logo

అమ్ముడుపోని తునికాకు యూనిట్లు

ఈ ఏడాదిలో తునికాకు కూలీల ఉపాధికి పెద్ద మొత్తంలో గండి పడనుంది. జిల్లా వ్యాప్తంగా 16 తునికాకు యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.

Published : 28 Apr 2024 01:39 IST

ఉపాధి కోల్పోనున్న కూలీలు 

చిగురిస్తున్న తునికాకు

భూపాలపల్లి, న్యూస్‌టుడే: ఈ ఏడాదిలో తునికాకు కూలీల ఉపాధికి పెద్ద మొత్తంలో గండి పడనుంది. జిల్లా వ్యాప్తంగా 16 తునికాకు యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. మిగతా 19 యూనిట్లలో ఆకు సేకరణ నిలిచిపోవడంతో ఆయా అటవీ గ్రామాలకు చెందిన వేలాది మంది కూలీలకు వేసవిలో ఉపాధి లేకుండా పోయింది. వేసవిలో వ్యవసాయ పనులు అంతగా లేెకపోవడంతో అటవీ గ్రామాలకు చెందిన వేలాది మంది కూలీలు తునికాకు సేకరణతో ఉపాధి పొందుతారు. తునికాకు సేకరణ మే మొదటి వారంలో ప్రారంభించనున్నారు. టెండర్లు పొందిన గుత్తేదారులు ఆకు సేకరణ చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ మేరకు జిల్లాలోని చాలా వరకు అటవీ గ్రామాల్లో అనేక మంది కూలీలు ఆకు సేకరణపైనే ఆధారపడతారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలోనే అడవి బాటపడతారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల్లోపే ఆకును సేకరించుకొని మళ్లీ ఇంటికి చేరుకుంటారు. ఇళ్లలోనే కుటుంబ సభ్యులందరూ కలిసి కట్టలు కట్టి, వాటిని విక్రయించి ఆదాయం సమకూర్చుకుంటారు. ఏటా కూలీలు, కొందరు వ్యవసాయ రైతులు తునికాకు సేకరణపైనే ఆసక్తి చూపుతారు.

 జిల్లాలోని రెండు అటవీ డివిజన్‌లలో మొత్తం 35 వరకు తునికాకు యూనిట్లు ఉన్నాయి. యూనిట్ల వారీగా ఆన్‌లైన్‌లోనే టెండర్లు నిర్వహించారు. ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు నాలుగుసార్లు చేపట్టిన తునికాకు యూనిట్ల టెండర్లలో జిల్లావ్యాప్తంగా కేవలం 16 యూనిట్ల వరకే అమ్ముడుపోయాయి. మిగతా 19 యూనిట్లలో ఆకు సేకరణ కోసం గుత్తేదారులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ యూనిట్లలో ఆకు సేకరణ దాదాపు నిలిచిపోయినట్లే.. అమ్ముడుపోయిన యూనిట్లలోనే గుత్తేదారులు ఆకు సేకరిస్తారు. అయితే ముందుగా నాణ్యతగా తునికాకు రావడానికి కొందరు గుత్తేదారులు కొమ్మకొట్టడం(ప్రూనింగ్‌) చేయిస్తారు. కానీ, ఈ పని కూడా కొన్నేళ్లుగా చాలా వరకు యూనిట్లలో గుత్తేదారులు చేపట్టలేకపోతున్నారు.

ఆకు సేకరణ లక్ష్యం..

జిల్లాలోని మహదేవపూర్‌, భూపాలపల్లి అటవీ డివిజన్‌లలో మొత్తం 35 తునికాకు యూనిట్‌లలో ఈ ఏడాదిలో 38,400 స్టాండర్డ్‌ బ్యాగుల(ఎస్‌బీ) లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. ఇందులో భూపాలపల్లి అటవీ డివిజన్‌లో 19 యూనిట్లకు 19,800 ఎస్‌బీల లక్ష్యం కాగా, ఈ డివిజన్‌లో మొత్తం కల్లాలు 119 వరకు ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ డివిజన్‌ పరిధిలో కేవలం 5 యూనిట్లు అమ్ముడుపోగా మిగతా 14 అమ్ముడుపోలేదు. అదేవిధంగా మహదేవపూర్‌ డివిజన్‌లో 16 యూనిట్లలో 20,100 ఎస్‌బీల లక్ష్యం.. ఈ డివిజన్‌లో మొత్తం 112 కల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ డివిజన్‌లో 11 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇంకా 5 యూనిట్లలో ఆకు సేకరణ కోసం గుత్తేదారులు ముందుకు రాలేదు. దీంతో అమ్ముడుపోని యూనిట్లలో ఆకు సేకరణ నిలిచిపోనుంది. ఒక్క ఎస్‌బీలో వెయ్యి తునికాకు కట్టలుంటాయి. ఈ లెక్క ప్రకారమే కూలీలకు డబ్బులు చెల్లిస్తారు. 50 ఆకుల తునికాకు కట్టకు రూ.రూ.1.40 పైసల చొప్పున గుత్తేదారులు చెల్లిస్తారు. ఒక ఎస్‌బీపై వచ్చే కూలీకి రూ.1,450 వరకు అందుతాయి. అయితే జిల్లావ్యాప్తంగా కూలీలు నష్టపోకుండా రెండు అటవీ డివిజన్‌లలో అమ్ముడుపోని తునికాకు యూనిట్లలో ప్రభుత్వమే ఆకు సేకరణ చేపట్టాలని పలు అటవీ గ్రామాల కూలీలు, సీపీఎం నాయకులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని