logo

గుర్తుందా.. జగన్‌ ఏలేరు పైపులైను..!

విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేస్తాం.. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఊదరగొట్టారు జగన్‌.. వైకాపా పాలన ఐదేళ్లు పూర్తయింది. ఇప్పుడు చూస్తే నగరాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది.

Published : 01 May 2024 03:26 IST

డీపీఆర్‌ను అటకెక్కించిన వైకాపా ప్రభుత్వం
‘జలజీవన్‌’ను వినియోగించుకోలేని దుస్థితి
విశాఖ నీటి కష్టాలను పట్టించుకోని వైనం

విశాఖపట్నం, న్యూస్‌టుడే : విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేస్తాం.. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఊదరగొట్టారు జగన్‌.. వైకాపా పాలన ఐదేళ్లు పూర్తయింది. ఇప్పుడు చూస్తే నగరాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది. ఎన్నింటికో శంకుస్థాపనలు చేశారు.. వాటిల్లో ఒక్క ప్రాజెక్టు కూడా పట్టాలకెక్కలేదు. 2050 వరకు నగర నీటి అవసరాలను తీర్చే ఏలేరు పైపులైను ప్రాజెక్టునూ అటకెక్కించారు. ఇక జగన్‌ చెప్పే మాయ మాటలను నమ్మే పరిస్థితుల్లో లేమని నగరవాసులు మండిపడుతున్నారు.  

రూ.4వేల కోట్ల డీపీఆర్‌ ఏమైందో..

విశాఖ నగర ప్రజలు, పరిశ్రమలకు అవసరమైన నీటి కోసం ఇతర జిల్లాలోని తాటిపూడి, రైవాడ, ఏలేరు వంటి వనరులపై ఆధారపడాల్సి వస్తోంది. అక్కడ్నుంచి నీటిని తరలించడానికి జీవీఎంసీ రూ.కోట్లలో వ్యయం చేయాల్సి వస్తోంది. అయినా వేసవివస్తే తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. వైకాపా అధికారంలోకి రాగానే ఏలేరు రిజర్వాయర్‌ నుంచి విశాఖ నగరానికి రూ.4వేల కోట్లతో పైపులైను నిర్మిస్తామని ప్రకటించింది. జీవీఎంసీ అధికారులు జగన్‌ను కలిసి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ సమర్పించారు. ఇప్పటి వరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.


లేరు నుంచి విశాఖ నగరానికి నీటిని తరలిస్తే 2050 వరకు ఇబ్బందులుండవు. కొత్త పరిశ్రమలొచ్చినా, వలసలు పెరిగినా నీటి కష్టాలు తలెత్తవని అధికారులు విన్నవించారు. అయినా వైకాపా ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది. కొంచెం దృష్టిపెట్టి ఉంటే జల్‌జీవన్‌ మిషన్‌ నుంచి నిధులు వచ్చేవి. జగన్‌ ఆ దిశగా ఆలోచించకపోవడం నగర ప్రజలకు శాపంగా మారింది.


సగం నీరు మధ్యలోనే ఆవిరి

ప్రస్తుతం ఏలేరు రిజర్వాయర్‌ నుంచి కాలువ ద్వారా 350 ఎంఎల్‌డీ నీటిని విడుదల చేస్తే నగరానికి 190 ఎంఎల్‌డీలు మాత్రమే చేరుతోంది. ఆవిరి కావడం, రైతులు వ్యవసాయానికి తరలించడం వంటి చర్యలతో కేవలం సగం నీరు మాత్రమే నగరానికి వస్తోంది. పైపులైను నిర్మాణం జరిగితే 350 ఎంఎల్‌డీల నీరు నేరుగా నగరానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.


పురుషోత్తపట్నం ప్రాజెక్టే దిక్కు..

తెదేపా ప్రభుత్వ హయాంలో పురుషోత్తపట్నం వద్ద ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. వేసవిలో ఏలేరు రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గగానే గోదావరి నుంచి పురుషోత్తపట్నం ప్రాజెక్టు ద్వారా నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రాక ముందు జీవీఎంసీ ఏటా వేసవిలో రూ.2కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు ఖర్చు చేసి నీటిని పంపింగ్‌ చేసేది. ప్రస్తుతం పురుషోత్తపట్నం ప్రాజెక్టు ద్వారా ఏలేరు రిజర్వాయరులోకి పంపిన నీరు కాలువ ద్వారా విశాఖకు వచ్చే సరికి సగం ఆవిరవుతోంది. పైపులైను నిర్మిస్తే ఈ సమస్య పరిష్కారమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని