logo

సెబ్‌ అక్రమాలపై ఆగ్రహం

నగరంలోని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సర్కిల్‌-3 కార్యాలయంలోని అక్రమాలపై ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు ఉక్కుపాదం మోపారు. వివరాల్లోకి వెళితే.. ఈ కార్యాలయం పరిధిలో ఇద్దరు కీలక నిందితుల్ని అధికారులు

Published : 06 Dec 2021 02:48 IST

 సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

 శాఖాపరమైన విచారణకు రంగం సిద్ధం

ఈనాడు, విశాఖపట్నం: నగరంలోని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సర్కిల్‌-3 కార్యాలయంలోని అక్రమాలపై ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు ఉక్కుపాదం మోపారు. వివరాల్లోకి వెళితే.. ఈ కార్యాలయం పరిధిలో ఇద్దరు కీలక నిందితుల్ని అధికారులు చాలా కష్టపడి అదుపులోకి తీసుకున్నారు. విశాఖ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయిని తరలించడంలో వారు కీలకపాత్ర పోషిస్తున్నారని కూడా ప్రాథమికంగా తెలిసింది. ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించారు. ఒక నిందితుడు తమిళనాడు రాష్ట్రానికి, మరో నిందితుడు కేరళ రాష్ట్రానికి చెందినవారు. వారిని విచారించి ఉంటే గంజాయి స్మగ్లింగ్‌కు సంబంధించిన కీలక వివరాలు తెలిసేవి. అలాంటి కీలక నిందితులు దొరికినప్పుడు అవసరమైతే అదనపు భద్రతను కూడా ఏర్పాటుచేయాలి. లేదంటే సమీప పోలీసుస్టేషన్లో అప్పగించి విచారణ చేయాల్సిన సమయంలో సెబ్‌ కార్యాలయానికి తీసుకురావాలి. అలాంటి చర్యలేవీ తీసుకోకుండా నిందితులను ఒక గదిలో ఉంచి తాళం వేశారు. ఇద్దరు సెబ్‌ కానిస్టేబుళ్లకు నిందితుల రక్షణ బాధ్యతలు అప్పగించారు. వారు తాళం వేసిన గది ముందు కాపలా కాశారు. నిందితులు గదిలోని కిటీకీలకు ఉన్న గ్రిల్‌ను జాగ్రత్తగా తొలగించి.... ఆ కిటికీ లోంచి కిందికి దూకేశారు. వారిని బంధించిన గది మొదటి అంతస్తులో ఉన్నప్పటికీ వారు జాగ్రత్తగా దూకి పారిపోయారు. సమారు 15 రోజుల కిందట తెల్లవారుజాము సమయంలో ఈ సంఘటన జరిగింది.

పారిపోవడంపై పలు అనుమానాలు

గంజాయి కేసు కీలక నిందితులు పారిపోవడంపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కిటికీ గ్రిల్స్‌ విప్పదీయడానికి నిందితుడికి స్క్రూడ్రైవర్‌ లాంటి పరికరం దొరికినట్లు సమాచారం. అది ఎలా దొరికిందన్న విషయం చర్చనీయాంశంగా మారింది. నిందితులు పారిపోవడంపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.  విచారించిన పోలీసులకు అక్కడి సిబ్బంది పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఉన్నతాధికారుల్లో మరిన్ని అనుమానాలు తలెత్తాయి. ఏదేమైనా చేతికందిన కీలక నిందితులు పారిపోయిన సంఘటనలను స్టేషన్‌ అధికారుల ఘోర వైఫల్యంగా ఉన్నతాధికారులు పరిగణించారు. పర్యవేక్షక బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడంలో విఫలమైన సీఐ వెంకటరావు, ఆరోజు రాత్రి భద్రత విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు అప్పలనాయుడు, మరో మహిళ కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. సీఐ వెంకటరావు, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

బాధ్యతలు చేపట్టిన   నూతన సీఐ

గంజాయి కేసులో నిందితులు పారిపోవడానికి దారితీసిన పరిస్థితులపై స్పష్టమైన కారణాలు రాకపోవడంపైనా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శాఖాపరంగా పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కూడా నిర్ణయించారు. త్వరలో ఉన్నతాధికారుల విచారణ ప్రారంభం కానుంది. వెంకట్రావు స్థానంలో నూతన సీఐగా నియమితులైన జగన్నాధరాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని