logo

‘నౌకాశ్రయంలో.. రూ.వెయ్యికోట్లతో ప్రాజెక్టులు’

విశాఖ నౌకాశ్రయంలో రూ.వెయ్యికోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులు జరుగుతున్నాయని నౌకాశ్రయ ఛైర్మన్‌ కె.రామమోహనరావు పేర్కొన్నారు.నగరంలోని ఓ హోటల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంపై జరుగుతున్న సదస్సులో రెండోరోజైన గురువారం ఆయన హాజరై మాట్లాడారు.

Updated : 19 Aug 2022 06:18 IST

ప్రసంగిస్తున్న
కె.రామమోహనరావు

డివిజన్‌ పరిధిలో వేగన్ల కొరత ఉంది. ప్రత్యామ్నాయంగా కొన్ని సంస్థలు సొంతంగా వ్యాగన్లు సమకూర్చుకుంటున్నాయి. -రైల్వే డీఆర్‌ఎం
ఈనాడు, విశాఖపట్నం: విశాఖ నౌకాశ్రయంలో రూ.వెయ్యికోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులు జరుగుతున్నాయని నౌకాశ్రయ ఛైర్మన్‌ కె.రామమోహనరావు పేర్కొన్నారు.నగరంలోని ఓ హోటల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంపై జరుగుతున్న సదస్సులో రెండోరోజైన గురువారం ఆయన హాజరై మాట్లాడారు. నౌకాశ్రయం ఆధునికీకరణతో సరకు రవాణా పరిమాణం క్రమంగా పెరుగుతోందని..... ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి నౌకాశ్రయ చరిత్రలోనే ఎప్పడూ చేయనంత భారీ స్థాయి రవాణాతో రికార్డు సృష్టించబోతున్నామన్నారు.సదస్సులో ప్రధానంగా 13 అంశాలపై చర్చలు జరిపామన్నారు. ‘నాస్కామ్‌’ ప్రతిభా కేంద్రాల సీఈవో సంజీవ్‌ మల్హోత్రా మాట్లాడుతూ దేశంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయని, ఫలితంగా కార్యక్రమాలను వేగవంతంగా, పూర్తిస్థాయి కచ్చితత్వంతో తక్కువ వ్యయంతో నిర్వహించే అవకాశం ఉందన్నారు. వ్యాపార సంస్థల అధినేతలు తమ సంస్థల కార్యకలాపాలకు ఏ పరిజ్ఞానం సరిపోతుందో అవగాహన పెంచుకోవాలన్నారు. దేశంలో అంకురసంస్థల సంస్కృతి పెరుగుతోందని, వివిధ సంస్థలు వారివారి అవసరాలు చెబితే వాటిని ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో మరింత సులభతరంగా నిర్వహించేలా ఆవిష్కరణలు జరుగుతాయన్నారు. హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ సీఎండీ హేమంత్‌ ఖత్రీ మాట్లాడుతూ షిప్‌యార్డ్‌కు రూ.20వేల కోట్ల భారీ ప్రాజెక్టు రాబోతోందని, పలు ఎం.ఎస్‌.ఎం.ఇ.లకు భారీఎత్తున ఆర్డర్లు లభించి ఆర్థిక ప్రయోజనం కూడా కలగబోతోందని పేర్కొన్నారు. నౌకల మరమ్మతుల కేంద్రంగా విశాఖ అభివృద్ధి చేయడానికి అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైల్వే డీఆర్‌ఎం అనూప్‌ సతపతి మాట్లాడుతూ తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని ప్రాంతాల నుంచి నౌకాశ్రయాలకు బొగ్గు, ఇనుప ఖనిజం రవాణా వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని