logo

ఎంపీ అభ్యర్థుల నామినేషన్లలో 22 ఆమోదం

అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ రవి తిరస్కరించారు.

Published : 27 Apr 2024 04:19 IST

నక్కపల్లిలో నామినేషన్లను పరిశీలిస్తున్న ఆర్‌ఓ గీతాంజలి,  చిత్రంలో రాకేష్‌కుమార్‌

ఈనాడు - అనకాపల్లి, కలెక్టరేట్ -  న్యూస్‌టుడే: అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ రవి తిరస్కరించారు. అభ్యర్థుల సమక్షంలో ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన ప్రారంభించారు. 25 పత్రాల్లో 22 ఆమోదించి 3 తిరస్కరించారు. కూటమి తరఫున భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌, వైకాపా నుంచి బూడి ముత్యాలనాయుడు, కాంగ్రెస్‌- వేగి వెంకటేశ్‌ నామినేషన్లు ఆమోదించారు. వైకాపా తరఫున డమ్మీ అభ్యర్థి భీశెట్టి వెంకట సత్యవతి, భాజపా తరఫున డమ్మీ అభ్యర్థి చింతకుంట రమేశ్‌ శ్రీదేవి, కాంగ్రెస్‌ నుంచి రమేశ్‌ నాయుడు బీ- ఫారం సమర్పించకపోవడంతో పాటు 10 మంది ఓటర్లు మద్దతుగా ప్రతిపాదించకపోవడంతో వీరి నామినేషన్లు తిరస్కరించారు. మిగిలిన 22 మంది నామపత్రాలు ఆమోదించారు. ఈనెల 29 వరకు వీటి ఉపసంహరణకు గడువు ఉంది. బూడి ముత్యాల నాయుడు నామపత్రంలో కేసులకు సంబంధించి వివరాలు సరిగా లేవని సీఎం రమేశ్‌ ప్రశ్నించడంతో ఆయన దాఖలు చేసిన నామపత్రాలు పరిశీలించి నిబంధనల మేరకు అన్ని పత్రాలను ఎన్నికల అధికారి రవి పరిశీలించి  సరిగా ఉన్నాయని నిర్థారించి ఆమోదించడంతో వివాదానికి తెరపడింది.

నక్కపల్లి, న్యూస్‌టుడే: ‘పేట’ నియోజకవర్గానికి సంబంధించి ఒక నామినేషన్‌ తిరస్కరించినట్లు ఆర్వో కె.గీతాంజలి తెలిపారు. నక్కపల్లి కార్యాలయంలో శుక్రవారం నామపత్రాల స్క్రూట్నీ చేపట్టగా, ఇందులో వైకాపా తరఫున డమ్మీగా నామినేషన్‌ వేసిన కంబాల సందీప్‌ నామినేషన్‌ తిరస్కరించినట్లు వెల్లడించారు. 17 సెట్లు ఆమోదించినట్లు వివరించారు.  స్క్రూట్నీని ఎన్నికల పరిశీలకుడు డాక్టర్‌ రాకేష్‌కుమార్‌ పరిశీలించారు. కార్యాలయ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీకాంత్‌, సూర్యనారాయణ, వెంకటరమణ, డీటీలు చైనులు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో..

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి అసెంబ్లీకి సంబంధించి 12 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం లభించింది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిణి, జేసీ జాహ్నవి ఆధ్వర్యంలో శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరిగింది. ఈ అసెంబ్లీ స్థానానికి 15 మంది అభ్యర్థులు 30 సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. వీటిలో ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. వైకాపా అభ్యర్థి మలసాల భరత్‌కుమార్‌కు డమ్మీగా భార్య నివేదిత, కాంగ్రెస్‌ అభ్యర్థి ఐఆర్‌ గంగాధర్‌కు డమ్మీగా ఆయన కుమారుడు అవినాష్‌ వేసిన నామినేషన్లతో పాటు స్వతంత్ర అభ్యర్థి కామిరెడ్డి భరత్‌కుమార్‌ నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన 12 మంది అభ్యర్థుల నామినేషన్‌లకు ఆమోదం లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు