logo

అంతు చిక్కని ఓటరు నాడి!

ఎన్నికల ఫలితాలు దేశమంతా ఒకలా ఉంటే.. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఓ తరహా తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పు ఇక్కడే కనిపిస్తుంటుంది.

Updated : 29 Mar 2024 04:41 IST

గత ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు
ఈనాడు-చెన్నై

ఎన్నికల ఫలితాలు దేశమంతా ఒకలా ఉంటే.. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఓ తరహా తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పు ఇక్కడే కనిపిస్తుంటుంది. ఆశ్చర్యంగా.. కొన్ని నెలల క్రితం ఓటేసినవారు ఆ తర్వాత వచ్చే మరో పోటీల్లో భిన్నంగా ఫలితాల్ని చూపించడం ఒక్క తమిళనాడు ప్రజలకే చెల్లింది.

లోక్‌సభ ఎన్నికలొస్తే.. దేశీయ ప్రాధాన్యాలు, అసెంబ్లీ పోటీల్లో రాష్ట్ర ప్రాధాన్యాలకు విలువిస్తూ తమిళనాడు ఓటరు తనదైన శైలి చూపిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో తొలినాళ్లలో కాంగ్రెస్‌ ప్రభావం ఎక్కువగా ఉండగా.. ఆ తర్వాత పార్టీలు పుట్టుకొచ్చి డీఎంకే, అన్నాడీఎంకే హవా బాగా పెరుగుతూ వచ్చింది. 1967 ఎన్నికల నుంచి మధ్యలో 4 ఎన్నికలు మినహా రాష్ట్ర పార్టీలే అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికల్లో పైచేయి సాధిస్తూ వస్తున్నాయి. ఇప్పటి వరకు అన్నాడీఎంకే 7సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగా, డీఎంకే 6సార్లు పాలనాపగ్గాలు చేపట్టింది. ఒక ఎన్నికల్లో ఉన్న ఫలితం మరోసారి ఉండట్లేదు. జనాలు లోతుగా ఆలోచిస్తూ ప్రభుత్వాల్ని కూల్చడంలో, ఇతర పార్టీలకు అధికారమివ్వడంలో ప్రత్యేక శైలితో ముందుకెళ్తున్నారు.

కొద్దినెలల్లో.. ఎంత తేడా

1989 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌, అన్నాడీఎంకే జట్టుకట్టాయి. ప్రత్యర్థులుగా నేషనల్‌ఫ్రంట్ రూపంలో డీఎంకే, సీపీఐ, జనతాదళ్‌ పార్టీలున్నాయి. ఆ ఏడాది జనవరిలో అసెంబ్లీ, నవంబరులో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఉన్న నేషనల్‌ కూటమి ఫ్రంట్ 150 సీట్లు దక్కించుకుంది, అన్నాడీఎంకే కూటమి 27 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో నేషనల్‌ ఫ్రంట్ గత ఎన్నికలతో పోల్చితే 125 అసెంబ్లీ స్థానాల్ని అదనంగా గెలిచింది. కొద్దినెలలకే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి విరుద్ధ ఫలితాలొచ్చాయి. అన్నాడీఎంకే, కాంగ్రెస్‌ కూటమి 38 సీట్లు గెలవగా, డీఎంకే కూటమి కేవలం ఒక స్థానంతో సరిపెట్టుకుంది. డీఎంకే 31 స్థానాల్లో పోటీ చేసినా ఒక్కటీ గెలవలేకపోయింది. ఈ ఎన్నికలు జరిగే సమయంలో కాంగ్రెస్‌లో అవినీతి దేశవ్యాప్తంగా కుదిపేసింది. తమిళనాడు వాసులు మాత్రం స్థానికాంశాలకే పెద్దపీట వేసుకున్నారు.

ప్రభంజనమే..

1991 మే, జూన్‌లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కూడా అందరినీ ఆశ్చర్యపరిచాయి. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అన్నాడీఎంకే, కాంగ్రెస్‌ కూటమి ఈ ఎన్నికల్లో మాత్రం ఏకంగా 225 సీట్లతో ప్రభంజనం సృష్టించింది. 150 స్థానాల్లో అంతకుముందున్న డీఎంకే, నేషనల్‌ఫ్రంట్ కేవలం 7 స్థానాలతో సరిపెట్టుకుంది. డీఎంకే కేవలం 2 స్థానాల్లో పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే ఫలితం కనిపించింది. అంతకుముందు 38స్థానాల్లో గెలిచిన అన్నాడీఎంకే, కాంగ్రెస్‌ కూటమి మొత్తంగా 39 స్థానాల్లో గెలుపొందింది. డీఎంకే, నేషనల్‌ ఫ్రంట్కు ఒక్క సీటూ రాలేదు. ఇక్కడ కీలకంగా ఆలోచించాల్సింది.. 1991 ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాజీవ్‌గాంధీ మే 21న శ్రీపెరుంబుదూరు సభలో మానవబాంబుకు బలయ్యారు. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే, కాంగ్రెస్‌ జోడి తిరుగులేని విజయాలు నమోదు చేసుకుంది.

చరిత్రలో మైలురాయి..

1996 ఎన్నికలు తమిళనాడులో చరిత్రాత్మకమని చెప్పాలి. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దఎత్తున అవినీతి ఆరోపణలొచ్చాయి. ప్రధాని పి.వి.నరసింహారావు ఉన్నప్పుడు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడాన్ని చాలామంది ఇష్టపడలేదు. జి.కె.మూపనార్‌ బయటికొచ్చి తమిళమానిల కాంగ్రెస్‌(టీఎంసీ) స్థాపించారు. టీఎంసీ డీఎంకేతో పొత్తుపెట్టుకుంది. ఈ నేపథ్యంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 221 స్థానాలతో భారీ విజయాన్ని మూటగట్టుకుంది. డీఎంకే 173, టీఎంసీ 39 గెలిచింది. అన్నాడీఎంకే కూటమి 4 స్థానాలకు పడిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ తిరుగులేని ప్రభావాన్ని చూపింది. ఈఎంసీ, డీఎంకే, సీపీఐ యునైటెడ్‌ కూటమి 39 స్థానాల్లో క్లీన్‌ స్వీప్‌ చేసింది. టీఎంసీ 20, డీఎంకే 17, సీపీఐ 2 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. అన్నాడీఎంకే భారీ పతనాన్ని చవిచూసింది.

విచిత్ర పరిస్థితి..

  • జాతీయ ప్రాధాన్యతలు లోక్‌సభ ఎన్నికల్లో, స్థానిక ప్రాధాన్యతలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావితం చూపుతూ వచ్చాయి. కేంద్రంలో వాజ్‌పేయీ ప్రభుత్వం పడిపోవడంతో 1999లోనే మధ్యంతర ఎన్నికలొచ్చాయి. ఇక్కడినుంచి డీఎంకే హవా లోక్‌సభ ఎన్నికల్లో కొనసాగుతూ వచ్చింది.
  • 1999, 2004, 2009 ఎన్నికల్లో తిరుగులేని విజయాల్ని నమోదు చేసుకుంది. విచిత్రం ఏమిటంటే.. 1999లో ఎన్డీయేతో జతకట్టిన డీఎంకే 26 స్థానాల్లో గెలిచింది. 2004 ఎన్నికలు వచ్చేసరికి ఎన్డీయేతో డీఎంకే తెగదెంపులు చేసుకుంది. ఇక్కడి నుంచి భాజపా అంటేనే ఈ పార్టీకి పడనంతగా మారింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జతకట్టి 39 స్థానాల్లో, 2009లో 27 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది.
  • అసెంబ్లీ వరకు మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. 1999లో లోక్‌సభలో డీఎంకేది పైచేయిగా ఉంటే 2001 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేది అయ్యింది. 2004 లోక్‌సభతో పాటు 2006 అసెంబ్లీ పోటీలో డీఎంకేకు తిరుగులేకపోయింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేనే ముందున్నా.. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది. అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
  • డీఎంకే వదిలేసిన ఎన్డీయేలోని భాజపాతో జతకట్టిన అన్నాడీఎంకే మెల్లగా పుంజుకుంటూ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 37 స్థానాల్లో విజయఢంకా మోగించింది. 2016లో మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.
  • రాష్ట్ర ప్రజల విలక్షణ ఓటింగ్‌ ఆ తర్వాత కూడా ప్రత్యక్షంగా కనిపించింది. అప్పటివరకు అమితంగా అభిమానించిన అన్నాడీఎంకేను ప్రజలు దూరం పెట్టారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో వచ్చిన వర్గవిభేదాలు ఇందుకు కారణంగా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఎం.కె.స్టాలిన్‌ నేతృత్వంలో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి 38 స్థానాల్లో గెలుపొందగా, ఎడప్పాడి పళనిసామి నేతృత్వంలోని అన్నాడీఎంకే, ఎన్డీయే కూటమి కేవలం ఒక సీటుకే పరిమితమైంది.

అనూహ్యంగా విజయకేతనం

కాంగ్రెస్‌లో వచ్చిన అంతర్గతపోరుతో మూడేళ్ల ముందుగానే 1998లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. తమిళనాడులో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగే సంస్కృతికి తెరపడింది. యునైటెడ్‌ ఫ్రంట్ నుంచి వేరుపడిన కాంగ్రెస్‌ వేరుగా కూటమి పెట్టుకుంది. వారితో దూరమైన అన్నాడీఎంకే ఎన్డీయే కూటమిలో చేరింది. దీంతో తమిళనాడు ఫలితాలు మరోసారి భిన్నంగా వచ్చాయి. డీఎంకే ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ 1998 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం జయలలిత నేతృత్వంలో ఎన్డీయే 30 స్థానాల్లో విజయం సాధించింది. కేంద్రంలో వాజ్‌పేయీ ప్రధాని అయ్యేందుకు ఈ సీట్లు అత్యంత కీలకమయ్యాయి. కరుణానిధి నేతృత్వంలోని యునైటెడ్‌ ఫ్రంట్ 9 స్థానాలకు దిగజారింది. 1996 ఎన్నికల్లో భారీ పతనాన్ని చవిచూసిన అన్నాడీఎంకే కూటమిని ప్రజలు పైకెత్తుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని