logo

YSRCP: విందు భోజనం.. మద్యం టోకెన్లు!

‘విశాఖ తూర్పు’లో నోట్ల కట్టలే ఓట్లు అడుగుతున్నాయి. ఓటర్లకు ప్రలోభాలతో ఎర వేస్తున్నారు. భారీగా చీరలు, నగదు నిల్వలు పెట్టి ‘చిక్కడు-దొరకడు’ రీతిలో పంపిణీ చేస్తున్నారు.

Updated : 20 Mar 2024 08:46 IST

ఈనాడు-విశాఖపట్నం: ‘విశాఖ తూర్పు’లో నోట్ల కట్టలే ఓట్లు అడుగుతున్నాయి. ఓటర్లకు ప్రలోభాలతో ఎర వేస్తున్నారు. భారీగా చీరలు, నగదు నిల్వలు పెట్టి ‘చిక్కడు-దొరకడు’ రీతిలో పంపిణీ చేస్తున్నారు. తాజాగా కూపన్ల రాజకీయానికి తెరలేపారు. ఇటీవల ఆరిలోవ పదోవార్డులో కూపన్లు పంపిణీ చేశారు. అదే రోజు రాత్రి కల్యాణ మండపం వద్ద విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ కూపన్లు చూపించిన వారికి రూ.వెయ్యి నగదు అందజేసినట్లు సమాచారం. తాజాగా అదే తరహాలో 10వ వార్డు ఆదర్శనగర్‌ పరిధిలోని ఓ స్కూల్లో 64, 65 బూత్‌లకు చెందిన ఓటర్లకు విందు భోజనం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రలోభాల పర్వంలో...ముందుగా నేతల ఫొటోలతో ఉన్న టీషర్టులు పంపిణీ చేసి వాటితోపాటు కూపన్‌లు ఇస్తున్నారు. ఆ టీషర్టు ధరించి నేత వద్దకు వెళ్లి వైకాపా కండువా కప్పుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ తిని.. కూపను చూపిస్తే రూ.వెయ్యి నగదు అందిస్తున్నారు. అంతేనా... ఆరిలోవ, పెద్దజాలారిపేటలో మద్యం టోకెన్లు ప్రతిరోజూ అందిస్తున్నట్లు సమాచారం. సమీపంలోని బార్‌ల వద్దకు వెళ్లి ఆ టోకెన్లు చూపిస్తే చాలు.. చేతికి మద్యం అందుతుంది.

అక్కడ అలా... ఇక్కడ ఇలా: భారీగా ధన ప్రభావం, ప్రలోభాలకు తూర్పు నియోజకవర్గం అడ్డాగా మారింది. ఎన్నికల కోడ్‌ రాక ముందే స్వీట్లు, చీరలతో ఓటర్లకు తాయిలాలు ఆరంభించారు. అయితే... వైకాపా ఎంపీగా మురికివాడలు, పేద ప్రాంతాల్లో ఒక్క అభివృద్ధి పనిచేయని ఎంవీవీ... ప్రస్తుత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి ఓట్లు కోసం ప్రతిరోజూ పెదజాలారిపేటలో తిష్టవేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు జాలారి పేటను పట్టించుకోని సదరు నేత... ప్రస్తుతం సగం రోజు అక్కడే పర్యటిస్తూ, మత్స్యకారుల ఇళ్లల్లో భోజనాలు చేయడం ఓట్లు దండుకునే ఎత్తుగడగానే భావిస్తున్నారు. ఆరిలోవ, పెదజాలారిపేట ప్రాంతాల్లో మహిళలకు రూ.230 విలువైన చీరలు పంపిణీ చేశారు. ఎంవీపీ కాలనీ, సమీప ప్రాంతాల్లో రూ.1200 విలువైన చీరలు పంపిణీ చేయడంపై పలువురు మండిపడుతున్నారు. కూపన్లతో మురికివాడల్లో రూ.వెయ్యి ఇస్తూ, ఎంవీపీకాలనీలో రూ.3వేల చొప్పున పంపిణీ చేస్తున్నారనే ప్రచారం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని