌, ఉదయనిధి కలుసుకున్నారని చూపుతున్నారు. కేంద్రం అండతోనే పాలన కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు నిజమైన ప్రత్యర్థి డీఎంకేనేనని, ప్రజలు తమ పక్షాన నిలవాలని అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రంలో మత్తుపదార్థాల సరఫరా పెరిగిందని, ఇందుకు బాధ్యత డీఎంకేనే వహించాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తాను వెళ్లిచోటల్లా చెబుతున్నారు. మరోవైపు స్టాలిన్‌ ప్రభుత్వ హయాంలో వైఫల్యాల్ని ఎండగడుతున్నారు. 38 మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి న్యాయం చేసే ప్రాజెక్టులు తేలేకపోయారని విమర్శిస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రానికి మేలు జరిగిందని చెబుతున్నారు. ప్రజల్లో విశ్వాసం పెంచడంలో భాగంగా అభివృద్ధిపై ముఖ్యమంత్రి స్టాలిన్‌తో నేరుగా ప్రజల మధ్య చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. మేకెదాటు డ్యామ్‌ నిర్మాణానికి కర్ణాటక సాహసిస్తున్నప్పుడు రైతుల పక్షాన డీఎంకేలేదని ఆరోపిస్తూ ఓటర్లకు గుర్తుచేస్తున్నారు. ఇక భాజపాతో కలవడమంటూ ఉండదని చెబుతూనే.. 2026 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడంతో పాటు స్థానిక ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే పూర్వవైభవం వచ్చేలా ప్రజలు సహకరించాలని అభ్యర్థిస్తున్నారు. స్టాలిన్‌కు పోటీగా సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు.


అన్నామలై.. రంకెలు

భాజపా అధ్యక్షుడు అన్నామలై ముందుగా కోయంబత్తూరుపై ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడే నామినేషన్‌ వేయడంతో.. తన నియోజకవర్గం నుంచి మార్పు చూపిస్తామని అంటున్నారు. మోదీకి, కోయంబత్తూరు ప్రజలకు మధ్య తాను హాట్‌లైన్‌గా ఉండి అభివృద్ధి చేస్తానని అంటున్నారు. చైనాలాంటి అభివృద్ధి కనిపించాలన్నా, యూరప్‌లాంటి ప్రజాప్రతినిధులు తయారవ్వాలన్నా మోదీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదంటూ వివరిస్తున్నారు. డబ్బులు పంచకుండా ఎన్నికల్లో గెలవడమేంటో చూపిస్తానని సవాలు విసురుతున్నారు. మరోవైపు పార్టీపరంగా తన వాదాన్ని సభల్లో నేరుగా, మరోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా వినిపిస్తున్నారు. ప్రజల్ని తమవైపు తిప్పుకోవడంలో భాగంగా ఎంజీఆర్‌, జయలలితను ఆదర్శంగా తీసుకున్నామనే రీతిలో ప్రచారం చేస్తున్నారు. గతంలో ఎన్డీయే వైపు ఉన్న ఓట్లు అన్నాడీఎంకే వేరుకుంపటి ద్వారా చీలకుండా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. అన్నాడీఎంకేను మాత్రం విశ్వసించలేమని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఎన్నికల్లోపు ఎప్పుడైనా వారు డీఎంకేతో ఏకమయ్యేవారేనంటూ ప్రచారం చేస్తున్నారు. ఈసారి భాజపాను విశ్వసించాలని పిలుపునిస్తూనే.. డీఎంకే అవినీతి పాలనను అంతమొందించాలని కోరుతున్నారు.


సీమాన్‌.. తనదైన శైలిలో

మాటలతో ఆకట్టుకోవడంలో ఎన్టీకే అధినేత సీమాన్‌ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొంటున్నారు. తమ అభ్యర్థుల్ని అన్ని స్థానాల్లో పోటీకి పెడుతున్నానని చెబుతూనే.. వారంతా విప్లవకారులేనని అంటున్నారు. ప్రజల్ని తమవైపు తిప్పుకొనే ఏకైక బలమైన పార్టీ తమదేనంటూ, ఒంటరిగా ఇటు లోక్‌సభ, అటు అసెంబ్లీలో పోటీచేసే సత్తా తమకుందని నిరూపిస్తామని చెబుతున్నారు. ప్రజలు తమను ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. నిజాయితీ తమ ఆస్తి అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీ ఎవరికీ తలొగ్గదని చెబుతూనే.. ఎన్నికల బాండ్లకు సైతం తాము దూరంగా ఉన్నామంటూ వివరిస్తున్నారు. వజ్రాయుధంగా ఉన్న ఓటు వినియోగించి ప్రజలు మార్పును చూపించాలని, చరిత్ర తిరగరాసేలా చేయాలని అభ్యర్థిస్తున్నారు. అందరికన్నా ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారం ప్రారంభించిన పార్టీ తమదేనంటూ జనాల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ తెస్తున్న జాతీయ విద్యా విధానాన్ని స్టాలిన్‌ వ్యతిరేకించారని, ఇప్పుడు మోడల్‌ స్కూళ్ల ద్వారా దాన్నే మెల్లగా అమలుచేస్తూ విద్యార్థుల్ని మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల బాండ్ల విషయంలో భాజపానూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని