logo

మన్యానికి ప్రభుత్వ వైద్య కళాశాల

పార్వతీపురంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు సర్కారు పచ్చజెండా ఊపింది.

Updated : 26 Nov 2022 03:51 IST

రూ.600 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు 

పార్వతీపురం జిల్లా ఆసుపత్రి ఎదుట సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి  నిర్మాణానికి గుర్తించిన  స్థలమిది. ఇక్కడ రూ.50 కోట్లతో నిర్మించేందుకు  రెండేళ్ల కిందట ముఖ్యమంత్రి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. నేటికీ పనులు మొదలు కాలేదు.


పార్వతీపురం, పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: పార్వతీపురంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు సర్కారు పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో కళాశాల లేని పార్వతీపురం మన్యం జిల్లాలోనూ ఏర్పాటు చేస్తామని ఆగస్టు 27న ముఖ్యమంత్రి ప్రకటించారు. అందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ రూ.600 కోట్లతో వైద్య కళాశాల, బోధనాసుపత్రి, వసతి, నివాస గృహాలు, అనుబంధ నిర్మాణాలు, నర్సింగ్‌ కళాశాల ఏర్పాటుకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి.
సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి అనుబంధంగా వైద్య కళాశాల ఏర్పాటు చేస్తారా.. లేదా వేరే చోట నిర్మాణం చేపడతారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కళాశాల ఏర్పాటుకు కనీసం 30 ఎకరాల భూమి అందుబాటులో ఉండాలి. పార్వతీపురం పట్టణ  సమీపంలో ఎక్కడా అంత భూమి లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆసుపత్రికి అనుబంధంగానే కళాశాల ఏర్పాటవుతుందని భావిస్తున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి.

ఆదేశాలు రావాల్సి ఉంది

వైద్య కళాశాల ఏర్పాటుకు రూ.600 కోట్లతో ఉత్తర్వులు వచ్చాయి. దీనికి సంబంధించిన విధివిధానాలు, నిర్మించాల్సిన ప్రాంతం తదితర అంశాలు తేలాల్సి ఉంది. త్వరలో ఉన్నతాధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. అక్కడి నుంచి ఆదేశాలు వస్తే క్షేత్రస్థాయిలో పనులు చేపట్టేందుకు ఇంజినీరింగ్‌ యంత్రాంగం సిద్ధంగా ఉంది.

సత్యప్రభాకర్‌, కార్యనిర్వాహక ఇంజినీరు, ఏపీఎంఐడీసీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని