logo

మమ.. పరిశ్రమ

పరిశ్రమల ఏర్పాటుతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా.. ఆ దిశగా అడుగులు ముందుకు పడడం లేదు. జిల్లాలోని బొబ్బిలి పారిశ్రామికవాడలోని పరిస్థితే ఇందుకు నిదర్శనం. ఇక్కడ యూనిట్ల ఏర్పాటు కోసం స్థలాల కేటాయింపు అంతంతమాత్రంగా ఉండడంతో

Published : 21 May 2022 04:27 IST

 స్థల కేటాయింపులు లేక ఏర్పాటు కాని యూనిట్లు 
 బొబ్బిలి పారిశ్రామికవాడ పరిస్థితి ఇదీ


ఇలా మూతపడిన యూనిట్లు ఎన్నో..

న్యూస్‌టుడే, బొబ్బిలి పరిశ్రమల ఏర్పాటుతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా.. ఆ దిశగా అడుగులు ముందుకు పడడం లేదు. జిల్లాలోని బొబ్బిలి పారిశ్రామికవాడలోని పరిస్థితే ఇందుకు నిదర్శనం. ఇక్కడ యూనిట్ల ఏర్పాటు కోసం స్థలాల కేటాయింపు అంతంతమాత్రంగా ఉండడంతో ఔత్సాహికులు ముందుకు రాని పరిస్థితి. మరోవైపు కేటాయించిన స్థలాల్లో ఏళ్లుగా కొందరు పరిశ్రమలు ఏర్పాటు చేయడం లేదు. వారి జాబితా సేకరించినా చర్యలు లేకపోవడంతో ప్రగతి నిలిచిపోయింది. ఫలితంగా వాడలో ఖాళీ భూములే దర్శనమిస్తున్నాయి. 
సింగిల్‌విండో విధానం అమలేదీ..
పరిశ్రమలకు స్థలాలు తీసుకుని యూనిట్లు ఏర్పాటు చేయని వారు పలు కారణాలు సాకుగా చెబుతున్నారు. సింగిల్‌విండో పద్ధతిలో అన్ని అనుమతులు ఒకేసారి మంజూరు చేస్తామని అధికారులు ప్రకటించినా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. గతంలో ఉన్న విద్యుత్తు రాయితీని ఇప్పుడు ఎత్తేశారు. బ్యాంకర్ల నుంచి రుణాలు సక్రమంగా అందకపోవడం, ముడిసరకు కొరత, కూలీల సమస్య, విశాఖ పోర్టు దూరంగా ఉండడం వంటి సమస్యలను వారు చెబుతున్నారు. వాస్తవానికి స్థలం కోసం దరఖాస్తు చేసే ముందు ఔత్సాహికులు ఇవన్నీ తెలిసే యూనిట్ల ఏర్పాటుకు ఏపీఐఐసీతో ఒప్పందం కుదుర్చుకుంటారు. తీసుకున్న ఆరు నెలల్లో యూనిట్లు ఏర్పాటు చేయాలి. అలా జరగడం లేదు. అధికారులు మాత్రం కొందరికే నోటీసులిచ్చి సరిపెడుతున్నారు. 

ఓటీఎస్‌ వచ్చినా..
యూనిట్ల ఏర్పాటుకు గతంలో దరఖాస్తు చేసుకుని రుసుములు చెల్లించలేక స్థలాన్ని పొందలేని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల కోసం ఏపీఐఐసీ ఓటీఎస్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ఒకేసారి మొత్తాలను చెల్లించి పాత ధరకు తీసుకునే వెసులుబాటు కల్పించింది. దీని వల్ల 28 మంది ఔత్సాహికులకు లబ్ధి కలిగే అవకాశం ఉంది. దీనిపై దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు అమలు చేయలేదు.

పదేళ్లుగా కానరాని కదలిక...
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మాంగనీస్‌ ఓర్‌ ఇండియా లిమిటెడ్‌కు పదేళ్ల కిందట ఇక్కడ 220 ఎకరాలు కేటాయించారు. ప్లాంటు ఏర్పాటైతే సుమారు 1500 మందికి ఉపాధి లభిస్తుందని భావించారు. సాంకేతిక కారణాలతో నేటికీ పరిశ్రమ ఏర్పాటు కాలేదు. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో దీనిని రద్దు చేయలేదు. బీకే స్టీల్‌కు సుమారు 300 ఎకరాలు కేటాయించగా, ఏర్పాటు చేయకపోవడంతో ఏపీఐఐసీ గతేడాది స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఇందులో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. ఔత్సాహికులకు కేటాయించడం లేదు. ఇటీవల పలు రకాల యూనిట్ల కోసం ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

స్థలాలు స్వాధీనం చేసుకుంటాం 
యూనిట్ల ఏర్పాటుకు స్థలాల కోసం చాలామంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. ప్లాట్లు చూసి వెళ్తున్నారు. జాతీయ రహదారి అభివృద్ధి పనులు జరగడంతో కదలిక వచ్చింది. గతంలో స్థలాలు పొంది యూనిట్లు ఏర్పాటు చేయని వారికి నోటీసులు ఇస్తున్నాం. వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. అవసరమైతే స్వాధీనం చేసుకుని కావాల్సిన వారికి కేటాయిస్తాం.-కృష్ణప్రసాద్, ఏపీఐఐసీ జోనల్‌ ఉప ప్రబంధకులు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని