logo

లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యం

ఎన్‌డీఏ కూటమి ప్రకటనలో భాగంగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో లక్ష మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌ అన్నారు.

Published : 01 May 2024 03:19 IST

విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి శ్రీభరత్‌

కొత్తవలస, న్యూస్‌టుడే: ఎన్‌డీఏ కూటమి ప్రకటనలో భాగంగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో లక్ష మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌ అన్నారు. కొత్తవలస మండలం తుమ్మికాపల్లిలో కేవీ కన్వెన్షన్‌లో మంగళవారం నిర్వహించిన తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌, ఎస్‌.కోట ఎమ్మెల్యే అభ్యర్థిని కోళ్ల లలితకుమారి పాల్గొని మాట్లాడారు. కూటమి అధికారంలోకి రాగానే ఎస్‌.కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలుపుతామన్నారు. ఎస్‌.కోట, భీమునిపట్నం నియోజకర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. పెందుర్తి-అరకు జాతీయ రహదారిని ఆరువరుసలుగా తీర్చిదిద్దుతామన్నారు. కొత్తవలసలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. అబద్దాల ప్రచారంలో వైకాపా పేటీఎం బృందం పీహెచ్‌డీ చేసిందని విమర్శించారు. రూ.వేల కోట్ల అవినీతి కేసుల్లో ఉన్న వ్యక్తి పేదలు, పెత్తందారులు అంటూ మాటలు చెబుతున్నారన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారిని గుర్తిస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థిని లలితకుమారి మాట్లాడుతూ పదిరోజులు అప్రమత్తంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ మండల అధ్యక్షుడు గొరపల్లి రాము అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మల కృష్ణప్ప, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి సుధారాణి, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి వబ్బిన సత్యనారాయణ, భాజపా నియోజకవర్గ కో కన్వీనర్‌  అప్పారావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు