logo

ఇసుక బాధలు ఇంతింతకాదయా!

ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్‌ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు.

Published : 25 Apr 2024 05:11 IST

జగన్‌ పాలనలో నిర్మాణ రంగం కుదేలు
ఇసుక విధానంతో ముందుకు సాగని పనులు

పెందుర్తి, వేపగుంట, పరవాడ, సబ్బవరం, న్యూస్‌టుడే: ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్‌ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. తొలినాళ్లలో ఇసుక పాలసీని తీసుకొస్తామని కొన్ని నెలల పాటు ఇసుక దొరకని పరిస్థితిని తీసుకొచ్చారు. దీంతో భవన నిర్మాణాలు నిలిచిపోయి కూలీలంతా రోడ్డునపడ్డారు. ఇప్పటికీ ఇసుక విధానంలో ఒక నిర్ధిష్టమైన పద్ధతి లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఇసుకను తెప్పించుకునే దుస్థితి నెలకొంది. విశాఖ ఎంపీ, ప్రముఖ నిర్మాణ సంస్థ యజమాని ఎం.వి.వి.సత్యనారాయణ స్వయంగా ఇక్కడ వ్యాపారం చేయలేను.. హైదరాబాద్‌ వెళ్లిపోతానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన చూస్తే ఇసుక కొరత ప్రభావం ఎంత ఉందో అర్థమవుతోంది.

ఒడిశా నుంచి కొనుగోలు.. నేను చిన్న చిన్న భవన నిర్మాణ పనులు చేస్తుంటాను. ఇక్కడ సక్రమంగా ఇసుక దొరక్కపోవడంతో ఒడిశా నుంచి ఇసుకను కొనుగోలు చేయాల్సి వస్తోంది. స్థానికంగా ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ కావాల్సినంత దొరకడం లేదు. పనులు సక్రమంగా సాగక కూలీలు సైతం ఇబ్బంది పడుతున్నారు. నిర్మాణదారులు కూడా పెరుగుతున్న ధరల కారణంగా ముందుకు రావడం లేదు.

టి.మహేశ్‌, నిర్మాణ రంగ వ్యాపారి

వ్యాపారులు అప్పుల పాలయ్యారు.. వైకాపా ప్రభుత్వం వచ్చిన వెంటనే సుమారు రెండేళ్ల పాటు ఇసుక అందుబాటులో లేకుండా చేయడంతో చిన్నచిన్న నిర్మాణదారులు పూర్తిగా అప్పుల పాలవగా, పెద్దపెద్ద స్థిరాస్తి వ్యాపారులు కట్టిన భవనాలు అమ్మకాలు జరగక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ ఇసుక పూర్తిస్థాయిలో అందుబాటు ధరలో లేకపోవడంతో వ్యాపారాలు సాగడం లేదు. మళ్లీ ఇదే ప్రభుత్వం వచ్చి ఇలానే కొనసాగితే మరింత ఇబ్బందులు తప్పవు.

దండు శ్రీనివాసరాజు, నాయుడతోట

గతంలో ఎంత కావాలంటే అంత... తెదేపా హయాంలో ఇసుక ఉచితంగా ఎంత కావాలంటే అంత లభించడంతో పేద, మధ్య, ఉన్నత వర్గాలకు చెందిన వారంతా ఇళ్లను నిర్మించుకున్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారి వ్యాపారాలకు మాత్రం అందుబాటులో ఉండేలా చేసుకున్నారు. ఇసుక లేకపోవడంతో తాపీ మేస్త్రీలు, రోజు కూలీలు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు ఇలా ఎంతోమంది రోడ్డున పడ్డారు.

నామాల అరుణ, బీసీకాలనీ వేపగుంట

ఇల్లు కట్టుకోవాలంటే భయపడుతున్నారు..  ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులు, పేదలు ఇల్లు కట్టుకోవాలంటే భయపడుతున్నారు. ఇసుకకే సుమారు రెండు మూడు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో చాలామంది ఇళ్ల పనులను నిలిపివేశారు. జగన్‌ ప్రభుత్వంలో ఇసుక, సిమెంట్‌, ఇనుము తదితర భవన నిర్మాణ వస్తువుల ధరలు పెరిగిపోవడంతో కూలీలకు మూడు రోజులు మించి పని దొరకకపోవడంతో అవస్థలు తప్పడం లేదు.

పాల అచ్చిలనాయుడు, పాలవలస

వైకాపా నాయకులకు ఢోకా లేదు.. వైకాపా ప్రభుత్వం ఇసుకపై పెట్టిన ఆంక్షలను గత ప్రభుత్వాల హయాంలో ఎప్పుడూ చూడలేదు. దీని వల్ల సామాన్యులు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. వైకాపా నాయకుల నిర్మాణాలకు మాత్రం ఎటువంటి ఇసుక దొరుకుతోంది. ప్రభుత్వ భవనాలకు సైతం ఇసుక లేకపోవడంతో నాడు-నేడు పనులు నిలిచిపోయాయి.

కె.శ్రీనివాసవర్మ, అమ్ములపాలెం

ఆంక్షలు దారుణం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఇసుకపై జగన్‌ ఆంక్షలు విధించడం దారుణం. గతంలో యూనిట్లలో ఉండే ఇసుక నేడు టన్నుల్లో అమ్ముతున్నారు. గతంలో లారీ ఇసుక రూ.3 వేలకు దొరికేది. ఇప్పుడు రూ.9 వేలు అయినా దొరకడం లేదు. పని చేద్దామంటే ఇసుక దొరకకపోవడంతో నిర్మాణాలు పూర్తికావడం లేదు. తక్షణం ఇసుకపై ఆంక్షలు ఎత్తివేయాలి.

శరగడం ఝాన్సీలక్ష్మీరాణి, ఆరిపాక

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని