logo

అనువుగాని ప్రాంగణం.. ఆడేందుకు అవస్థలు

క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు.

Published : 27 Apr 2024 04:15 IST

నియోజక వర్గానికి ఒక స్టేడియం నిర్మిస్తామని చేతులెత్తేసిన జగన్‌

పెందుర్తిలో తుప్పల మధ్యనున్న ఖాళీ స్థలంలో ఆడుతున్న యువత

పెందుర్తి, వేపగుంట, పరవాడ, న్యూస్‌టుడే: క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో క్రీడా మైదానాలు లేకపోవడంతో ఇక్కడి యువత ప్రైవేట్‌ క్రీడా ప్రాంగణాలను ఆశ్రయించాల్సి వస్తోంది. 2018లో తెదేపా ప్రభుత్వం చినముషిడివాడ వుడాకాలనీలో ఇండోర్‌ స్టేడియం నిర్మించాలని ప్రతిపాదించింది. అనంతరం వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదన మూలకు చేరడంతో ఆ ప్రాంతమంతా డంపింగాయార్డులా మార్చారు. ఈ పరిసరాలు పందుల పెంపకానికి ఆవాసంగా మారాయి. యువత, బాలలు రోడ్లపైన, ఖాళీ స్థలాల్లో ఆటలాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.


ఆనందం ఆవిరి..

వైకాపా అధికారంలోకి రాగానే ప్రతీ నియోజకవర్గంలో ఒక క్రీడా ప్రాంగణం నిర్మిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. దీంతో క్రీడాకారులమంతా ఎంతో ఆనందించాం. ఐదేళ్లలైనా హామీ కార్యరూపం దాల్చలకపోవడంతో ఆనందమంతా ఆవిరైపోయింది. ఏ నియోజకవర్గంలోనూ క్రీడాకారులు ఆడుకునేందుకు సరైన సదుపాయాలు కల్పించలేదు. ఆడుదాం ఆంధ్రా పోటీలు సైతం ప్రైవేట్‌ కళాశాలల క్రీడా ప్రాంగణాల్లోనే నిర్వహించారు.  

కోమటి పవన్‌, క్రీడాకారుడు


క్రికెట్ ఆడాలంటే నగరానికి వెళ్లాలి

క్రికెట్ ఆడాలంటే నగరంలోని మైదానాలకు వెళ్లాల్సి వస్తోంది. క్రికెట్ నేర్పించేందుకు ప్రైవేటు నెట్లు ఏర్పాటు చేసి భారీగా డబ్బులు గుంజుతున్నారు. పెందుర్తి పరిసర ప్రాంతాల్లో అనేక ఖాళీ ప్రదేశాలున్నాయి. ఆయా స్థలాల్లో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

త్రిపురాన ఆర్య


నడకకూ తిప్పలే..

పెందుర్తి పరిసర ప్రాంతాల్లో క్రీడా మైదానం లేకపోవడంతో ఉదయం, సాయంత్రం నడకకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. బీఆర్టీఎస్‌ రహదారిలో వాకింగ్‌ చేయాల్సి వస్తోంది. వాహన కాలుష్యంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని రన్నింగ్‌ ట్రాక్‌ పూర్తిగా పాడైపోయింది.  

జి.హరినాథ్‌


ఏ విద్యాలయంలో చూసినా..

విద్యార్థులు శారీరకంగా బలంగా ఉండాలని చెప్పే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆ దిశగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన మాత్రం చేయడం లేదు. ఏ ప్రభుత్వ పాఠశాల, కళాశాలను చూసినా ఈ విషయం అర్థమవుతుంది. భవిష్యత్‌లోనైనా క్రీడా ప్రాంగణాలు నిర్మించి క్రీడాకారులకు అందుబాటులోకి వస్తాయని ఆశపడుతున్నాం.

మామిడి హరీష్‌, క్రీడాకారుడు


ప్రోత్సాహం అంతంతమాత్రమే..

గ్రామాల్లో ఎంతో మంది ప్రతిభ గల క్రీడాకారులు ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందడం లేదు. క్రీడా పరికరాలు, మైదానాలు అందుబాటులో లేకపోవడంతో ఆటగాళ్లకు శిక్షణ కొరవడింది. నా ఇద్దరు కుమార్తెలు జాతీయ, రాష్ట్ర స్థాయి రన్నింగ్‌ పోటీల్లో రాణిస్తున్నారు. సాధన కోసం స్థానికంగా మైదానాలు లేకపోవడంతో ఉక్కునగరం వెళ్లిపోవాల్సి వచ్చింది.

కూండ్రపు చినసన్నిబాబు, నాయుడుపాలెం


శిక్షణ ఇప్పిస్తే..

పరవాడలో క్రికెట్‌ ఆడటానికి విశాలమైన మైదానం లేకపోవడంతో విద్యార్థులు, యువత ఇక్కట్లు పడుతున్నారు. చెరువులు ఎండిన తర్వాత తమ సొంత నిధులతో బాగు చేసుకుని సాధన చేస్తున్నారు. ఇండోర్‌ స్టేడియం ఉన్నా ప్రవేశ రుసుం చెల్లించాల్సి వస్తోంది. మైదానాలను అందుబాటులోకి తెచ్చి మంచి శిక్షణ ఇప్పిస్తే నాణ్యమైన క్రీడాకారులు తయారవుతారు.

కె.సోమునాయుడు, పరవాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు