logo

ఒక్కో విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం.. : పల్లా

తెదేపా కూటమి ప్రభుత్వంలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన 68వ వార్డు మింది గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

Published : 05 May 2024 04:03 IST

మిందిలో ప్రచారం చేస్తున్న కూటమి తెదేపా అభ్యర్థి పల్లా, తదితరులు

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే : తెదేపా కూటమి ప్రభుత్వంలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన 68వ వార్డు మింది గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అయిదేళ్ల వైకాపా పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్‌ గుర్తుపై ఓటేసి... ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా శ్రీభరత్‌ను గెలిపించాలని కోరారు. కూటమి నాయకులు ఈటి శ్రీను, అనంతలక్ష్మీ, రాజేశ్‌, నర్సింహమూర్తి, జయలక్ష్మి, షాలిని, జీవన్‌బాబు పాల్గొన్నారు.

మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం : గణబాబు

కరాస, న్యూస్‌టుడే : తెదేపా కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. శనివారం ఉదయం ఆయన 57వ వార్డు పరిధి మర్రిపాలెం మెయిన్‌రోడ్డు, రామునాయుడుకాలనీ, శ్యామ్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా అరాచక పాలనలో అన్యాయానికి గురైన అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వంలో న్యాయం చేస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. పశ్చిమ ఎమ్మెల్యేగా తనను, విశాఖ ఎంపీగా శ్రీభరత్‌ను గెలిపించేలా సైకిల్‌ గుర్తుపై  ఓటేయాలని కోరారు. కూటమి నాయకులు పి.అజయ్‌బాబు, పి.శ్రీను, కె. శ్రీరామ్మూర్తి, శ్రీను, చిన్న, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

‘పాడిరైతుల కష్టం.. వైకాపా దుర్వినియోగం’

సింధియా, న్యూస్‌టుడే : పాడి రైతుల కష్టార్జితాన్ని వైకాపా దుర్వినియోగం చేస్తుందని విశాఖ జిల్లా తెదేపా ఉపాధ్యక్షులు పొలిమేర సీతారామ్‌ ఆరోపించారు. రైతులకు ఏర్పాటు చేసిన ఆసుపత్రిని, డెయిరీని విశాఖ పశ్చిమ వైకాపా అభ్యర్థి ఆడారి ఆనంద్‌కుమార్‌ ఛైర్మన్‌ హోదాలో తన స్వప్రయోజనాలకు వినియోగించుకోవడం తగదని విమర్శించారు. శనివారం సాయంత్రం హిమాచల్‌నగర్‌ తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కొందరు వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించి, డెయిరీ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించిన పనులు చేయించడంపై ఎన్నికల సంఘం ఆరా తీసి, చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 63వ వార్డు కార్పొరేటర్‌ గల్లా చిన్నా మాట్లాడుతూ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు చొరవతో పూర్తయిన ఎన్‌ఏడీ పైవంతెన, టిడ్కో ఇళ్లు, ఇతర అభివృద్ధి పనులను వైకాపా తమవిగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఎమ్మెల్యే గణబాబుపై డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ నిరాధార ఆరోపణలు చేయడం దారుణమన్నారు. తెదేపా ప్రతినిధులు నక్క లక్ష్మణరావు, సీహెచ్‌.రామోహ్మన్‌, ఎం.సోమేష్‌, వి.దినకర్‌, జోజిబాబు, ఉమామహేశ్వరి, ఎస్‌.శ్రీలక్ష్మి, డేవిడ్‌, తదితరులు పాల్గొన్నారు.

జులైలో పింఛన్‌ రూ.7 వేలు ఇస్తాం: గంటా

పద్మనాభం, న్యూస్‌టుడే: కూటమి అధికారంలోకి రాగానే వృద్ధులకు నెలకు రూ.4 వేలు పింఛను అందిస్తామని.. దీన్ని ఏప్రిల్‌ నెల నుంచే అమలు చేస్తామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని కలిపి జులైలో రూ.7 వేలు అందిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం పద్మనాభం మండలంలోని శేరీఖండం, రెడ్డిపల్లి, మద్ది, పొట్నూరు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. దార్శనికతకు నిలువెత్తు రూపం చంద్రబాబునాయుడు అయితే.. విధ్వంసానికి జగన్‌ అని తెలిపారు. పర్యటనలో భాగంగా గంటాకు ప్రతి చోటా తెదేపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గజమాలలతో, బాణసంచా వెలుగులుతో అపూర్వ స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని