logo

Visakhapatnam: భర్తను హతమార్చి.. మూటలో కుక్కేసి!

రెండు రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన ఆచార్యుడి మృతిపై మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ప్రియుడితో కలిసి అతని భార్యే హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘాతుకానికి పాల్పడి.. ఏమీ తెలియనట్టు భర్త కనిపించడం....

Updated : 23 Jul 2022 14:21 IST

కలకలం రేపిన భార్య, ప్రియుడి ఘాతుకం
న్యూస్‌టుడే, పీఎంపాలెం


మురళి, మృదుల (పాత చిత్రం)

రెండు రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన ఆచార్యుడి మృతిపై మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ప్రియుడితో కలిసి అతని భార్యే హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘాతుకానికి పాల్పడి.. ఏమీ తెలియనట్టు భర్త కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించిన మహిళ ఉదంతాన్ని తమదైన శైలిలో వెలుగులోకి తెచ్చారు. ఈ ఘటనపై మధురవాడ నార్త్‌జోన్‌ సబ్‌డివిజన్‌ ఏసీపీ సీహెచ్‌.శ్రీనివాస్‌ శుక్రవారం తెలిపిన వివరాలివి.

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పిల్లలవలస గ్రామానికి చెందిన బుడుమూరి మురళి(43)కి మధురవాడ సాయిరాం కాలనీలో ఉంటున్న మృదుల(29)తో 2014లో వివాహం జరిగింది. ఈయన ఎనిమిది సంవత్సరాలుగా తూర్పు ఆఫ్రికాలోని ఎరిత్రియా దేశంలోని ఆచార్యుడిగా పని చేస్తున్నారు. 2019లో కుమారుడికి అనారోగ్యం కారణంగా భార్యను, బిడ్డను స్వదేశానికి పంపించాడు. 

* మృదులకు వివాహానికి ముందు సాయిరాం కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉన్నప్పుడు అదే కాలనీకి చెందిన పి.హరిశంకర్‌వర్మ(18) ఆమె అక్క వద్దకు ట్యూషన్‌కు వచ్చేవాడు. ఈ క్రమంలో మృదులకు పరిచయం ఏర్పడింది. ఇంటర్‌ చదివిన అతడు వ్యసనాలకు బానిసయ్యాడు. బైక్‌ రేసింగ్‌లకు వెళ్లేవాడు. మృదులకు వివాహమై వెళ్లి.. మళ్లీ తిరిగి వచ్చి సాయిరాం కాలనీలో ఉన్నప్పుడు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమె రిక్షా కాలనీలో కట్టుకున్న సొంతింటికి వెళ్లిన తరువాత ఇద్దరూ మరింత దగ్గరై కలిసి తిరిగేవారు. తమకు అడ్డుగా ఉన్న మురళిని కడతేర్చాలని పన్నాగం పన్నారు. ఆ మేరకు హత్యకు ప్రణాళిక రచించారు.


వివరాలను వెల్లడిస్తున్న ఏసీపీ శ్రీనివాస్‌

ఏం జరిగిందంటే..
జులై 9 నెల రోజుల సెలవుపై మురళి ఎరిత్రియా దేశం నుంచి రిక్షా కాలనీలోని ఇంటికి వచ్చారు.
10నమృదులకు హరిశంకర్‌వర్మ ఫోన్‌ చేసి ‘నిన్ను విడిచి ఉండటం నా వల్ల కాదు’ అని చెప్పగా... ‘భర్తతో సంసారం చేయడం నాకూ ఇష్టం లేదు’ అని ఆమె పేర్కొంది. దీంతో మురళిని ఎలా అడ్డు తొలగించుకోవాలి అనే అంశంపై ఉదయం నుంచి ఇద్దరూ  ఫోన్లో మాట్లాడుకుని ఓ పథకం రచించారు. రాత్రి భోజనం చేసిన మురళి టీవీ చూస్తూ 10 గంటల తర్వాత హాల్లోనే సోపాలో నిద్రపోయాడు. తలుపు తెరిచి ఉండటంతో మృదుల ప్రియుడు పడక గదిలోకి వచ్చాడు. తొలుత నిద్రపోతున్న మురళి గొంతుకు తాడు బిగించి చంపాలనుకున్నా వద్దనుకున్నారు. ఆపై రాత్రి ఒంటి గంట ప్రాంతంలో నిద్ర లేచిన మురళి పడకగదిలోకి వెళ్లాడు. అక్కడే కాపు కాసిన హరిశంకర్‌వర్మ అతని చేతులు వెనక్కి మడిచి గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే  భర్త తలపై అట్లు వేసే పెనంతో మృదుల బలంగా కొట్టింది. హ్యాండిల్‌ విరిగి పోవడంతో వంటగదిలోకి వెళ్లి కుక్కర్‌ మూత తెచ్చి మళ్లీ గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడు ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారించుకున్నాక తెల్లవారు జామున మూడు గంటలకు దుప్పట్లో దుస్తుల మూటలా శవాన్ని కట్టి ద్విచక్రవాహనంపై ఇద్దరి నడుమ పెట్టుకుని రెండు కిలోమీటర్ల దూరంలోని జాతీయరహదారిపై ఉన్న మారికవలస వంతెన పక్కన తుప్పల్లో విసిరి వెళ్లిపోయారు. వారు ఉపయోగించిన దుప్పటి, నోటిలో కుక్కిన తాడును మధురవాడలోని ఓ గెడ్డలో పడేశారు.
11నఉదయం 6 గంటల సమయంలో హరిశంకర్‌వర్మ మారికవలస వంతెన వద్దకు వచ్చి మృతదేహం బయటకు కనిపిస్తుందా? అని పరిశీలించాడు. లేదని నిర్ధారించుకున్నాక తిరిగి వెళ్లిపోయాడు.
13న రాత్రి ఎనిమిది గంటల సమయంలో మరోసారి మృతదేహం వద్దకు హరిశంకర్‌వర్మ వచ్చాడు. కొంచెం సేపు అక్కడ తచ్చాడాడు. శవం నుంచి దుర్వాసన రావడంతో విషయాన్ని మృదులకు చెప్పాడు. దీంతో రాత్రి ఒంటి గంట తర్వాత ఇద్దరు కలిసి మళ్లీ మృతదేహం వద్దకు వచ్చి పెట్రోలు పోసి కాల్చేశారు.
17న భర్త అయిదు రోజులుగా కనిపించడం లేదని పోలీసులకు మృదుల ఫిర్యాదు చేసింది. 12వ తేదీన తల్లిని చూసేందుకు శ్రీకాకుళం బయలుదేరగా తానే కొమ్మాది ఎస్టీబీఎల్‌ కూడలిలో దింపానని, అక్కడికి ఆయన స్నేహితులు రెండు ద్విచక్రవాహనాలపై వచ్చారని, వారికి తనను ఆయన పరిచయం చేశారని చెప్పింది. ‘దుస్తుల బ్యాగ్‌తో పాటు రూ.5 లక్షల నగదు ఆయన వెంట తీసుకుని వెళ్లారు. రెండు రోజులు ఉండి వస్తానని చెప్పడంతో ఆయనకు నేను ఫోన్‌ చేయలేదు. ఆ తరువాత మా మరిది ఫోన్‌ చేసి అన్నయ్య ఇంకా రాలేదు అని చెప్పాడు. దీంతో పలుచోట్ల వెతికినా ఆచూకీ తెలియ లేదు’ అని చెప్పగా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపట్టారు.
20న దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మృదుల కదలికలపై అనుమానం కలిగింది. ఆమె కాల్‌డేటాను పరిశీలించారు. హరిశంకర్‌వర్మతో ఎక్కువగా మాట్లాడినట్లు నిర్ధారించుకున్నారు. ఆపై అతడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో జరిగిన కథంతా బయటపెట్టాడు. రాత్రి 10 గంటల సమయంలో నిందితుడిని తీసుకుని మృతదేహాన్ని పడేసిన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ అస్థిపంజరం కనిపించింది.  మృతుడి చేతి గడియారం, పర్సు దొరికాయి. వాటి ప్రకారం మృతుడు మురళి అని నిర్ధారించారు.
21న మృతదేహం, దొరికిన ఆధారాలను మురళి సోదరులకు పోలీసులు చూపించారు. అవి అతనివే అని వారూ చెప్పారు. దీంతో మృదులను అదుపులోకి తీసుకుని విచారించగా అమె నేరాన్ని అంగీకరించింది.
* ఈకేసులో హరిశంకర్‌వర్మను రిమాండ్‌కు తరలించారు. మృదులను అరెస్టు చేశారు. హత్యకేసును ఛేదించిన పీఎంపాలెం సీఐ ఎ.రవికుమార్‌, ఎస్సై డి.విశ్వనాథాన్ని పోలీసు కమిషనర్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌, ఏసీపీ సీహెచ్‌.శ్రీనివాస్‌ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని