logo

అమ్మ ప్రోత్సాహంతో అత్యుత్తమ విజయం

ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించింది ఆ యువతి. తల్లి ప్రోత్సాహం అండగా నిలిచింది. ప్రజా గ్రంథాలయం తోడ్పాటు అందించింది.

Published : 05 May 2024 07:17 IST

సివిల్స్‌లో రాణించిన బీడీ కార్మికురాలి కుమార్తె

ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించింది ఆ యువతి. తల్లి ప్రోత్సాహం అండగా నిలిచింది. ప్రజా గ్రంథాలయం తోడ్పాటు అందించింది. మూడో ప్రయత్నంలో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ర్యాంకు సాధించింది తెన్‌కాశి జిల్లాకు చెందిన ఇన్బ.

ప్యారిస్‌, న్యూస్‌టుడే

సెంగోట్టై విశ్వనాథపురానికి చెందిన శ్రీనివాసన్‌ విశ్రాంత కండక్టర్‌. ఆయన భార్య స్టెల్లా బీడీలు చుట్టే కార్మికురాలు. వారికి బాలమురళి, ఇన్బ(26) అనే ఇద్దరు పిల్లలున్నారు. బాలమురళి సౌదీ అరేబియాలో గ్యాస్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఇన్బ కోయంబత్తూరులోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. ఐఏఎస్‌ పరీక్ష కోసం చెన్నైలోని ఓ ప్రైవేటు అకాడమీలో శిక్షణ పొందింది. ఆ తర్వాత తన ప్రయత్నాలతో ఇటీవల విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో ఆఖిలభారత స్థాయిలో 851వ ర్యాంకు సాధించింది.

మూడోసారి ర్యాంకు..

ఇన్బ మాట్లాడుతూ... సెంగోట్టై ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాను. 11, 12 తరగతులు ప్రైవేటు పాఠశాలలో, కోయంబత్తూరులోని సీఐటీ కళాశాలలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాను. అనంతరం ఐఏఎస్‌ కోసం చెన్నైలోని ఓ ప్రైవేటు అకాడమీలో ఏడాది శిక్షణ తీసుకున్నాను. కరోనా సమయం కావడంతో ఆన్‌లైన్‌ తరగతుల్లో చదువుకున్నాను. అమ్మ స్టెల్లా బీడీలు చుట్టడంతోపాటు పువ్వులు కూడా కట్టి పక్కనే ఉండే దుకాణాలకు విక్రయిస్తుంది. అలా అదనంగా కొంత ఆదాయం సంపాదించేది. అమ్మ ప్రోత్సాహం, నమ్మకమే నన్ను పరీక్షలో ఉత్తీర్ణత సాధించేలా చేసింది. రెండుసార్లు రాణించలేకపోయినా మూడోసారి పట్టుదలతో చదివి ర్యాంకు పొందాను. రాష్ట్ర ప్రభుత్వ నాన్‌ ముదలవన్‌ పథకం, సెంగోట్టైలోని ప్రభుత్వ గ్రంథాలయం ఎంతో సాయపడింది. అక్కడున్న ఉచిత ఇంటర్నెట్‌ ద్వారా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యాను. ఆ తర్వాత సివిల్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్నాను. అక్కడ నాన్‌ ముదలవన్‌ పథకం కింద రూ.25 వేలు ఆర్థికసాయం అందింది. ఆ నగదు పోటీ పరీక్షలో పుస్తకాలు కొనేందుకు ఎంతగానే సాయపడిందని తెలిపారు. ఇన్బను జిల్లా కలెక్టరు కమల్‌ కిషోర్‌, ఎమ్మెల్యే కృష్ణమురళి అభినందించారు. ప్రజలు ఆమె పోస్టర్లు ఊరంతా అతికించి శుభాకాంక్షలు చెబుతున్నారు.

ప్రభుత్వ గ్రంథాలయంలో చదివి..

ప్రైవేటు అకాడమీలో శిక్షణ అనంతరం ఇన్బ సెంగోట్టై వచ్చేసింది. అక్కడి ప్రజా గ్రంథాలయంలో సివిల్స్‌కు సిద్ధమైంది. సుమారు రెండేళ్లు నిరంతరం ఇక్కడికొచ్చి పుస్తకాలతో కుస్తీ పట్టింది. ఆమె గ్రంథాలయమే ఇల్లులా మారింది. ఆన్‌లైన్‌ ద్వారా సమాచారం సేకరించుకుని ర్యాంకు సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు