logo

ముగిసిన జయకుమార్‌ అంత్యక్రియలు

అనుమానాస్పద రీతిలో మృతి చెందిన కాంగ్రెస్‌ నెల్లై తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్‌ ధనసింగ్‌ అంత్యక్రియలు సొంతూరు కరైసుత్తుపుదూరులో ఆదివారం జరిగాయి.

Updated : 06 May 2024 06:51 IST

మరో రెండు లేఖలు లభ్యం
కొనసాగుతున్న పోలీసు దర్యాప్తు

అంజలి ఘటిస్తున్న సెల్వపెరుంతగై తదితరులు

సైదాపేట, న్యూస్‌టుడే: అనుమానాస్పద రీతిలో మృతి చెందిన కాంగ్రెస్‌ నెల్లై తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్‌ ధనసింగ్‌ అంత్యక్రియలు సొంతూరు కరైసుత్తుపుదూరులో ఆదివారం జరిగాయి. జయకుమార్‌ గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోగా శనివారం సగం కాలిన స్థితిలో మృతదేహం లభించింది. తిరునెల్వేలి ప్రభుత్వాస్పత్రిలో శవపరీక్ష చేసి ఆదివారం ఉదయం కుమారుడికి అప్పగించారు. కుటుంబీకులు, గ్రామస్థులు నివాళులర్పించన తర్వాత సీఎస్‌ఐ క్రైస్తవ దేవాలయంలో ఆరాధన అనంతరం ఖననం చేశారు. అంతిమ సంస్కార కార్యక్రమంలో శాసనసభాపతి అప్పావు, టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై, కన్నియాకుమరి ఎంపీ విజయ్‌వసంత్‌, నెల్లై ఎంపీ జ్ఞానద్రవ్యం తదితర పలువురు పాల్గొని అంజలి ఘటించారు.

పార్టీ పరంగా విచారణ.. జయకుమార్‌ మంచి వ్యక్తి అని సెల్వపెరుంతగై తెలిపారు. ఆయన మృతి బాధాకరమన్నారు. ఆయన మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉండేవారు ఏ పార్టీకి చెందినవారైనా, ఎంత ప్రముఖులైనా తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పార్టీ పరంగా కూడా విచారణ జరిపి అధిష్ఠానానికి నివేదిక పంపుతామని చెప్పారు. పోలీసు దర్యాప్తు కొనసాగుతున్నందున వివరాలు బయటకు చెప్పలేమన్నారు.

పార్టీ కార్యాలయంలో లేఖ.. జయకుమార్‌ కనిపించకుండా పోయినప్పుడు కుటుంబీకులు అనేకచోట్ల వెతికారు. అప్పుడు పార్టీ కార్యాలయంలో లేఖ లభించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 30నే అది రాసినట్లు సమాచారం. పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తల నుంచి హత్యా బెదిరింపులు వస్తున్నాయని, ఒకవేళ తాను మృతి చెందితే వారే కారణమని ఆ లేఖలో కొందరి పేర్లు ప్రస్తావించినట్లు సమాచారం. జయకుమార్‌ అల్లుడు, కుటుంబ సభ్యులకు రాసిన రెండు లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పార్టీ, వృత్తి పరంగా పలువురికి డబ్బులు ఇచ్చిన వివరాలు అందులో ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులకు రాసిన లేఖలో ఎవరూ ప్రతీకారం తీర్చుకోవద్దని, చట్టం దాని బాధ్యత నిర్వర్తిస్తుందని రాసినట్లు తెలిసింది.

ఫోరెన్సిక్‌ బృందం పరిశీలన.. జయకుమార్‌ మృతదేహం లభించిన స్థలంలో ఎస్పీ సిలంబరసన్‌ ఆదివారం రెండోరోజుగా పరిశీలించారు. ఫోరెన్సిక్‌ నిపుణురాలు ఆనంది నేతృత్వంలోని బృందం ఆధారాలు సేకరించింది. పోలీసులు అక్కడే మకాం వేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు