logo

ఎస్సై వేధింపులకు యువకుడి ఆత్మహత్యాయత్నం!

ఎస్సై తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఓ యువకుడు సామాజిక మాధ్యమాల్లో సెల్ఫీ వీడియో పోస్ట్‌ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లిలో జరిగింది.

Published : 10 Aug 2022 04:16 IST


సెల్ఫీ వీడియోలో మాట్లాడుతున్న సాంబరాజు

ఐనవోలు, న్యూస్‌టుడే: ఎస్సై తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఓ యువకుడు సామాజిక మాధ్యమాల్లో సెల్ఫీ వీడియో పోస్ట్‌ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లిలో జరిగింది. బాధితుడు, గ్రామస్థుల కథనం ప్రకారం.. కక్కిరాలపల్లి శివారు ప్రాంతంలోని వడ్డెరగూడెం బోడ గుట్ట సమీపంలో కాశ, వడ్డెర కులస్థులు కొన్నేళ్లుగా నివాసముంటున్నారు. ఈ నెల 7న ఐనవోలు ఎస్సై జి.వెంకన్న గూడేనికి వెళ్లగా పేలుడు పదార్థాలను గుర్తించి ముగ్గురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ముగ్గురిలో ఒకడైన గోస సాంబరాజును పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని ఎస్సై వేధించాడు. దీనికి తోడు అతడి కంప్రెషర్‌ ట్రాక్టర్‌కు ఫైనాన్స్‌ చెల్లించలేదని అధికారులు లాక్కెళ్లారు. ఎస్సై వేధిస్తుండటం, పైనాన్స్‌ అధికారులు ట్రాక్టర్‌ను తీసుకెళ్లడంతో మనస్తాపం చెందిన సాంబరాజు సెల్ఫీ వీడియో చిత్రీకరించి గ్రామానికి చెందిన వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేసి పురుగుల మందు తాగాడు. అటుగా వెళ్లిన రవీందర్‌ అతణ్ని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య రాజేంద్ర 100కు డయల్‌ చేసి ఫిర్యాదు చేశారు.

నిబంధనల ప్రకారమే వ్యవహరించా : - గుగులోతు వెంకన్న, ఎస్సై, ఐనవోలు
అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు ఉపయోగిస్తూ బండరాళ్లను బ్లాస్ట్‌ చేస్తున్నట్లు సమాచారం రాగా తనిఖీ చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం. నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశా. ఫోన్‌ చేసి వేధించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని