logo

విద్యాసంస్థల స్థాపనలో చెరగని ముద్ర ‘ఇటికాల’

ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు, విద్యా సంస్థలు ఉండాలని గుర్తించి అందుకు అనుగుణంగా కృషి చేసి వరంగల్‌ను విద్యాకేంద్రంగా మలిచారు ఇటికాల మధుసూదనరావు.

Updated : 10 Nov 2023 06:12 IST

నెహ్రూతో ఇటికాల మధుసూదనరావు

ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు, విద్యా సంస్థలు ఉండాలని గుర్తించి అందుకు అనుగుణంగా కృషి చేసి వరంగల్‌ను విద్యాకేంద్రంగా మలిచారు ఇటికాల మధుసూదనరావు. వరంగల్‌ ఎన్‌ఐటీ(ఆర్‌ఈసీ), కాకతీయ మెడికల్‌ కళాశాల ఆయన కృషి వల్లే వచ్చాయి. ఆర్య సమాజ్‌ను వరంగల్‌లో విస్తృతం చేసి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు, సాయుధ ప్రతిఘటన ఉద్యమకారుడిగా పేరు సంపాదించుకున్నారు. అనేక సంస్థలు, కమిటీలలో చురుగ్గా పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం భీంపల్లి గ్రామంలోని ఇటికాల బుచ్చయ్య, గోవిందమ్మ దంపతులకు జన్మించిన ఈయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నర్సింహారావు మధుసూదనరావు మెమోరియల్‌ పేరుతో విద్యా సంస్థను నడిపారు. 

న్యూస్‌టుడే, కాజీపేట

సాయుధ ప్రతిఘటన ఉద్యమకారుడు

1918 ఏప్రిల్‌ 5న జన్మించిన ఇటికాల 1963లో అనసూయదేవితో వివాహం జరిగింది.  ఆర్య సమాజ్‌లో వీరదళంలో కమాండర్‌గా పాల్గొంటూ, ఉర్దూకు బదులు హిందీని అధికార భాషగా ప్రోత్సహించారు.  1942లో క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో నిర్భయంగా వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయ్యారు. 1947లో రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటన ఉద్యమంలో చురుకుగా పాల్గొని పలుసార్లు జైలు జీవితం గడిపారు. పాఠశాలల్లో గ్రంథాలయాలు, విద్యా వనరుల కేంద్రాలను నెలకొల్పి, విజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడానికి కృషి చేశారు.
ః మధుసూదన్‌రావు రాజకీయంగా కూడా ఎదిగారు. 1957, 1962లో మానుకోట (ఇప్పటి మహబూబాబాద్‌) నుంచి రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు.

తిరుపతి నుంచి వరంగల్‌కు ఆర్‌ఈసీ

భారత ప్రధాని నెహ్రూతో ఉన్న సంబంధాలతో వరంగల్‌ను విద్యాకేంద్రంగా అభివృద్ధి చేయగలిగారు. అప్పట్లో రీజినల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలను తిరుపతిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇటికాల నెహ్రూకు వరంగల్‌ వెనుకబాటు గురించి తెలియజేయడంతో అక్టోబరు 10, 1959న నెహ్రూతో దానికి శంకుస్థాపన జరిగింది. మొదట్లో బాలసముద్రంలో కొన్ని రేకుల షెడ్లలో ఆర్‌ఈసీ కొన్ని కోర్సులతో నడిచింది. క్రమంగా భవనాల నిర్మాణం జరగడం.. దేశంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని 2002లో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)గా అవతరించింది. కాకతీయ మెడికల్‌ కళాశాల మొదట్లో ప్రైవేటు వారు నడిపించే వారు. దీనిని ప్రభుత్వ రంగంలోకి తీసుకు వచ్చారు. పోచంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ఈయన పాత్ర చెప్పుకోదగింది.

వరంగల్‌ నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా(1948), జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక సభ్యుడిగా చేశారు.

వరంగల్‌ హిందీ మహా విద్యాలయం మేనేజింగ్‌ కమిటీ అధ్యక్షుడిగా, వరంగల్‌ జిల్లా ఆదివాసి సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా(1950), జిల్లా వెనకబడిన తరగతుల సంఘం, హరిజన సంఘం వ్యవస్థాపకుడిగా, తెలంగాణ ఆదివాసీ సేవా సంఘం సలహా సభ్యుడిగా, లేబర్‌ సలహా సంఘం బోర్డు సభ్యుడిగా, వరంగల్‌ భారతీయ కళామందిర్‌ అధ్యక్షుడిగా, వరంగల్‌ జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షుడిగా చేశారు.


విగ్రహం ఏర్పాటుకు డిమాండ్‌

ఇటికాల మధుసూదనరావు విగ్రహం ఎన్‌ఐటీలో ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌ ఉంది.   కళాశాల ఉద్యోగులు, ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆయన వర్ధంతి, జయంతిని కళాశాల ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిర్వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని