logo

మంజూరు 310.. మొదలైంది ఒక్కటే!

గత నాలుగేళ్లలో సాగునీటి చెరువులు నిర్వహణకు నోచుకోలేదు. నీరు వచ్చే వీలు లేక రైతులకు నిరాశ తప్పడం లేదు. దీంతో 35 వేల ఎకరాల ఆయకట్టులో పంటల సాగు ప్రశ్నార్థకమైంది.

Published : 26 May 2023 02:53 IST

చెరువుల అభివృద్ధి పనుల తీరు..
35వేల ఎకరాలకు అందని నీరు!
న్యూస్‌టుడే, శృంగవరపుకోట

గత నాలుగేళ్లలో సాగునీటి చెరువులు నిర్వహణకు నోచుకోలేదు. నీరు వచ్చే వీలు లేక రైతులకు నిరాశ తప్పడం లేదు. దీంతో 35 వేల ఎకరాల ఆయకట్టులో పంటల సాగు ప్రశ్నార్థకమైంది. ఇదీ శృంగవరపుకోట నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి.

శృంగవరపుకోట జల వనరుల శాఖ సబ్‌ డివిజన్‌ పరిధిలో ప్రపంచ బ్యాంకు, జైకా నిధులతో మాత్రమే చెరువుల అభివృద్ధి పనులు జరిగాయి. ఉపాధి హామీ పథకం కింద పూడిక, మట్టి తవ్వకాలు చేపడుతున్నా.. కాంక్రీటు పనులు జరగడం లేదు. ఈ సాగునీటి వనరుల్లో కొట్టుకుపోయిన చప్టాలు, కుంగిన మదుములు బాగుపడలేదు. మరికొన్ని కట్టడాలు బీటలు వారి లీకవుతుండటంతో నీరు వృథాగా పోతోంది. దీంతో పంటల సాగుకు రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గంలో రూ.29.07 కోట్లతో 310 సాగునీటి చెరువులు, కాలువల పనులను ప్రతిపాదించగా మంజూరు చేశారు. వీటిలో ఒక్కటే ప్రారంభమైంది. ఖరీఫ్‌ సీజన్‌ సమీపిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ పరిస్థితి: ప్రజాప్రతినిధులు, రైతులు చెరువుల పనులు చేపట్టడానికి ముందుకు రావడం లేదు సాగునీటి సంఘాలు లేకపోవడంతో సర్పంచుల ఆధ్వర్యంలో పనులు జరగాల్సి ఉంది. గతంలో జలవనరుల శాఖ పనులంటే నాయకులు, గుత్తేదారులు ముందుకొచ్చేవారు. బిల్లుల సమస్యతో ఇప్పుడు స్పందించడం లేదు.  

ఎన్‌.కోట మండలం భీమాళిలో మిడతానవాని చెరువుకు రూ.8 లక్షలు మంజూరైంది. సబ్‌ డివిజన్‌ పరిధిలో ఇదొక్కటే ప్రారంభమైంది. దీనిని ఆయకట్టుదారులే చేపట్టారు. బీ ఎస్‌.కోట మండలంలో 2,200 ఎకరాలకు సాగునీరందించే చిలకలగెడ్డ ఆనకట్ట ద్వారా చెరువులకు నీరందించే కాలువలు తుప్పలతో నిండాయి. ఆనకట్టలో షట్టర్లు దెబ్బతినడంతో నీరంతా కిందకు పోతోంది. దీని కింద భర్తాపురం వద్ద డివిజన్‌ డ్యామ్‌ శిథిలావస్థకు చేరింది. బీ వేపాడ మండలంలో విజయరామసాగరం, భీమునిబంద, రాయుడు చెరువుల అభివృద్ధికి 20017-18లో ప్రపంచ బ్యాంకు నిధులు రూ.2.59 కోట్లు మంజూరైనా 15 శాతం పనులే జరిగాయి. బీ జామి మండలంలో తాటిపూడి జలాశయం పరిధిలో జామి-అన్నంరాజుపేట (జేఏ) ఛానల్‌ డొంకలతో నిండి 3 వేల ఎకరాలకు నీరందని పరిస్థితి.  


కుంగిన మదుములు...: ఎస్‌.కోట మండలం ధర్మవరం పంచాయతీ పరిధిలో 100 ఎకరాల ఆయకట్టు ఉన్న నారి చెరువులో రెండు మదుములు కుంగిపోవడంతో నీరు కిందకు పారడం లేదు. బీ కృష్ణాపురం పాత్రునివాని చెరువులో ఆరు ముదుములకు గానూ మూడు కుంగిపోయాయి. బీ రేవళ్లపాలెం కంసాలి బందలో రెండు మదుములు దెబ్బతిన్నాయి. బీ సీతారాంపురంలో పీఎస్‌ ఛానల్‌ నుంచి కంచూడివాని చెరువుకు నీరొచ్చే కాలువ తుప్పలతో రూపుమారింది. బీ ఆలుగుబిల్లిలో రాజుచెరువు, కొత్తచెరువుల్లో రెండు మదుములు శిథిలమయ్యాయి. చామలాపల్లిలో చిన్నయ్య చెరువు చప్టా దెబ్బతింది.  

ఇక గగనమే...: వేసవికాలం పూర్తికావస్తుండడంతో ఇక చెరువు పనులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం అడపా దడపా వర్షాలు కురుస్తుడడంతో వీటిలో కొంత నీరు చేరింది.. మదుములు, చప్టాల పనులు చేపట్టలేని దుస్థితి. నవంబరు నుంచి పనులు ప్రారంభించి ఉంటే పూర్తయ్యేవని రైతులు అంటున్నారు.


అన్నిచోట్లా పనులు చేపడతాం

- శ్రీనివాస్‌, డీఈ, జల వనరులశాఖ సబ్‌ డివిజన్‌, శృంగవరపుకోట

సాగునీటి చెరువుల మరమ్మతులు చేపట్టాలని సర్పంచులను కోరుతున్నాం. వర్షాకాలానికి ఇంకా సమయం ఉన్నందున పనులు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. భీమాళి మిడతానివాని చెరువులో 70 శాతం మేర పూర్తయ్యాయి. మిగతా చెరువుల్లో పనులకు చర్యలు చేపడతాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు