logo

జగన్‌కు పల్లకీ మోత.. గిరిజనులకు డోలీమోత

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ కుంబర్ల గ్రామానికి చెందిన కొర్రా రోజా నిండు గర్భిణి. కొద్దినెలల కిందట పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమెను స్ట్రెక్చర్‌పై డౌనూరు ఆరోగ్య కేంద్రానికి వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

Updated : 08 May 2024 06:04 IST

బైక్‌ అంబులెన్స్‌లపై జగన్‌ చిన్నచూపు
ఆపదలో ఆదుకోవడంపైనా రాజకీయాలే!
ఈనాడు, రంపచోడవరం న్యూస్‌టుడే, చింతపల్లి, హుకుంపేట

  • మన్యంలో మరణమృదంగం మోగుతూనే ఉంది. కొండపై నివసించే గిరిజనుల బతుకులు తరచూ కొండెక్కిపోతున్నాయి
  • ఆపదవేళ ఆగమేఘాలపై రావాల్సిన అంబులెన్స్‌లు అయిపు లేకుండా పోతున్నాయి
  • పోయే ప్రాణాలను నిలబెట్టడానికి అడవి బిడ్డలు డోలీలపై మోసుకుంటూ పరుగులు తీస్తూనే ఉన్నారు
  • అధికారమనే పల్లకి ఎక్కి పరదాల నడుమ పర్యటించే జగన్‌ గిరిపుత్రుల కష్టాన్ని పట్టించుకోవడమే మానేశారు

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ కుంబర్ల గ్రామానికి చెందిన కొర్రా రోజా నిండు గర్భిణి. కొద్దినెలల కిందట పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమెను స్ట్రెక్చర్‌పై డౌనూరు ఆరోగ్య కేంద్రానికి వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలోనే ఆమె పురిటినొప్పులు తాళలేక మరణించింది. కుంబర్ల గ్రామం నుంచి రాళ్లు రప్పలు దాటి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఆర్ల గ్రామానికి వెళ్తేనే రోడ్డు కనిపిస్తుంది. రోడ్డు కోసం ఇచ్చిన వినతులన్నింటినీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది.

అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అత్యవసరంలోనూ కనీస సాయం అందని గిరిజన గ్రామాల బతుకు భయానికి కుంబర్ల సంఘటన ఓ ఉదాహరణ.


నిత్యకృత్యంగా మారిన మోతలు

తమ పాలనలో గిరిజనులకు తాము అన్ని విధాలా మేలు చేసేశామని గొప్పగా చెప్పుకొంటూ వస్తున్నారు జగన్‌. కానీ రోగమొస్తే ఆసుపత్రికి చేరుకోక ముందే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న దయనీయ పరిస్థితులను పట్టించుకోవడమే లేదు. పాడేరు డివిజన్‌ పరిధిలోని పదకొండు మండలాల్లో మొత్తం 3,803 గ్రామాలుండగా, రోడ్డు సదుపాయం లేని గ్రామాలు సుమారు 1648కి పైగా ఉన్నాయి. ఈ గ్రామాల్లోని గిరిజనులందరికీ కాలినడకే శరణ్యం. అత్యవసర సమయాల్లో గర్భిణులు, లేదా వైద్యంకోసం రోగులను తరలించాలంటే కేవలం డోలీమోతలపై ఆధారపడాల్సిందే. దుర్భరమైన కొండదారిలో రాళ్లు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకుంటూ రోగులను డోలీమోతలపై సమీప గ్రామాలకు తీసుకువచ్చి అక్కడనుంచి వాహనాల్లో ఆస్పుత్రులకు తరలించాల్సి వస్తోంది. తెదేపా పాలనలో ఫీడర్‌ అంబులెన్స్‌లు విస్తృతంగా పనిచేసేవి. 108 వాహనాలు చేరలేని ఎన్నో గ్రామాలకు ఫీడర్‌ వాహనాలు చేరుకుని ఎంతోమంది ప్రాణాలు కాపాడాయి. వైకాపా ప్రభుత్వం ఫీడర్‌ అంబులెన్స్‌లకు సరిగ్గా నిధులు కేటాయించకపోవడంతో మళ్లీ డోలీమోతలే దిక్కవుతున్నాయి. విషమ పరిస్థితులు ఎదురైనప్పడల్లా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

 

రహదారులు లేక వాగులు దాటేందుకు గిరిజనం ఇబ్బందులు (పాత చిత్రం)


నాడు

గిరి గ్రామాల్లో అత్యవసర వైద్యం కావాల్సిన వారిని ఆదుకునేందుకు గత తెదేపా ప్రభుత్వం వినూత్నమైన ముందడుగు వేసింది. కాలిబాట కలిగిన గ్రామాల ప్రజలను ఆసుపత్రులకు తరలించేందుకు 2018 ఏప్రిల్‌ నెలలో ఫీడర్‌ (బైక్‌) అంబులెన్స్‌లను ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా తయారుచేసిన ఈ బైక్‌ అంబులెన్స్‌లు కొండలపైనున్న గ్రామాలకు వెళ్లి రోగులను కొండ దిగువకు తీసుకొచ్చేవి. రాష్ట్రంలోని 7 సమీకృత గిరిజనాభివృద్ది సంస్థల్లో (ఐటీడీఏ) తెదేపా ప్రభుత్వం 122 వాహనాలను ఏర్పాటు చేసింది. ఈ ఫీడర్‌ అంబులెన్స్‌లు గిరిగ్రామాల ప్రజలకు వరదాయినిగా గుర్తింపు తెచ్చుకున్నాయి.

నేడు

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫీడర్‌ అంబులెన్స్‌లపై శీతకన్ను వేసింది. వాటి మరమ్మతులకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకుండా, అంబులెన్స్‌ సిబ్బంది సమస్యలు పరిష్కరించకుండా గాలికొదిలేసింది. తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన 122 వాహనాలే నేటికీ ఉన్నాయి తప్ప వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో అదనంగా ఒక్కటీ అందుబాటులోకి తేలేదు. పైపెచ్చు 108కి ఫోన్‌ చేస్తే బైక్‌ అంబులెన్స్‌లకు సమాచారం చేరే వీలు లేకుండా చేసి ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోంది.


అటకెక్కిన మిషన్‌ కనెక్ట్‌ పాడేరు...

అల్లూరి జిల్లాలో డోలీ మోతలను పూర్తిగా నియంత్రించడంకోసమేనంటూ గతంలో అధికారులు మిషన్‌ కనెక్ట్‌ పాడేరు అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో సర్వేలు నిర్వహించారు. ఏఏ గ్రామాలకు రహదారులు లేవన్నదానిపై వివరాలను సేకరించారు. డోలీమోతలకు ఆస్కారం లేకుండా ప్రతి గ్రామానికి రహదారిని ప్రధాన రహదారులతో అనుసంధానం చేసే దిశగా అవసరమైన ప్రతిపాదలను సిద్ధం చేశారు. ఇదంతా బాగానే ఉన్నా రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేయకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది.


తెదేపా హయాంలో ఫీడర్‌ సేవలు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (పాతచిత్రం)


ఇది ఒక్క కొయ్యూరు మండలంలో గిరిజన గ్రామం పరిస్థితే కాదు. అల్లూరి జిల్లాలో దాదాపు చాలా మండలాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. గిరిజనుల డోలీమోతలు ప్రభుత్వానికి పల్లకి మోతల్లా కనిపిస్తున్నాయో.. ఏమో? మాగురించి కనీసం పట్టించుకోవడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని