logo

పేట వైకాపాలో రోజుకో వికెట్‌

వైకాపా నుంచి రోజుకో వికెట్‌ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు.

Published : 27 Apr 2024 04:23 IST

వలసలతో నేతల దిగ్భ్రాంతి

పాయకరావుపేట, న్యూస్‌టుడే: వైకాపా నుంచి రోజుకో వికెట్‌ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు. నియోజకవర్గంలో లోకేశ్‌ పాదయాత్ర నుంచి నిన్నటి చంద్రబాబు ప్రజాగళం సభ వరకు పెద్దఎత్తున చేరికలు వచ్చాయి. అధికార పార్టీ నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల వలసలు పెరిగాయి. పట్టణానికి చెందిన మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు గూటూరు శ్రీనివాసరావు వైకాపాను వీడి తెదేపాలో చేరడంతో ఆ పార్టీకి భారీ కుదుపేనని చెప్పాలి. ఆయనతోపాటు పాల్మన్‌పేట, ఈదటం తదితర గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు తెదేపా కండువా కప్పుకొన్నారు. నియోజకవర్గ కేంద్రం సుమారు 20 వేల ఓటర్లున్న పేట నుంచి వార్డు సభ్యులు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. సీనియర్‌ నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు తోట నగేష్‌ ఇటీవలే జనసేనలో చేరారు. కోటవురట్ల, నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల పరిధిలో రోజూ చేరికల జాతర సాగుతోంది. వైకాపా సానుభూతిపరులు కుటుంబాలతో సహా కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. తాజాగా గోపాలపట్నం ఎంపీటీసీ సభ్యుడు, వైకాపా కీలక నాయకుడు కలిదిండి సతీష్‌రాజు చేరికతో పార్టీకి ఆయా గ్రామాల పరిధిలో మరింత బలం చేకూరింది. ఆయనతోపాటు పలువురు వార్డు సభ్యులు, కార్యకర్తలు ఆయన వెంట తరలివచ్చారు.

వార్డు సభ్యుల చేరికతో నూతన ఉత్సాహం

అనిత సమక్షంలో పార్టీలో చేరిన గోపాలపట్నం ఎంపీటీసీ సభ్యుడు సతీష్‌రాజు తదితరులు

తాజాగా పట్టణంలోని నాలుగో వార్డు సభ్యుడు దాసరి శ్రీనివాసరావు శనివారం అనిత సమక్షంలో పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం నామవరంలో అనిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పార్టీలోకి రావడంతో అక్కడ నూతనోత్సాహం ఉట్టిపడుతోంది. ఇలా ప్రతిరోజూ తెదేపాలోకి వస్తుండటంతో పూర్తిస్థాయిలో ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతోంది. కూటమి నాయకులు తెదేపా, జనసేన, భాజపా నాయకులంతా నాలుగు వైపుల నుంచి ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ప్రాంతాల వారీగా మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఆశయాలను, పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీ నుంచి వరుసగా నాయకులు వీడుతుండటంతో వైకాపా పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎన్నికల ముందు ఆపార్టీపై తీవ్రప్రభావం చూపుతోందంటూ ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని